Hormuz Strait Crisis: హార్ముజ్ కోసం ఆరు దేశాల కూటమి.. ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి!

naveen
By -
హార్ముజ్ కోసం ఆరు దేశాల కూటమి


ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా 'హార్ముజ్' పేరే మార్మోగుతోంది. అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు ప్రధాన కేంద్ర బిందువైన ఈ జలసంధి.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుండెనొప్పిగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. దీంతో గత 20 రోజులుగా ఆయా దేశాలకు చెందిన వేలాది ఆయిల్ ట్యాంకర్లు ఇక్కడే నిలిచిపోయాయి. ఈ పరిణామంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్రమైన చమురు, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నాయి.


ముంచుకొస్తున్న ముప్పు.. ఆరు దేశాల ఐకమత్యం


యుద్ధం త్వరలో సద్దుమణుగుతుందని అంతా భావించిన తరుణంలో, తాజాగా ఖతార్‌లోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. ఈ విపత్కర నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఆరు ప్రధాన దేశాలు చేతులు కలిపాయి. హార్ముజ్‌లో చిక్కుకుపోయిన ఆయిల్ ట్యాంకర్లకు మార్గం సుగమం చేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ మరియు జపాన్ దేశాలు ఒక బలమైన కూటమిగా ఏర్పడ్డాయి. ఈ సముద్ర మార్గం గుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో తేల్చిచెప్పాయి.


ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం


తమ ప్రతీకార చర్యలతో ప్రపంచ దేశాలకు ఇరాన్ గ్యాస్, చమురు సంక్షోభం సృష్టించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ ఆరు దేశాలు స్పష్టం చేశాయి. ఇటీవల ఇరాన్ జరిపిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై పెను ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఉన్న దారుణమైన పరిస్థితులను చక్కదిద్ది, గ్లోబల్ ఇంధన మార్కెట్‌ను స్థిరపరచడానికి తామంతా సమిష్టిగా పనిచేస్తామని ప్రకటించాయి. సముద్ర మార్గంలో సాధారణ రవాణా సాఫీగా కొనసాగేలా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి.


అసలు ఈ సంక్షోభం ఎలా మొదలైందంటే..


గత నెల (ఫిబ్రవరి) 28వ తేదీన ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఇరాన్ భీకర ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా మద్దతు ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. అందులో భాగంగానే ప్రపంచానికి ప్రాణాధారమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీంతో తలెత్తిన చమురు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాజాగా ఐరోపా, జపాన్ దేశాలు ప్రారంభించిన ఈ సంయుక్త ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.