అది ముంబైలోని కిక్కిరిసిన బీచ్. ఒకవైపు సముద్రపు అలల హోరు.. మరోవైపు ఎవరి హడావిడిలో వారున్న జనం. ఇంతటి జనసంద్రంలోనూ ఎంతోమంది మనసులు ఒంటరితనంతో కుమిలిపోతున్నాయి. సరిగ్గా ఈ నిశ్శబ్ద రోదనను పసిగట్టిన ఒక యువకుడు.. చేతిలో ఒక ప్లకార్డు పట్టుకుని ఇసుక తిన్నెలపై నిలబడ్డాడు. ఆ బోర్డుపై హిందీలో "ఎవరికైనా తమ బాధను చెప్పుకోవాలనుకుంటే, నేను వింటాను" అని రాసి ఉంది. వినడానికి చాలా వింతగా, కాస్త ఆత్మీయంగా అనిపిస్తున్న ఈ దృశ్యం వెనుక.. అక్షరాలా ఒక బిజినెస్ మోడల్ దాగి ఉంది. అవును, ఆకాశహర్మ్యాల నగరంలో ఇప్పుడు కన్నీళ్లకు కూడా వెల కట్టబడుతోంది!
బాధల కొలత.. రేట్ల మోత: కన్నీళ్లకో రేటు, కౌగిలింతకో రేటు!
ఆ యువకుడి పేరు పృథ్వీరాజ్ బోహ్రా. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వీడియోలు చేసే ఇతగాడు.. ఇప్పుడు ముంబై బీచ్‌లో సరికొత్త 'స్టార్టప్' మొదలుపెట్టాడు. ఎవరైనా తమ బాధను పంచుకోవాలనుకుంటే వినడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ, దానికి కచ్చితమైన రేటు కార్డు కూడా ఫిక్స్ చేశాడు. చిన్న చిన్న సమస్యలు చెప్పుకుంటే రూ. 250, కాస్త పెద్ద సమస్యలు అయితే రూ. 500.. ఇక నా పక్కన కూర్చుని మనసారా ఏడ్వాలి అనుకుంటే ఏకంగా రూ. 1,000 వసూలు చేస్తున్నాడు.
ఇది వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా, డబ్బులు ఇచ్చి మరీ తమ బాధలు చెప్పుకోవడానికి జనాలు నిజంగానే వస్తున్నారా అని అడిగితే.. "అవును, వస్తున్నారు" అంటూ పృథ్వీరాజ్ ఇచ్చిన సమాధానం సమాజంలో వేళ్లూనుకున్న భయంకరమైన ఒంటరితనానికి అద్దం పడుతోంది.
🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.
— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026
REPORTER : Do people come? 🤯
MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl
మహానగరాల్లో మనుషుల మధ్య పెరుగుతున్న దూరం
పృథ్వీరాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆన్‌లైన్ వేదికగా పెద్ద చర్చే మొదలైంది. ఉరుకులు పరుగుల జీవితంలో కనీసం మనసులోని భారాన్ని దించుకోవడానికి నలుగురు ఆత్మీయులు కరువైన ఈ రోజుల్లో, ఇలాంటి ప్రయత్నం నిజంగా ఒక ఊరటనిస్తుందని కొందరు ప్రశంసిస్తున్నారు.
మానసిక ఆరోగ్య నిపుణులు సైతం ఈ ట్రెండ్ వెనుక ఉన్న తీవ్రమైన సమస్యను ఎత్తిచూపుతున్నారు. చౌకైన, సరైన మానసిక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, నానాటికీ పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే ప్రజలు ఇలాంటి అశాస్త్రీయమైన, అనధికారిక మార్గాలను ఆశ్రయిస్తున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక వైరల్ వీడియో కాదు.. మహానగరాల్లో ప్రబలుతున్న ఒంటరితనపు మహమ్మారికి సజీవ సాక్ష్యం.
నెట్టింట భగ్గుమంటున్న విమర్శలు.. ఉచిత సలహాల వెల్లువ
అయితే, ఈ 'పెయిడ్ లిజనింగ్' వ్యవహారంపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు సరదాగా ఇదేదో భలే బిజినెస్ మోడల్ లా ఉందే, నెక్స్ట్ బిగ్ స్టార్టప్ ఐడియా ఇదే అని సెటైర్లు వేస్తుండగా.. మరికొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక నెటిజన్ చేసిన కామెంట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
తమ ప్రాంతంలో ఎవరైనా బాధల్లో ఉంటే బిల్లులు వేయకుండా మనసారా వినే మనుషులు, కమ్యూనిటీలు ఉన్నాయని, కానీ మెట్రో నగరాల్లో మనుషుల బాధలను కూడా ఎలా అమ్ముకుంటున్నారో ఈ వీడియో బట్టబయలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
సరైన అర్హత లేని వ్యక్తులు ఇలా మానసిక క్షోభను క్యాష్ చేసుకోవడం వల్ల.. సరైన వైద్యం అందక సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. ముంబై బీచ్‌లో మొదలైన ఈ 'కన్నీళ్ల వ్యాపారం' ఆధునిక సమాజపు ఒంటరితనంపై ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది.
Also Read:
Eid-ul-Fitr 2026 : నెలవంక రాకతో భువిపైకి దిగొచ్చిన పండుగ.. అంబరాన్నంటిన సోదరభావం!Delhi Weather Report: మాడు పగిలే ఎండల నుంచి గజగజ వణికించే చలికి.. దేశ రాజధానిలో ప్రకృతి విచిత్రం!
Supreme Court : భార్య పనిమనిషి కాదు.. వంట చేయకపోవడం క్రూరత్వం కాదన్న సుప్రీంకోర్టు!
Air India Crash Report: ఎయిరిండియా విమాన ప్రమాదంపై సంచలనం.. 11 ఏళ్లుగా అదే లోపం!
Russian Oil to India: చైనాకు వెళ్తున్న 7 రష్యా ఆయిల్ ట్యాంకర్లు ఇండియాకు మళ్లింపు.. అసలేం జరుగుతోంది?
Tamil Nadu Elections: అమిత్ షాతో త్రిష చర్చలు? పొత్తుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన విజయ్

