Iran Crisis: 94 కోట్ల రివార్డ్.. ఇజ్రాయెల్ గురి.. ఊహాగానాల నడుమ ఎట్టకేలకు తెరపైకి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్!

naveen
By -
ఎట్టకేలకు బయటికొచ్చిన మోజ్తాబా


మధ్యప్రాచ్యంలో మంటలు ఇంకా ఆరలేదు. ఎటు చూసినా క్షిపణుల మోతలు, రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమైన నాటి నుంచి.. ఆ దేశ నాయకత్వం చుట్టూ ఒక అంతుచిక్కని నిశ్శబ్దం అలుముకుంది. ఆయన వారసుడిగా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ ఇంతకాలం ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. ఆయన కన్నుమూశారని కొందరు, తీవ్ర గాయాలతో రష్యాలో రహస్యంగా చికిత్స పొందుతున్నారని మరికొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించాయి. ఈ ఉత్కంఠభరిత వాతావరణం మధ్య, ఏకంగా మోజ్తాబా ఆచూకీ తెలిపిన వారికి సుమారు 94 కోట్ల రూపాయల భారీ నజరానాను అమెరికా ప్రకటించడం ఆధిపత్య పోరులో సరికొత్త ప్రకంపనలు సృష్టించింది.


అగ్రరాజ్యం వల.. ఇజ్రాయెల్ డెత్ వార్నింగ్


ఒకవైపు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు మోజ్తాబా ఖమేనీ జాడ కోసం కోట్లు కుమ్మరించి గాలిస్తుండగా, మరోవైపు ఇజ్రాయెల్ బహిరంగంగానే డెత్ వార్నింగ్ ఇచ్చింది. మోసాద్ ఏజెంట్లు మోజ్తాబాను కూడా విడిచిపెట్టబోరని, ఆయన తండ్రికి పట్టిన గతే కొడుకుకూ పడుతుందంటూ ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. 


అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండాల్సిన ఒక దేశపు అత్యున్నత నాయకుడి కోసం అగ్రరాజ్యాలు ఇలా బహిరంగంగా వేట మొదలుపెట్టడం మధ్యప్రాచ్యంలో వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మోజ్తాబా బతికి ఉన్నాడా లేదా అన్నది ఇరాన్ పౌరులతో పాటు యావత్ ప్రపంచానికి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


సస్పెన్స్ నడుమ తెరపైకి మోజ్తాబా.. వీడియో అసలుదేనా?


సరిగ్గా ఇలాంటి ఊపిరిసలపని ఉత్కంఠ మధ్య ఇరాన్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ (IRIB) అనూహ్యంగా ఒక వీడియోను విడుదల చేసి బాంబు పేల్చింది. ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న మోజ్తాబా ఖమేనీ.. ఒక భారీ హాల్‌లో తన అనుచరుల మధ్య మత ప్రబోధ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అరుదైన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఆయన పూర్తి ఆరోగ్యంతో, ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నట్లు అందులో ఉంది. 


అయితే, ఈ వీడియో అప్పుడే కొత్త అనుమానాలకు తెరతీసింది. చూసేందుకు ఫుటేజ్ కాస్త పాతదిగా కనిపిస్తుండటంతో, ఇది తాజా వీడియోనా లేక రికార్డెడ్ వీడియోనా అన్న దానిపై తీవ్ర గందరగోళం నెలకొంది. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన కనీసం ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాకపోవడం, ఇప్పుడు హఠాత్తుగా ఆయన ఆరోగ్యంపై వదంతులు చెలరేగుతున్న సమయంలోనే ఈ వీడియో బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజల్లో మనోధైర్యం నింపేందుకే ఇరాన్ ప్రభుత్వం ఈ పాత వీడియోను వాడుకుంటోందా అన్న చర్చ నడుస్తోంది.



నెత్తురోడిన ఫిబ్రవరి 28.. రగులుతున్న హార్ముజ్ జలసంధి


అసలు ఈ సంక్షోభానికి బీజం పడింది గత నెల ఫిబ్రవరి 28న. ఆ చీకటి రోజున ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో పాత సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ప్రభుత్వంలోని అనేక మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ నెత్తుటి గాయానికి ప్రతీకారంగానే ఇరాన్ ఇప్పుడు భీకర దాడులకు తెగబడుతోంది. 


అమెరికా మద్దతు ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తూనే, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది. సముద్ర మార్గంలో ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో యావత్ ప్రపంచం ఇప్పుడు గ్యాస్, చమురు సంక్షోభపు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. కంటికి కనిపించని మోజ్తాబా నాయకత్వంలో ఇరాన్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుందోనని ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి.