పశ్చిమాసియా రణరంగంలో ఆకాశం నిప్పులు చెరుగుతోంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా, మరోవైపు రక్షణ కవచం ఇజ్రాయెల్, ఇంకోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్.. ఈ మూడు దేశాల మధ్య సాగుతున్న భీకర మారణహోమం యావత్ ప్రపంచాన్ని ప్రళయపు అంచున నిలబెట్టింది. ఎటు చూసినా క్షిపణుల మోతలు, ఎగసిపడుతున్న మంటలతో మిడిల్ ఈస్ట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.
ఈ రక్తపాతానికి తక్షణమే తెరపడుతుందన్న ఎలాంటి సూచనలూ కనిపించడం లేదు. ఈ దాడులు, ప్రతిదాడుల పరంపరలో ఇరాన్ ఒక సంచలన అడుగు వేసింది. తాత్కాలిక కాల్పుల విరమణ అనే ప్రసక్తే లేదని తేల్చిచెబుతూ, ఈ మహా సంగ్రామానికి శాశ్వత ముగింపు పలకడానికి అమెరికా, ఇజ్రాయెల్ ముందు అత్యంత కఠినమైన ఆరు షరతులను ఉంచి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
అణు కల్లోలం.. అంధకారపు అంచున గల్ఫ్!
యుద్ధం ఇప్పుడు సాధారణ సైనిక స్థావరాలను దాటి అణు వినాశనం వైపు అడుగులేస్తోంది. ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ అణు స్థావరాలపై గురిపెట్టి దాడులకు తెగబడటంతో, దానికి ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ అణు సదుపాయాలపై విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి మరింత ఆజ్యం పోశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణనాడి లాంటి హార్ముజ్ జలసంధిని రాబోయే 48 గంటల్లోగా తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ గ్రిడ్‌లను నామరూపాల్లేకుండా చేసి అంధకారంలోకి నెట్టేస్తామని ఆయన భీకర అల్టిమేటం జారీ చేశారు. అగ్రరాజ్యం ఇచ్చిన ఈ వార్నింగ్‌కు ఇరాన్ ఏమాత్రం భయపడలేదు సరికదా, మరింత రెచ్చిపోయింది. జలసంధిని తాము పూర్తిగా దిగ్బంధిస్తామని, అమెరికా గనక దాడులకు తెగబడితే గల్ఫ్ దేశాల విద్యుత్ గ్రిడ్‌లను సైతం బూడిద చేసి ఆ ప్రాంతాన్ని మొత్తంగా చీకట్లోకి నెట్టేస్తామని టెహ్రాన్ ఎదురుదాడికి దిగింది.
కాల్పుల విరమణకు నో.. అగ్రరాజ్యాలకు టెహ్రాన్ ఆరు షరతులు
మారణహోమాన్ని తాత్కాలికంగా ఆపే కాల్పుల విరమణ ఒప్పందాలకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదని ఇరాన్ అత్యంత కఠినంగా స్పష్టం చేసింది. విధ్వంసాన్ని నిజంగా ఆపాలనుకుంటే, యుద్ధాన్ని పూర్తిగా, శాశ్వతంగా ముగించాలని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్ ముందు ఆరు ప్రధాన డిమాండ్లను ఉంచింది.
ఇరాన్ వ్యతిరేక మీడియా కార్యకర్తలపై కఠిన విచారణ జరిపి వారిని తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఈ తరహా యుద్ధం మళ్లీ తమపై పునరావృతం కాదన్న ఖచ్చితమైన హామీని అగ్రరాజ్యాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, పశ్చిమాసియా ప్రాంతం నుంచి అమెరికా తన సైనిక స్థావరాలను శాశ్వతంగా మూసివేసి వెళ్లిపోవాలని ఒక భారీ షరతు విధించింది.
తమ దేశంపై చేస్తున్న దండయాత్రను తక్షణమే ఆపివేసి, ఈ యుద్ధం వల్ల జరిగిన అపార నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబట్టింది. పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతీయ రంగాలలో రగులుతున్న యుద్ధ మంటలను పూర్తిగా ఆర్పివేయాలని డిమాండ్ చేసింది. ప్రపంచ నౌకా రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధికి సంబంధించి సరికొత్త చట్టపరమైన విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తన బ్రహ్మాస్త్రాలను సంధించింది.
ఈ ఆరు షరతులను అంగీకరించకపోతే, తమపై జరిగే ఏ చిన్న దాడికైనా ఊహించని స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.
Also Read:
Leon Panetta on Trump: ట్రంప్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు.. ఇరాన్ యుద్ధంపై మాజీ సీఐఏ చీఫ్ ఫైర్WHO Chief Tedros Adhanom: రాబోయే తరాలకు ద్వేషం వద్దు.. 13 దేశాల్లో ఎమర్జెన్సీ ఫోర్స్ ని దించిన డబ్ల్యూహెచ్ఓ
Iran Nuclear Crisis : శిథిలాల కింద సజీవంగా అణు భూతం.. ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి సంచలన హెచ్చరిక!
మండుతున్న పశ్చిమాసియా.. దేశ ఇంధన భద్రతపై ప్రధాని మోదీ వార్ రూమ్ భేటీ!
Robert Mueller Death News : అతను చనిపోయినందుకు సంతోషంగా ఉంది.. రాబర్ట్ ముల్లర్ మృతిపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ట్రంప్

