ప్రపంచ చమురు మార్కెట్‌ను శాసించే సరికొత్త చదరంగం! ఎక్కడో సముద్రాల ఆవల జరుగుతున్న యుద్ధం వెనుక దాగిన అసలు రహస్యం ముడిచమురు! అవును.. గ్లోబల్ ఇంధన సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక భయంకరమైన, వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై అగ్రరాజ్యం ఏకఛత్రాధిపత్యం సాధించబోతోందా?
వెనిజులా నుంచి క్యూబా వరకు.. ఇరాన్ నుంచి రష్యా వరకు ట్రంప్ వేస్తున్న అడుగులు చూస్తుంటే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఎవరు చమురు అమ్మాలి? ఎవరు కొనాలి? ఏ మార్గంలో వెళ్లాలి? దాని ధర ఎంత ఉండాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కేవలం 'అమెరికా' మాత్రమే అయ్యేలా ట్రంప్ తన సరికొత్త "ఆయిల్ డాక్ట్రిన్" (చమురు సిద్ధాంతం) రచిస్తున్నారు.
గత ఏడాది పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ప్రపంచ చమురు సరఫరాను శాసించడం, ప్రత్యర్థులకు ఇంధనం దక్కకుండా అడ్డుకోవడం, కీలకమైన సముద్ర మార్గాలను (చోక్‌పాయింట్స్) చేజిక్కించుకోవడం ద్వారా గ్లోబల్ డిమాండ్‌ను ఆయన కంట్రోల్ చేస్తున్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు రెండో నెలకు చేరుకుంది. సరిగ్గా ఈ సమయంలో ట్రంప్ తన వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చారు. "ఇరాన్‌లోని ఆయిల్‌ను లాక్కోవడం నాకెంతో ఇష్టమైన పని" అంటూ ఆయన బాంబు పేల్చారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ప్రధాన ఎగుమతి కేంద్రం 'ఖర్గ్ దీవి'ని వశం చేసుకునే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "మేము ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవచ్చు, లేదా చేసుకోకపోవచ్చు.. మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి" అని స్పష్టం చేశారు. అయితే, ఆ దీవిని పట్టుకోవాలంటే అమెరికా బలగాలు సుదీర్ఘకాలం అక్కడ ఉండాల్సి వస్తుందని ఆయన అంగీకరించారు. ఖర్గ్ దీవిలో ఇరాన్ రక్షణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని, దానిని చాలా సులభంగా తమ వశం చేసుకోవచ్చని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
గతంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించిన తర్వాత, ఆ దేశ చమురు పరిశ్రమను శాశ్వతంగా అమెరికా గుప్పిట్లో ఉంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వ్యూహాత్మక ఇంధన ఆస్తులపై అమెరికా ఆధిపత్యాన్ని ఎలా విస్తరిస్తోందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం.
రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై సుంకాలు (టారిఫ్‌లు) విధించడం నుంచి, ఇప్పుడు ఇరాన్ ఖర్గ్ దీవిని, హార్మూజ్ జలసంధిలో నౌకల కదలికలను కంట్రోల్ చేయడం వరకు.. ట్రంప్ లక్ష్యం పగటిపూట సూర్యుడిలా స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే.. ప్రపంచ చమురు ఆర్థిక వ్యవస్థ వాషింగ్టన్ కనుసన్నల్లోనే నడవాలి!
మూలాలను గుప్పిట్లో పెట్టుకోవడం: వెనిజులాపై ట్రంప్ గురి
అమెరికా సైనిక ఆపరేషన్ ద్వారా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవీచ్యుతుడిని చేసి అరెస్ట్ చేసిన తర్వాత.. వాషింగ్టన్ ఏకంగా వెనిజులా ఆయిల్ సిస్టమ్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకుంది. అమెరికన్ కంపెనీలు వెనిజులా ముడిచమురును కొనుగోలు చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడే అసలు వ్యూహం దాగి ఉంది. ఆ చమురు అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులు వెనిజులా ఖాతాల్లోకి కాకుండా, అమెరికా నియంత్రణలో ఉన్న అకౌంట్లలోకి వెళ్లేలా పక్కా స్కెచ్ వేశారు. ట్యాంకర్లను సీజ్ చేసి, కోట్లాది బ్యారెళ్ల చమురును అమెరికా సొంతం చేసుకుంది.
ఇది కేవలం ఆయిల్ లావాదేవీలకే పరిమితం కాలేదు. ఒక సార్వభౌమ దేశపు చమురు ఆర్థిక వ్యవస్థపై పూర్తి స్థాయి ఆర్థిక, కార్యాచరణ నియంత్రణను అమెరికా లాక్కోవడమే దీని అసలు ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యధిక ముడిచమురు నిల్వలు ఉన్న దేశం కావడం, ప్రభుత్వ మార్పు తర్వాత అక్కడి వ్యవస్థలు బలహీనంగా ఉండటంతో అమెరికా ప్లాన్ సులభంగా వర్కౌట్ అయింది.
రష్యా చమురు కొనే దేశాలకు ఆర్థిక ఉరి
డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇంధన వ్యూహం సరికొత్త మలుపు తిరిగింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు కొనసాగించే దేశాలపై సుంకాలు విధించడం వాషింగ్టన్ వ్యూహంలో ఒక ప్రధాన ఆయుధంగా మారింది. ఇది కేవలం రష్యా ఉత్పత్తిదారులను లక్ష్యంగా చేసుకోవడం కాదు, డిస్కౌంట్‌కు వస్తుందని ఆయిల్ కొనే దేశాలకు అది అత్యంత ఖరీదైనదిగా మారేలా అమెరికా తన వాణిజ్య విధానాన్ని భౌగోళిక రాజకీయ ఆయుధంగా మార్చేసింది.
దీనివల్ల రెండు రకాల ప్రభావం పడుతోంది. ఒకటి, రష్యా చమురు కొనడం ఆర్థికంగా నష్టంగా, ప్రమాదకరంగా మారుతోంది. రెండు, పెద్ద కొనుగోలుదారులు వేరే దారి లేక ఇతర దేశాల వైపు చూసేలా చేస్తోంది. తద్వారా రష్యాను తొక్కేయడమే కాకుండా, కొనుగోలుదారులను వాషింగ్టన్ కనుసన్నల్లో మెలిగే దేశాల వైపు మళ్లేలా ట్రంప్ శాసిస్తున్నారు.
దీనివల్ల గ్లోబల్ ఆయిల్ ఫ్లోస్ రూపురేఖలు మారిపోతున్నాయి. రష్యా నుంచి దూరమైన డిమాండ్, ఇప్పుడు అమెరికా ఆధిపత్యంలో ఉన్న (జోక్యం చేసుకున్న తర్వాతి) వెనిజులా లాంటి దేశాల వైపు లేదా అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న ఉత్పత్తిదారుల వైపు మళ్లుతోంది.
ఇది పరోక్షంగా ప్రపంచ చమురు ధరలను కూడా అమెరికా కంట్రోల్ చేసేలా చేస్తోంది. రష్యా సప్లై తగ్గించి మార్కెట్‌ను టైట్ చేసి ధరలు పెంచడం, మళ్లీ తమకు అనుకూలమైన దేశాల నుంచి బ్యారెళ్లను మార్కెట్లోకి వదిలి ధరలను బ్యాలెన్స్ చేయడం లాంటి వ్యూహాలు ఇందులో దాగి ఉన్నాయి. ఫలితంగా ప్రపంచ చమురు మార్కెట్ భవితవ్యం కేవలం మార్కెట్ శక్తుల చేతుల్లో కాకుండా, వ్యూహాత్మక జోక్యం ద్వారా అమెరికా చేతుల్లో బందీ అవుతోంది.
క్యూబా గొంతు నొక్కిన నయా ఆయిల్ పాలిటిక్స్
క్యూబా విషయంలో ట్రంప్ విధానం ఆ దేశ చమురును లాక్కోవడం గురించి కాదు.. క్యూబాకు అసలు చమురు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం గురించి! వెనిజులా నుంచి క్యూబాకు వెళ్లే ముడిచమురు సరఫరాను అమెరికా దారుణంగా కత్తిరించింది. దీని దెబ్బకు క్యూబాలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడి, రోజంతా కరెంటు కోతలతో దేశం అంధకారంలో కూరుకుపోయింది.
అదే సమయంలో, క్యూబాకు ఆయిల్ సప్లై చేయడానికి ఏ దేశం ముందుకు వచ్చినా.. వారిపై కఠినమైన సుంకాలు, జరిమానాలు విధిస్తామని వాషింగ్టన్ వార్నింగ్ ఇచ్చింది. దీనివల్ల క్యూబా ఇంధన లైఫ్‌లైన్‌ను నడపడం తలకు మించిన భారం అయింది.
ఇక్కడ చమురు అనేది ఒక సరుకు కాదు.. ప్రత్యక్ష సైనిక జోక్యం లేకుండానే ప్రత్యర్థి దేశపు ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి వాడే ఒక వ్యూహాత్మక అస్త్రం! ఇంధన కొరత పీక్స్‌లో ఉన్నప్పుడు రష్యాకు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్‌ను మాత్రం అమెరికా లోపలికి అనుమతించింది. అయితే ఇది కేవలం ఒక తాత్కాలిక ఎత్తుగడ మాత్రమే తప్ప, క్యూబా గొంతు నొక్కే విస్తృత విధానంలో ఎలాంటి మార్పూ లేదు.
ఇరాన్ గుండెకాయ.. వ్యూహాత్మక హబ్‌లపై అమెరికా కన్ను
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపడానికి మొదలైన యుద్ధం.. ఇప్పుడు ఇంధన యుద్ధంగా మారిపోయింది. "ఇరాన్ చమురును లాక్కోవడం నాకిష్టం" అని ట్రంప్ బహిరంగంగా చెప్పడం ద్వారా వాషింగ్టన్ దాడి ఎంత తీవ్రంగా ఉండబోతోందో అర్థమవుతోంది. ఇరాన్ ఎకానమీకి ప్రాణాధారమైన, ప్రధాన ఎగుమతి కేంద్రమైన 'ఖర్గ్ దీవి' ఇప్పుడు అమెరికాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఆ దీవిని ఆక్రమిస్తామా లేదా అనేదానిపై చాలా ఆప్షన్లు ఉన్నాయని, ఒకవేళ ఆక్రమిస్తే అక్కడ అమెరికా బలగాలు సుదీర్ఘకాలం పాటు ఉండాల్సి వస్తుందని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
ట్రంప్ వ్యూహం కేవలం ఇరాన్‌కే పరిమితం కాలేదు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం 'హార్మూజ్ జలసంధి' లాంటి విస్తృత ఇంధన ప్రవాహాల భూగోళ శాస్త్రంతో ఇరాన్ ఆయిల్ నెట్‌వర్క్‌ను ఆయన ముడిపెట్టారు. అవసరమైతే ఈ జలసంధిని తమ గుప్పిట్లోకి తీసుకుని, ఎలాంటి అంతరాయాలు రాకుండా తమ ప్రయోజనాలను కాపాడుకోగల సత్తా అమెరికాకు ఉందని ఆయన పదేపదే నొక్కి చెబుతున్నారు.
దీని అర్థం ఏంటంటే.. కేవలం ఖర్గ్ దీవి లాంటి ఒక ఎగుమతి కేంద్రాన్ని మాత్రమే కాకుండా, ఏకంగా చమురు కదలికలను మొత్తంగా శాసించే సత్తా అమెరికాకు ఉందని ప్రపంచానికి సిగ్నల్ ఇవ్వడమే! ఇంధనం అనేది కేవలం ఒక వనరు కాదు.. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, యుద్ధ భూమిని శాసించే ఒక వ్యూహాత్మక ఆస్తి. దాన్ని లాక్కోవచ్చు, నియంత్రించవచ్చు, లేదా అడ్డుకోవచ్చు అన్నదే ట్రంప్ నయా సిద్ధాంతం.
ప్రపంచ ఆయిల్ అంతా ట్రంప్ సొంతం చేసుకుంటారా?
అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని చమురునంతా తన సొంతం చేసుకోవాలని చూస్తున్నారా? లేదు! ఆయన ఉద్దేశం అది కాదు. అమెరికా ప్రభావం లేకుండా ప్రపంచంలో ఏ చిన్న కీలకమైన ఆయిల్ లావాదేవీ జరగకూడదన్నదే ఆయన అసలు టార్గెట్. ఇది సాంప్రదాయక అర్థంలో గుత్తాధిపత్యం కాకపోవచ్చు.. కానీ, గ్లోబల్ ఆయిల్ ఎకోసిస్టమ్‌పై అమెరికా తిరుగులేని 'వ్యూహాత్మక ఆధిపత్యం' సాధించడమే ట్రంప్ అంతిమ లక్ష్యం! రాబోయే రోజుల్లో ఆయిల్ మంటలు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి.
Also Read:
ఇరాన్ యుద్ధంలో యూఏఈ జోక్యం చేసుకుంటే దుబాయ్, అబుదాబి బూడిదే!ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోకుండా వినోద్ ఖోస్లా మాస్టర్ ప్లాన్!
అమెరికా vs ఇరాన్: పాకిస్థాన్‌లో రహస్య మంత్రాంగం వెనుక అసలు కథ!
ఏఐ మ్యాజిక్: బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఇల్లు అమ్మి లక్ష డాలర్లు లాభం!
అమెరికాకు ఇరాన్ ఫైనల్ వార్నింగ్: భూతల దాడులు చేస్తే వదిలిపెట్టం!

