Global Energy Crisis: ఇంధన కరువుతో అల్లాడుతున్న ప్రపంచం!

naveen
By -

Global Energy Crisis : పాతాళానికి చమురు నిల్వలు.. స్కూళ్లు బంద్, కరెంటు కట్.. ఇంధన కరువుతో అల్లాడుతున్న ప్రపంచం!


Global Energy Crisis

Global Energy Crisis : సరిగ్గా 24 రోజుల క్రితం, గత నెల 28న పశ్చిమాసియా రణరంగంలో ఒక భయంకరమైన ఉప్పెన మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా అత్యున్నత నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో.. ప్రతీకార జ్వాలలతో రగిలిపోయిన ఇరాన్ గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ మహాసంగ్రామం కేవలం ఆయా దేశాల సరిహద్దులకే పరిమితం కాలేదు. గల్ఫ్ జలాల్లో నెత్తురు పారుతుంటే, ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి కన్నీరు కారుతోంది. 


మూడు వారాలుగా సాగుతున్న ఈ రక్తపాతంతో గ్లోబల్ చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలు కుప్పకూలాయి. దేశాల వద్ద ఉన్న అత్యవసర ఇంధన నిల్వలు ప్రమాదకర స్థాయిలో పాతాళానికి పడిపోతున్నాయి. ఏ క్షణంలోనైనా బండ్లు ఆగిపోతాయేమో, ఏ రాత్రికి దేశం మొత్తం అంధకారంలోకి కూరుకుపోతుందో అన్న భయంతో ప్రపంచ దేశాలు కనీవినీ ఎరుగని నష్ట నివారణ చర్యలకు, అత్యవసర హై-అలర్ట్ లాక్‌డౌన్‌లకు సిద్ధమవుతున్నాయి.


పొదుపు మంత్రం.. ఆసియా దేశాల్లో ఆకస్మిక ఎమర్జెన్సీ


ఇంధన సంక్షోభం గొంతు నులుముతుండటంతో ఆసియా ఖండంలోని పలు దేశాలు యుద్ధప్రాతిపదికన కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఒక బిందువు పెట్రోల్‌ను, ఒక యూనిట్ కరెంట్‌ను కూడా వృథా చేయకుండా ఆదా చేసుకునేందుకు ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. 


చుట్టుపక్కల దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అక్కడి ప్రభుత్వాలు విద్యాసంస్థలన్నింటికీ తాళాలు వేసి, ఆన్‌లైన్ తరగతులకు పరిమితం చేశాయి. శ్రీలంక అయితే ఏకంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని తెరపైకి తెచ్చి, పాస్ ఉన్న వ్యక్తికి వారానికి కేవలం 15 లీటర్ల ఇంధనం మాత్రమే ఇస్తూ రేషనింగ్ విధించింది. 


బంగ్లాదేశ్ తన ఆర్థిక వ్యవస్థకు ప్రాణనాడి లాంటి వస్త్ర ఎగుమతి రంగాన్ని కాపాడుకునేందుకు, దేశీయంగా ప్రతిరోజూ ఐదు గంటల పాటు భయంకరమైన విద్యుత్ కోతలను అమలు చేస్తోంది. ఇక పొరుగున ఉన్న భూటాన్.. జెర్రీ క్యాన్లలో పెట్రోల్ అమ్మకాలను పూర్తిగా నిషేధించి, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల వంటి అత్యవసర సేవలకు మాత్రమే ఇంధనాన్ని రిజర్వ్ చేస్తోంది.


వారం నాలుగు రోజులే.. ఇంటి నుంచే పని.. ఆంక్షల చట్రంలో ఉద్యోగులు


ఇంధనాన్ని ఆదా చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగాలు సైతం తమ పని దినాలను కుదించుకుంటున్నాయి. పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాలు తమ ప్రభుత్వ ఉద్యోగులకు వారాన్ని కేవలం నాలుగు రోజులకే పరిమితం చేశాయి. పాకిస్థాన్ తన ప్రభుత్వ శాఖలకు ఇచ్చే ఇంధన కేటాయింపులను ఏకంగా 50 శాతం మేర కోత విధించగా, ఫిలిప్పీన్స్ అత్యవసరం కాని ప్రజా ప్రయాణాలపై ఉక్కుపాదం మోపింది. 


మరోవైపు వియత్నాం, లావోస్ లాంటి దేశాలు ప్రజలు రోడ్ల పైకి రాకుండా 'వర్క్ ఫ్రమ్ హోమ్' (ఇంటి నుంచే పని) చేయాలని, ప్రయాణాలను తగ్గించడానికి రొటేషనల్ షిఫ్టులు అమలు చేయాలని కంపెనీలను ఆదేశించాయి. మయన్మార్, కంబోడియా దేశాల్లో కనీసం పెట్రోల్ పంపులు తెరిచి ఉంచే పరిస్థితి కూడా లేదు. మూడో వంతు బంకులు మూతపడటంతో మయన్మార్ ప్రభుత్వం ఢిల్లీ తరహాలో సరి-బేసి (ఆడ్-ఈవెన్) వాహన విధానాన్ని రోడ్ల పైకి తెచ్చింది.


చీకట్లోకి ఆఫ్రికా.. కారు లేని రోజుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్!


ఈ చమురు కరువు కేవలం ఆసియాకే పరిమితం కాలేదు. అటు ఆఫ్రికా నుంచి ఇటు యూరప్ వరకు అంతటా ఇదే హాహాకారం. ఈజిప్టులో విద్యుత్తును ఆదా చేసేందుకు కళ్లు చెదిరే బిల్‌బోర్డ్ లైట్లను ఆర్పివేశారు. మాల్స్, రెస్టారెంట్లను రాత్రి 9 గంటలకల్లా, ప్రభుత్వ భవనాలను సాయంత్రం 6 గంటలకల్లా మూసివేయాలంటూ కఠినమైన కర్ఫ్యూ తరహా ఆదేశాలు జారీ చేశారు. 


కెన్యాలో ఉన్న ఇంధన నిల్వలు కేవలం ఏప్రిల్ వరకు మాత్రమే సరిపోతాయని అంచనా వేయడంతో అక్కడ కఠినమైన ఇంధన రేషనింగ్ మొదలైంది. దక్షిణాఫ్రికా, స్లోవేకియా దేశాలు పరిశ్రమలు, ట్రక్కులకు ఇంధన కోటాలను నిర్దేశించాయి. అత్యంత అభివృద్ధి చెందిన న్యూజిలాండ్ సైతం ఈ సంక్షోభం దెబ్బకు 1979 నాటి 'కార్-ఫ్రీ డే' (వారానికి ఒక రోజు కారు వాడకపోవడం) విధానాన్ని మళ్లీ అమలు చేసే ఆలోచనలో ఉంది. 


విమానాలకు ఇంధనం లేక వందలాది ఎయిర్ న్యూజిలాండ్ విమానాలు రద్దవ్వడం పరిస్థితి తీవ్రతకు సజీవ సాక్ష్యం. ఎటు చూసినా గ్యాస్ కొరత, ఇంధన కటకటలతో ప్రపంచ మానవాళి అక్షరాలా చీకటి యుగం వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.