పశ్చిమాసియాలో రగులుతున్న మహాసంగ్రామం 24వ రోజుకు చేరుకుని మరింత భీకర రూపాన్ని దాల్చింది. హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ అగ్రరాజ్యం అమెరికా ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్, ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకుంటామన్న పరోక్ష సంకేతాలతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. తమ భూభాగంపై కాలుమోపితే కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని చవిచూడాల్సి వస్తుందని టెహ్రాన్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్ జలాలను శత్రువుల పాలిట మృత్యుకుహరంగా మార్చేందుకు ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ ఒక సంచలన వ్యూహాన్ని తెరపైకి తెచ్చి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
పర్షియన్ గల్ఫ్‌లో అదృశ్య మృత్యువు.. 'సీ-మైన్స్' తో వణుకు
అమెరికా గనక భూతల దాడులకు తెగబడితే, పర్షియన్ గల్ఫ్ అంతటా అత్యంత ప్రమాదకరమైన 'సీ-మైన్స్' (సముద్రపు మందుపాతరలు) అమర్చుతామని ఇరాన్ బాంబు పేల్చింది. తమ తీరం నుంచే అత్యంత సునాయాసంగా ఈ మృత్యుశకటాలను జలాల్లోకి ప్రవేశపెట్టగలమని, దీనివల్ల గల్ఫ్‌లో నౌకల రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు శాశ్వతంగా స్తంభించిపోతాయని రాయిటర్స్ నివేదిక కుండబద్దలు కొట్టింది.
ఈ సీ-మైన్స్ అమర్చితే సుదీర్ఘకాలం పాటు పర్షియన్ గల్ఫ్ మొత్తం హార్ముజ్ జలసంధి లాంటి భయంకరమైన దిగ్బంధనంలో చిక్కుకుంటుందని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది. 1980ల నాటి చీకటి రోజులను గుర్తుచేస్తూ.. ఆనాడు స్వల్ప సంఖ్యలో అమర్చిన మైన్స్‌ను తొలగించడానికి ఏకంగా 100 మంది అమెరికన్ మైన్ స్వీపర్లు విశ్వప్రయత్నం చేసి విఫలమైన చారిత్రక నిజాన్ని శత్రు దేశాలకు ఇరాన్ గట్టిగా గుర్తుచేసింది.
ఖర్గ్ ద్వీపంపై డేగకన్ను.. రంగంలోకి 4,500 మంది మెరైన్లు
ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గ్ ద్వీపం ఒక ప్రాణనాడి లాంటిది. హార్ముజ్ జలసంధిని గుప్పిట్లో పెట్టుకున్న ఇరాన్‌పై కోలుకోలేని ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఈ ద్వీపాన్ని ఆక్రమించే మహా వ్యూహానికి పదునుపెడుతోంది. ఈ ఆపరేషన్ కోసమే అన్నట్లుగా ఏకంగా 4,500 మంది కరుడుగట్టిన సెయిలర్లు, మెరైన్ కమాండోలను పశ్చిమాసియాకు తరలించి అమెరికా యుద్ధ వాతావరణాన్ని తారస్థాయికి చేర్చింది.
కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లే ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలు, భారీ హెలికాప్టర్లు, సాయుధ ల్యాండింగ్ వాహనాలతో కూడిన ఒక భారీ బెటాలియన్ ఇప్పటికే ఆ జలాల్లోకి ప్రవేశించింది. అయితే, ఈ భారీ బలగాల మోహరింపు కేవలం హార్ముజ్ జలసంధిని బలవంతంగా తెరవడానికా? లేక ఖర్గ్ ద్వీపాన్ని శాశ్వతంగా తమ వశం చేసుకోవడానికా? అన్న సస్పెన్స్ గ్లోబల్ డిఫెన్స్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
ఆకాశం నుంచి నిప్పుల వాన.. వణికిపోయిన టెల్ అవీవ్ విమానాశ్రయం
ఒకవైపు సముద్రంలో అగ్రరాజ్యాల మధ్య ఎత్తులు పైఎత్తులు సాగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ మారణహోమంలో ఇప్పటి వరకు ఏకంగా 352 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు, 1789 డ్రోన్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పై ఇరాన్ ప్రయోగించినట్లు ఆ దేశ రక్షణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా తమ దేశంపైకి దూసుకొచ్చిన ఏడు బాలిస్టిక్ క్షిపణులు, 16 డ్రోన్లను గాల్లోనే అడ్డుకున్నట్లు యూఏఈ ప్రకటించింది.
అటు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు మరింత భీకరంగా మారాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణంలో, తాజాగా టెల్ అవీవ్‌లోని ప్రతిష్టాత్మక బెన్ గురియన్ విమానాశ్రయం వద్ద భారీ పేలుళ్ల శబ్దాలు దద్దరిల్లాయి. నగరమంతటా క్షిపణి సైరన్లు హోరెత్తడంతో అధికారులు తక్షణమే అప్రమత్తమై విమానాశ్రయ కార్యకలాపాలను నిలిపివేసి, ప్రాణభయంతో వణికిపోతున్న ప్రయాణికులను సురక్షిత బంకర్లు, షెల్టర్లకు తరలించారు.
Also Read:
Iran 6 Demands to US Israel : అగ్నిగుండంలో అగ్రరాజ్యాలు.. యుద్ధం ఆగాలంటే ఇరాన్ విధించిన ఆరు బ్రహ్మాస్త్రాలు ఇవే!Leon Panetta on Trump: ట్రంప్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు.. ఇరాన్ యుద్ధంపై మాజీ సీఐఏ చీఫ్ ఫైర్
WHO Chief Tedros Adhanom: రాబోయే తరాలకు ద్వేషం వద్దు.. 13 దేశాల్లో ఎమర్జెన్సీ ఫోర్స్ ని దించిన డబ్ల్యూహెచ్ఓ
Iran Nuclear Crisis : శిథిలాల కింద సజీవంగా అణు భూతం.. ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి సంచలన హెచ్చరిక!
Robert Mueller Death News : అతను చనిపోయినందుకు సంతోషంగా ఉంది.. రాబర్ట్ ముల్లర్ మృతిపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ట్రంప్

