Global Internet Outage Fears : సముద్ర గర్భంలో కేబుళ్ల కట్టింగ్ కు ఇరాన్ ప్లాన్.. కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితులు!

naveen
By -

ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ కన్ను


Middle East Crisis: ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ కన్ను.. ప్రపంచానికి పొంచి ఉన్న పెను ముప్పు!


పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం మరింత భయానక రూపం దాల్చుతోంది. గత రాత్రి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఖతార్ ఎల్‌ఎన్‌జీ (LNG) గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ భీకర క్షిపణులతో విరుచుకుపడటంతో అంతర్జాతీయ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడితో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు సైతం ఘోరంగా పతనమయ్యాయి. ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉన్న గ్యాస్, చమురు సమస్యను ఈ ఘటన మరింత లోతైన సంక్షోభంలోకి నెట్టేసింది.


చమురు క్షేత్రాల దాడుల నుంచి తేరుకోకముందే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త భయాందోళనలు మొదలయ్యాయి. ఇరాన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుందని, వారి తదుపరి లక్ష్యం సముద్ర గర్భంలో ఉన్న ప్రపంచ ఇంటర్నెట్ కేబుళ్లేనని అంతర్జాతీయ పత్రికలు ‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’, ‘న్యూయార్క్ టైమ్స్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురించాయి. 


ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను అడ్డుకుని ఇంధన సంక్షోభాన్ని సృష్టించిన ఇరాన్.. ఇప్పుడు హౌతీ రెబల్స్‌తో కలిసి ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మోసుకెళ్లే కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను కత్తిరించబోతున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.


ఎర్ర సముద్రంలోని బాబ్ ఎలా-మండేబ్ జలసంధి గుండా ప్రపంచంలోని ప్రధాన డిజిటల్ మార్గాలు వెళ్తున్నాయి. ఈ జలసంధికి అడ్డంగా ఇప్పటికే సముద్ర మైన్‌లు (Sea mines) ఏర్పాటు చేసినట్లు సమాచారం. హోర్ముజ్, బాబ్ ఎలా-మండేబ్ ప్రాంతాల్లో ఉన్న ఈ కీలక కేబుళ్లు గనుక తెగిపోతే.. ప్రపంచవ్యాప్తంగా వీడియో కాల్స్, ఈ-మెయిల్స్, బ్యాంకింగ్, ఏఐ (AI) సేవలతో పాటు ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. 


అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి బడా టెక్ సంస్థలు గల్ఫ్ దేశాల్లో నిర్మించిన బిలియన్ డాలర్ల డేటా సెంటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నష్టం కేవలం ఫోన్‌లకే పరిమితం కాకుండా ఆసుపత్రులు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి కోవిడ్-19 కంటే భయంకరమైన పరిస్థితులు దాపురిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ప్రస్తుతం ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధిలో ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలను కలిపే కనీసం 20 సముద్రగర్భ కేబుళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్‌లోని ఏఏఈ-1, ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వంటి కేబుల్ సిస్టమ్స్ నేరుగా భారతదేశ విదేశీ డేటా కనెక్షన్‌లకు మద్దతు ఇస్తున్నాయి. 


గతంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సమయంలో హౌతీలు జరిపిన దాడులకే ఇంటర్నెట్ వేగం తీవ్రంగా పడిపోయి, మరమ్మతులకు నెలల సమయం పట్టింది. ఇప్పుడు గనుక ఇరాన్ లక్ష్యంగా చేసుకుని భారీ దాడులకు పాల్పడితే మునుపెన్నడూ చూడని రీతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా భారతదేశంతో పాటు గల్ఫ్, ఐరోపా దేశాలు కోలుకోలేని విధంగా నష్టపోతాయని ఇంటర్నెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.