సముద్రాల ఆవల రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు అరేబియా ఎడారిని దహించేందుకు సిద్ధమవుతున్నాయి! ప్రపంచం మొత్తం 'సేఫ్ హెవెన్'గా భావించే గల్ఫ్ స్వర్గధామాలు, కనురెప్ప పాటులో బూడిద కుప్పలుగా మారే ప్రమాదం పొంచి ఉందా? అవుననే హెచ్చరిస్తున్నారు అమెరికా అగ్రశ్రేణి ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ (Jeffrey Sachs). ఇరాన్ యుద్ధంలో గనక యూఏఈ (UAE) జోక్యం చేసుకుంటే.. ఆ 'గల్ఫ్ ఆణిముత్యం' విధ్వంసానికి గురికావడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బూడిద కానున్న దుబాయ్, అబుదాబి?
పశ్చిమాసియాలో సురక్షిత ప్రాంతాలుగా (safe havens) విరాజిల్లుతున్న దుబాయ్, అబుదాబి లాంటి మహా నగరాలు ఇప్పుడు పెను ప్రమాదం అంచున నిలబడ్డాయి. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) తో మాట్లాడిన సాచ్స్, యూఏఈ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నగరాలను కేవలం ప్రపంచ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రాలుగా నిర్మించారే తప్ప.. ఎలక్ట్రానిక్ రక్షణ వ్యవస్థలతో (fortified military zones) సైనిక స్థావరాలుగా కాదు అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏమాత్రం యుద్ధం తీవ్రతరం అయినా.. ఈ నగరాలు నేరుగా శత్రువుల దాడులకు బలవుతాయని ఆయన హెచ్చరించారు.
"ఒకవేళ యూఏఈ గనక ఈ యుద్ధంలోకి దిగితే, దుబాయ్, అబుదాబి నగరాలు అక్షరాలా పేలిపోతాయి. ఇవి కేవలం రిసార్ట్ ప్రాంతాలు. పర్యాటక కేంద్రాలు. ఇవేమీ శత్రువుల క్షిపణులను అడ్డుకునే సైనిక రక్షణ ప్రాంతాలు కావు. ఇవి కేవలం ప్రపంచ కుబేరులు వచ్చి పార్టీలు చేసుకునే, తమ పెట్టుబడులు పెట్టే ప్రదేశాలు మాత్రమే. అలాంటి దుబాయ్ లాంటి ప్రాంతాన్ని యుద్ధ భూమిగా మారిస్తే.. అసలు ఆ నగరాన్ని నిర్మించిన ఉద్దేశమే సర్వనాశనం అవుతుంది. కళ్లు తెరిచే ఉండి కూడా ఎమిరేట్స్ ఒక అర్థంపర్థం లేని భయంకరమైన ఉచ్చులో బిగుసుకుపోయింది. పైగా, అదే తప్పును పదేపదే చేస్తోంది" అని ఆయన నిప్పులు చెరిగారు.
అమెరికా రక్షణ.. ఒక ప్రాణాంతక భ్రమ!
అమెరికా, ఇజ్రాయెల్‌తో యూఏఈ జతకట్టడాన్ని ఒక 'వ్యూహాత్మక తప్పిదం'గా సాచ్స్ అభివర్ణించారు. గల్ఫ్ దేశాలు అబ్రహాం అకార్డ్స్ (Abraham Accords) లో చేరడం అంటే, "పనికిమాలిన విపత్తును ఇంటికి ఆహ్వానించడమే" అని ఆయన తేల్చి చెప్పారు. కేవలం అమెరికా ఇస్తున్న భద్రతా హామీలపై (security guarantees) ఆధారపడి గుడ్డిగా నమ్మడం వల్ల, గల్ఫ్ దేశాలు ఒక ప్రమాదకరమైన అతివిశ్వాసానికి (overconfidence) లోనయ్యాయని ఆయన విశ్లేషించారు.
ఈ సందర్భంగా మాజీ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింజర్ (Henry Kissinger) చేసిన చారిత్రాత్మక హెచ్చరికను ఆయన గుర్తుచేశారు.
"ఈ అబ్రహాం ఒప్పందాల్లో చేరి, ఇజ్రాయెల్, అమెరికాల పక్షాన నిలబడటం ఎమిరేట్స్‌కు ఒక విపత్తు లాంటిది. గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు తమ సర్వస్వాన్ని కేవలం అమెరికా రక్షణ మీదే పందెం కాశాయి. 'మా దగ్గర అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి, వాళ్లు మమ్మల్ని రక్షిస్తారు.. కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు మేము వ్యవహరించవచ్చు' అని వారు విర్రవీగుతున్నారు. ఇది ఒక ఘోరమైన తప్పుటడుగు. కిస్సింజర్ చెప్పిన ఆ చారిత్రక వాక్యాన్ని నేను ప్రతిరోజూ గుర్తుచేసుకుంటాను.. 'అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం, కానీ అమెరికాకు మిత్రుడిగా ఉండటం మాత్రం ప్రాణాంతకం' " అని ఆయన హెచ్చరించారు.
దయచేసి ఆపండి.. వినాశనాన్ని కొనితెచ్చుకోకండి!
తక్షణం సంయమనం పాటించాలని, యుద్ధాన్ని మరింత ఉద్రిక్తం చేయవద్దని యూఏఈని సాచ్స్ గట్టిగా కోరారు. "నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు.. 'దుర్మార్గపు ఇరాన్‌పై మేమూ పోరాడతాం, అమెరికాలో ట్రిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడతాం' అని నిన్న యూఏఈ చేసిన ప్రకటన వారి అమాయకత్వానికి నిదర్శనం. దయచేసి ఆపండి. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అసలు పరిస్థితిని అర్థం చేసుకోండి. ఓడిపోయే పందెం మీద పదేపదే డబ్బులు కట్టడం సరైన నిర్ణయమేనా? కానీ వాళ్లు అదే చేస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరాన్ ఫైనల్ వార్నింగ్.. భగ్గుమన్న గల్ఫ్!
సాచ్స్ చేసిన ఈ హెచ్చరికల నేపథ్యంలో, టెహ్రాన్ నుంచి కూడా అత్యంత తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక దాడులు చేయడానికి ప్రాంతీయ దేశాలు తమ భూభాగాన్ని అమెరికాకు అప్పగించవద్దని మార్చి 20న ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఆ సైనిక స్థావరాలే ఈ సంక్షోభానికి "మూలకారణం" అని ఇరాన్ స్పష్టం చేసింది.
"ఇరాన్‌పై సైనిక దాడులు చేయడానికి అమెరికా, జియోనిస్ట్ (ఇజ్రాయెల్) పాలనలు తమ భూభాగాన్ని, తమ సౌకర్యాలను వాడుకోకుండా ప్రాంతీయ దేశాలు తక్షణం అడ్డుకోవాలి" అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ 'ఎక్స్' (X) వేదికగా హెచ్చరించింది. అంతేకాదు, అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలు.. రేపు ఇరాన్‌పై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఇరాన్ ప్రతినిధి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
మరోవైపు, ఇరాన్ తమ ఇంధన మౌలిక సదుపాయాలపై (energy infrastructure) చేస్తున్న దాడులను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. తద్వారా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న ఈ వేళ.. తాము వాషింగ్టన్‌తోనే బలంగా నిలబడతామని ఆ దేశాలు సంకేతాలు పంపుతున్నాయి.
అమెరికా అండ చూసుకుని యూఏఈ చేస్తున్న ఈ సాహసాలు.. రేపు అరేబియా ఎడారిని రణరంగంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. పర్యాటకులతో కళకళలాడే దుబాయ్ వీధులు శత్రువుల బాంబులకు లక్ష్యంగా మారకముందే.. యూఏఈ కళ్లు తెరుస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న!
Also Read:
ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోకుండా వినోద్ ఖోస్లా మాస్టర్ ప్లాన్!అమెరికా vs ఇరాన్: పాకిస్థాన్‌లో రహస్య మంత్రాంగం వెనుక అసలు కథ!
ఏఐ మ్యాజిక్: బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఇల్లు అమ్మి లక్ష డాలర్లు లాభం!
అమెరికాకు ఇరాన్ ఫైనల్ వార్నింగ్: భూతల దాడులు చేస్తే వదిలిపెట్టం!
ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోతున్నాయా? ఈ ఇద్దరికే సేఫ్!

