అక్కడ పశ్చిమాసియాలో క్షిపణుల మోత.. ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీలో హై-అలర్ట్. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతుంటే, మరోవైపు ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలపై ప్రతీకార జ్వాలలు రగులుస్తోంది. ఈ మహాసంగ్రామంతో ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిపోయింది.
ఈ పరిణామాలతో నౌకల రాకపోకలు నిలిచిపోయి భారత్ సహా యావత్ ప్రపంచం మునుపెన్నడూ చూడని తీవ్రమైన చమురు, గ్యాస్ సంక్షోభం అంచున నిలబడింది. మన దేశంలోనూ గ్యాస్ కొరత దడ పుట్టిస్తున్న వేళ, ఇటీవల కొన్ని నౌకలు భారతీయ పోర్టులకు చేరుకోవడంతో కాస్త ఊరట లభించినప్పటికీ.. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించకపోవడంతో రానున్న రోజుల్లో ముంచుకురాబోయే మహా విలయంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీలో వార్ రూమ్ వాతావరణం.. రంగంలోకి ప్రధాని మోదీ
సముద్రాలకు ఆవల రగులుతున్న ఈ యుద్ధ సెగలు సామాన్యుడి వంటింటికి, రైతన్న పొలానికి తాకకుండా అడ్డుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అత్యవసరంగా రంగంలోకి దిగింది. ముంచుకొస్తున్న ఈ ముప్పును పసిగట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శ్వేతసౌధాన్ని తలపించేలా ఒక అత్యవసర, ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు.
ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ఒక వార్ రూమ్ వాతావరణం నెలకొంది. దేశంలో గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు, ఎరువుల లభ్యత, అలాగే విద్యుత్ రంగాల ప్రస్తుత స్థితిగతులపై ప్రధాని మోదీ సుదీర్ఘంగా, అత్యంత లోతుగా సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే, దేశంలో నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేయడం, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరకు రవాణా వ్యవస్థను గాడిలో పెట్టడమే ఏకైక లక్ష్యంగా ఈ అత్యవసర మేధోమథనం సాగింది.
చక్రబంధం.. కదిలివచ్చిన కేంద్ర కేబినెట్ అగ్రశ్రేణి
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక భేటీకి కేంద్ర కేబినెట్‌లోని అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం కదిలివచ్చింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పీయూష్ గోయల్, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, హర్దీప్ సింగ్ పురీ, యువ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితర హేమాహేమీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వీరితో పాటే వ్యూహకర్త, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ సహా వివిధ కీలక శాఖల ఉన్నతాధికారులు హాజరై, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై తమ గ్రౌండ్ రిపోర్టులను ప్రధాని ముందుంచారు. పెట్రోలియం ఉత్పత్తులతో పాటు దేశంలో నిత్యావసరాల సరఫరాకు ఎక్కడా ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికను, ఉక్కుకవచాన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read:
Robert Mueller Death News : అతను చనిపోయినందుకు సంతోషంగా ఉంది.. రాబర్ట్ ముల్లర్ మృతిపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ట్రంప్Global Oil Crisis 2026 : నెత్తురోడుతున్న పశ్చిమాసియాలో చమురు చదరంగం.. ఇరాన్ నల్లబంగారం వైపు భారత్ చూపు!
Trump Ultimatum: 48 గంటల్లో ఆ దారి తెరవకపోతే ఇరాన్ అంధకారమే.. అగ్రరాజ్యం భీకర డెడ్‌లైన్!
Iran vs US War : అబద్ధాల పునాదులపై అమెరికా భవంతి.. నాడు వియత్నాం, నేడు ఇరాన్.. ట్రంప్ కు అరాఘ్చి భీకర కౌంటర్!
Global Espionage War: ఉక్రెయిన్ కు అమెరికా సాయం ఆపితే.. ఇరాన్ కు మేం ఆపుతాం.. రష్యా డీల్ నిజమేనా?

