పశ్చిమాసియా రణరంగంలో ఆకాశం నుంచి కురుస్తున్న బాంబుల కంటే మిన్నగా.. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న మాటల యుద్ధం మరింత వేడెక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా 'శాంతి' వచనాలు పలుకుతూ దాడుల విరమణ ప్రకటించగా, ఇరాన్ మాత్రం ఆ శాంతి కపోతాన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసింది. ఇదంతా పచ్చి అబద్ధమని, తమ దాడులకు భయపడే ట్రంప్ తోక ముడిచారని టెహ్రాన్ ఎగతాళి చేసింది. ట్రంప్ శాంతి మంత్రం చదివిన కాసేపటికే ఇజ్రాయెల్ రంగంలోకి దిగి టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించడంతో మిడిల్ ఈస్ట్ పరిస్థితి కనీవినీ ఎరుగని ఉత్కంఠకు దారితీసింది.
భయపడి పారిపోయిన సైతాన్.. అమెరికాపై ఇరాన్ నిప్పులు
డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామ ప్రకటనను ఇరాన్ విదేశాంగ శాఖ ఒక పెద్ద కుట్రపూరిత నాటకంగా అభివర్ణించింది. అమెరికాతో తమకు ఎలాంటి శాంతి చర్చలు జరగడం లేదని, తమ మధ్య ఎవరూ మధ్యవర్తిత్వం వహించడం లేదని ఇస్లామిక్ రిపబ్లిక్ అత్యంత కఠినంగా తేల్చిచెప్పింది. సమయం చూసి తమపై మరింత భీకరంగా విరుచుకుపడేందుకే ట్రంప్ ఈ ఐదు రోజుల విరామం అనే ఎత్తుగడ వేశారని, ఆయన నక్కజిత్తుల మాటలను తాము ఏమాత్రం నమ్మబోమని కుండబద్దలు కొట్టింది. "సైతానుకు ఇది మరో ఘోర పరాజయం.. ట్రంప్, అమెరికా మరోసారి మా ముందు చిత్తుగా ఓడిపోయాయి" అంటూ ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రతా ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ నిప్పులు చెరిగారు.
అందుకే ట్రంప్ వెనకడుగు.. హార్ముజ్ జలసంధిపై తగ్గేదేలే!
తమ నుంచి వెలువడిన భయంకరమైన హెచ్చరికలకు వణికిపోయే అమెరికా వెనకడుగు వేసిందని ఇరాన్ సగర్వంగా ప్రకటించుకుంది. ఇరాన్ ఇంధన మౌలిక వసతులు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే జరిగే వినాశనం ఊహించే.. డొనాల్డ్ ట్రంప్ తన అటాక్ ప్లాన్ మార్చుకున్నారని అఫ్గానిస్తాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎద్దేవా చేసింది. ట్రంప్ ఎన్ని శాంతి వచనాలు పలికినా, హార్ముజ్ జలసంధిపై తమ వైఖరి అంగుళం కూడా మారలేదని ఇరాన్ తేల్చిచెప్పింది. తమ దేశంపై దాడికి దిగే ఏ దురాక్రమణదారుడికైనా ఆ వ్యూహాత్మక జలమార్గం శాశ్వతంగా మూసివేసే ఉంటుందని గర్జించింది.
ట్రంప్ శాంతి మాటకు తూట్లు.. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
అంతకుముందు, డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. ఐదు రోజుల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌తో రెండు రోజులుగా అత్యంత సానుకూల వాతావరణంలో చర్చలు సాగుతున్నాయని, పశ్చిమాసియాలో శాంతి స్థాపనే తన లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.
కానీ, అగ్రరాజ్యం అధినేత ఈ ప్రకటన చేసిన కాసేపటికే పశ్చిమాసియా ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. అమెరికా వెనక్కి తగ్గినా తాను తగ్గేదే లేదన్నట్లుగా ఇజ్రాయెల్ భీకరంగా రెచ్చిపోయింది. ట్రంప్ శాంతి ప్రకటనల సిరా ఆరకముందే.. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దండెత్తి బాంబుల వర్షం కురిపించాయి. ఈ తాజా దాడులతో యుద్ధ విరమణ అనేది కేవలం అమెరికాకే పరిమితమని, తాము మాత్రం ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ఇజ్రాయెల్ ప్రపంచానికి ఒక భయంకరమైన సంకేతాన్ని పంపింది.
Also Read:
Middle East War: అమెరికాకు ఇరాన్ సీ-మైన్స్ వార్నింగ్Iran 6 Demands to US Israel : అగ్నిగుండంలో అగ్రరాజ్యాలు.. యుద్ధం ఆగాలంటే ఇరాన్ విధించిన ఆరు బ్రహ్మాస్త్రాలు ఇవే!
Leon Panetta on Trump: ట్రంప్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు.. ఇరాన్ యుద్ధంపై మాజీ సీఐఏ చీఫ్ ఫైర్
WHO Chief Tedros Adhanom: రాబోయే తరాలకు ద్వేషం వద్దు.. 13 దేశాల్లో ఎమర్జెన్సీ ఫోర్స్ ని దించిన డబ్ల్యూహెచ్ఓ
Iran Nuclear Crisis : శిథిలాల కింద సజీవంగా అణు భూతం.. ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి సంచలన హెచ్చరిక!

