హైదరాబాద్ నగరంలో మీ వీధిలో రోడ్డు పాడైపోయిందా? డ్రైనేజీ పొంగిపొర్లుతోందా? ఎన్నిసార్లు జీహెచ్ఎంసీకి (GHMC) ఫిర్యాదు చేసినా ఫండ్స్ లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారా? దీనికంతటికీ కారణం బల్దియా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమే. నెలకు రూ.100 కోట్లు కేవలం వడ్డీలకే కడుతుంటే, ఇక సామాన్యుడికి కనీస వసతులు ఎక్కడినుంచి వస్తాయి? అందుకే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీని మూడు కొత్త కార్పొరేషన్లుగా విభజించడమే కాకుండా, బల్దియా నెత్తిన ఉన్న రూ.4,780 కోట్ల అప్పుల భారాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోబోతోంది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దీనివల్ల సామాన్య నగర పౌరుడికి జరిగే లాభం ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాం.
అప్పుల ఊబిలో జీహెచ్ఎంసీ.. నెలకు రూ.100 కోట్ల వడ్డీ!
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ మహా నగరంగా శరవేగంగా విస్తరించింది. ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, కొత్త డ్రైనేజీ నాలాల నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ ఏకంగా రూ.7 వేల కోట్ల వరకు అప్పులు చేసింది.
ఈ భారీ రుణాల దెబ్బకు బల్దియా ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలింది. గత రెండేళ్లుగా ప్రతీ నెలా కేవలం ఈ అప్పుల వడ్డీల కోసమే సుమారు రూ.100 కోట్లు చెల్లిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పన్నుల వాటా, ఇతర నిధులు కూడా పెండింగ్ లో ఉండటంతో బల్దియాకు తలకు మించిన భారంగా మారింది.
టాస్క్‌ఫోర్స్ రిపోర్ట్.. అప్పులన్నీ సర్కార్ ఖాతాలోకి!
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. అయితే, పాత అప్పులను ఈ మూడు కార్పొరేషన్లకు ఎలా పంచాలన్న దానిపై సర్కార్ ఒక 'టాస్క్‌ఫోర్స్ కమిటీ'ని ఏర్పాటు చేసింది.
కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు ఈ అప్పులను పంచితే, అవి పురిట్లోనే ఆర్థికంగా చతికిలబడతాయని కమిటీ తేల్చిచెప్పింది. అందుకే జీహెచ్ఎంసీకి ప్రస్తుతం ఉన్న రూ.4,780 కోట్ల అప్పులను.. వాటిపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా టేకోవర్ చేసి (చెల్లించేలా) తీర్మానించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
జీహెచ్ఎంసీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం హైదరాబాద్ ప్రజలకు ఒక అతిపెద్ద వరం. ఒకవేళ ఆ వేల కోట్ల అప్పులను కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్ల మీద రుద్దితే.. ఆ భారాన్ని తట్టుకోవడానికి సామాన్యుడిపై ఆస్తి పన్ను (Property Tax), చెత్త పన్నులను విపరీతంగా పెంచే ప్రమాదం ఉండేది. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. పైగా పాత అప్పుల బాధ లేకపోవడం వల్ల, కొత్త కార్పొరేషన్లు నేరుగా తమ బడ్జెట్ ను మీ ఏరియాలో రోడ్లు, పార్కులు, డ్రైనేజీల అభివృద్ధికి ఖర్చు చేసే అవకాశం దొరుకుతుంది.

