సాధారణ ఎన్నికలంటే మన గల్లీలో హడావిడి ఉంటుంది, కానీ రాజ్యసభ ఎన్నికలంటే ఢిల్లీ దాకా పాలిటిక్స్ మారుతాయి. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. కనీసం పోటీ కూడా చేయకుండా సైలెంట్ అవ్వడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ వ్యూహం ఏంటో తెలుసా? రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ఆ రెండు పెద్దల సభ సీట్ల కథేంటో, అది మన రాష్ట్ర పాలనపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో ఇప్పుడు చూద్దాం.
కాంగ్రెస్ ఖాతాలోకి రెండు సీట్లు
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలు దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడిపోయాయి. నామినేషన్లకు చివరి రోజైన గురువారం (మార్చి 5న).. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ కార్యక్రమానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా అసెంబ్లీకి తరలివచ్చి తమ ఐకమత్యాన్ని, బలాన్ని ప్రదర్శించారు.
సైలెంట్ అయిన బీఆర్ఎస్
నిజానికి ఈ రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ ది కాగా, మరొకటి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. కానీ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా వ్యూహాత్మక మౌనం పాటించింది.
గెలిచేందుకు తగినంత ఎమ్మెల్యేల బలం లేకపోవడం వల్లే గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేసినా, 10 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో మార్చి 6న జరిగే స్క్రూటినీలో అది తిరస్కరణకు గురికావడం ఖాయం.
తెరవెనుక రేవంత్ మార్క్ పాలిటిక్స్
హైకమాండ్ కోటాలో అభిషేక్ మను సింఘ్వీకి మొదటి సీటు ముందే ఖరారైంది. అయితే రెండో సీటు కోసం ఆశావహులు ఢిల్లీ స్థాయిలో సర్వశక్తులూ ఒడ్డినా.. ఫైనల్ గా సీఎం రేవంత్ పంతమే నెగ్గింది.
తనకు అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో హుటాహుటిన రాజీనామా చేయించి మరీ ఈ రాజ్యసభ టికెట్ ఇప్పించుకున్నారు. దీనికోసం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి వరకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారు.
తెలంగాణ నుంచి రాజ్యసభలో బీఆర్ఎస్ బలం క్రమంగా తగ్గిపోతుండటం, కాంగ్రెస్ పూర్తిస్థాయిలో పాగా వేస్తుండటం.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. ఎలాంటి పోటీ లేకుండా రెండు సీట్లను కాంగ్రెస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం (మార్చి 16న లాంఛనంగా ప్రకటన) సీఎం రేవంత్ రెడ్డి వ్యూహ చతురతకు నిదర్శనం. భవిష్యత్తులో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ఈ ఇద్దరు రాజ్యసభ ఎంపీల పాత్ర అత్యంత కీలకం కాబోతోంది.

