హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రసాద్స్ ఐమాక్స్ (Prasads IMAX). ప్రతి వారం లాగే అప్పుడప్పుడే కొత్త సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. యూట్యూబ్ మైకులు, కెమెరాల హడావిడి మామూలే. కానీ, ఈసారి వాతావరణం కాస్త భిన్నంగా, ఉద్రిక్తంగా ఉంది. లోపల థియేటర్‌లో ప్లే అయిన సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన "ఉస్తాద్ భగత్ సింగ్". "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం" అంటూ థియేటర్‌లో విజిల్స్ వేసిన పవన్ అభిమానులు బయటకు రాగానే.. కెమెరాల సాక్షిగా ఓ ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఒక సామాన్య ప్రేక్షకుడి రివ్యూ, పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి కారణమై, ఏకంగా భౌతిక దాడికి దారితీసిన ఘటన అక్కడున్న వారందరినీ నివ్వెరపరిచింది.
"ఈ సినిమాతో సీఎం అవుతాడా?".. రగిల్చిన రివ్యూ
సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి 'ఖాతోజ్ రామాచారి' అలియాస్ 'మల్టీస్టార్ మన్మధరాజా' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా అర్థం కావాలంటే "మినిమమ్ డిగ్రీ" ఉండాలంటూ తనదైన శైలిలో రివ్యూలు చెప్పి పాపులర్ అయిన ఈ వ్యక్తి.. ఎప్పటిలాగే గురువారం ఉదయం "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా చూసి బయటకు వచ్చాడు. కెమెరాల ముందుకొచ్చి మైక్ అందుకోగానే పవన్ ఫ్యాన్స్‌కు ఏమాత్రం రుచించని మాటలు మాట్లాడాడు. "ఒకరికి హైప్ ఇవ్వడానికి ఇంకొకరిని తొక్కొద్దు. ఈ సినిమాలో మహేష్ బాబు, చిరంజీవి పాటలను కించపరిచేలా స్టెప్పులు పెట్టారు. నాకు సాంగ్స్ నచ్చలేదు.. అసలు సినిమానే నచ్చలేదు. సీఎం కావాలి.. సీఎం కావాలి అంటే, ఇలాంటి సినిమాలు తీస్తే సీఎం అవుతాడా అన్నా? ఇటువంటి మూవీస్ చేస్తే పీఎం అవుతాడా?" అంటూ ఖాతోజ్ రామాచారి కాస్త ఘాటుగానే విమర్శలు గుప్పించాడు.
మైక్ ముందు పిడిగుద్దుల వర్షం.. నెటిజన్ల ఫైర్
రామాచారి నోటి నుంచి ఆ మాటలు రాగానే అక్కడే చుట్టుముట్టి ఉన్న పవన్ కళ్యాణ్ వీరాభిమానుల రక్తం మరిగిపోయింది. "నీకు ఏం నచ్చలేదు? ఏం కావాలి కాకా?" అంటూ ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే భౌతిక దాడికి దారితీసింది. పబ్లిక్ లోనే, వందలాది మంది చూస్తుండగానే రామాచారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దెబ్బలు తింటూనే.. "ఐ లవ్ యూ పవన్.. ఆయన సీఎం కావాలి. నేను సినిమాని అంటున్నా.. పవన్ కళ్యాణ్‌ని కాదు" అని రామాచారి ఎంత మొత్తుకున్నా ఫ్యాన్స్ శాంతించలేదు. "సినిమాకి రాజకీయాలకి సంబంధమేంటిరా? సినిమా హిట్టయితే పవన్ సీఎం అవుతాడా? పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావ్?" అంటూ మరింత రెచ్చిపోయి అతడిని ఐమాక్స్ గేటు బయటకు గెంటేశారు.
తగ్గేదే లేదన్న రామాచారి.. హరీష్ శంకర్ కౌంటర్
అంతలా దెబ్బలు తిని, అవమానపడి గేటు బయటకు నెట్టబడ్డాక కూడా రామాచారి వెనక్కి తగ్గలేదు. చిరిగిన చొక్కాతోనే మళ్లీ మైక్ అందుకుని, "మినిమమ్ డిగ్రీ ఉంటేనే పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయండి. లేకపోతే లేదు. ఆయన రేంజ్ ఎప్పుడూ తగ్గకూడదు. ఇలాంటి సినిమాలు తీస్తే ఆయన రేంజ్ పడిపోతుంది" అంటూ తన స్టైల్‌లో ఫైర్ అయ్యాడు. ఈ మొత్తం తతంగం రికార్డ్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. సినిమా చూసి తన వ్యక్తిగత అభిప్రాయం చెబితే, ఇలా భౌతికంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ నెటిజన్లు పవన్ ఫ్యాన్స్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మరోవైపు, సినిమాకు మిశ్రమ స్పందన వస్తుండగా.. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన దర్శకుడు హరీష్ శంకర్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. "పవన్ కళ్యాణ్‌ని అద్భుతంగా చూపించడం కాకుండా.. ఇంకో అద్భుతమైన కథ, అద్భుతమైన కళాఖండాన్ని నా నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేసుంటే, దయచేసి నన్ను క్షమించండి. నాకు ఇదే వచ్చు. ఇలానే చేస్తాను" అని కుండబద్దలు కొట్టారు. మొత్తానికి "ఉస్తాద్ భగత్ సింగ్" బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుందో లేదో కానీ, థియేటర్ల బయట మాత్రం ముష్టిఘాతాలతో నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది.
Also Read:
Gaddar Awards 2025: హైదరాబాద్ గడ్డపై కమల్ ఎమోషనల్ స్పీచ్.. చిరుతో బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు!Gaddar Cine Awards 2025: తెలంగాణ కోడలిని.. నన్ను ఆదరించండి: వేదికపై రష్మిక ఎమోషనల్!
Kantara Controversy: సొంత సినిమాకే షాక్ ఇచ్చిన రిషబ్ శెట్టి
Megastar Chiranjeevi Latest: బ్లడ్ బ్యాంక్ తర్వాత మరో మహాత్కార్యం.. పేదలకు ఉచిత విద్య
Dhurandhar 2 Records: పుష్ప 2 రికార్డు బ్రేక్
Ustaad Bhagat Singh Review: ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ, రేటింగ్
Dhurandhar 2: ఇంటర్నేషనల్ స్వాగ్.. రణవీర్ సింగ్ 'ధురంధర్ 2'పై అల్లు అర్జున్ సూపర్ రివ్యూ!

