Jeevan Reddy: ఇంట్లో ఉడుములా దూరి కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టాడు.. ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో వివాదం మరింత ముదురుతోంది. తనతో కలిసి పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చిన ఆఫర్‌పై సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకునే పరిస్థితి తీసుకువచ్చింది సంజయేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆఫర్ ఇవ్వడానికి నువ్వెవరు? ముందు పార్టీ తేల్చుకో!
అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో ముందు తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ రికార్డుల ప్రకారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, కానీ బయట మాత్రం కాంగ్రెస్‌లో కలిసి పనిచేయాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు.
"నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు? నేను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా? మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టిందే అతను. ఎంత ఇబ్బంది ఉంటే నాలుగు దశాబ్దాల పార్టీని వీడాలనే ఆలోచన వస్తుందో అర్థం చేసుకోవాలి" అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఇంట్లో ఉడుము దూరినట్టే..
తాను కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానని, కానీ పరిస్థితులు అలా నెట్టేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇంట్లో ఉడుము వస్తే.. ఇల్లు విడిచిపెట్టి వెళ్లినట్లు, సంజయ్ ఒక ఉడుములా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడు" అని ఘాటుగా విమర్శించారు.
రాజ్యాంగాన్ని పాటించని వ్యక్తి తనకు నీతులు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన అడబిడ్డను చైర్మన్ సీటు నుంచి దించేశాడని ఆరోపించారు.
జగిత్యాల అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెబుతున్న సంజయ్.. 20 నెలలైనా యావర్ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని నిలదీశారు.
ఆ 10 మంది ఎమ్మెల్యేలను దూరం పెట్టాల్సిందే!
తన ప్రస్తుత అసంతృప్తికి కేవలం సంజయ్ మాత్రమే కాకుండా, పార్టీ అధిష్టానం తీరు కూడా కారణమేనని జీవన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.
ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలులో జాప్యం జరుగుతోందని, ప్రజల్లో అసంతృప్తి ఉందని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
తాను ఒక్కడిని పార్టీ వీడితే కాంగ్రెస్ ఆగిపోదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రస్తుత సమస్యలకు పరిష్కారం దొరకాలంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను అధిష్టానం దూరం పెట్టాలని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు.

