పశ్చిమాసియా అగ్నిగుండంలా మండుతోంది. ఆకాశంలో క్షిపణుల రణనినాదాలు, సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల నడుమ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఇంధన నాడి పూర్తిగా తెగిపోయింది. ఎప్పుడూ రద్దీగా ఉండే నౌకా మార్గాలు ఇప్పుడు భయానక నిశ్శబ్దంలోకి జారుకున్నాయి.
యుద్ధానికి ముందు కేవలం 70 డాలర్లుగా ఉన్న బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర, ఇప్పుడు ఏకంగా 112 డాలర్ల అగాధాన్ని దాటి ఆకాశాన్నంటుతోంది. చమురు ధరల సెగ యావత్ ప్రపంచాన్ని, ముఖ్యంగా ఆసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ విపత్కర తరుణంలో.. అగ్రరాజ్యం అమెరికా ఆడిన ఒక వ్యూహాత్మక చదరంగం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
సముద్రంపై నిలిచిపోయిన ఇరాన్ చమురును ఏప్రిల్ 19 వరకు అమ్ముకునేందుకు అమెరికా ఇచ్చిన ఆకస్మిక సడలింపు.. భారతీయ చమురు శుద్ధి కర్మాగారాల్లో (రిఫైనరీలు) కొత్త ఆశలు రేపుతోంది.
140 మిలియన్ బ్యారెళ్ల నిధి.. మార్గదర్శకాల కోసం భారత్ ఎదురుచూపు
రాయిటర్స్ వార్తా సంస్థ వెలువరించిన తాజా నివేదికల ప్రకారం, ప్రస్తుతం పశ్చిమాసియా మరియు ఆసియా జలాల్లోని ట్యాంకర్లలో సుమారు 100 నుంచి 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు నిల్వలు లాక్ అయి ఉన్నాయి. అమెరికా ఆంక్షల సడలింపుతో ఈ మహా నిధిని దక్కించుకునేందుకు, ఇరాన్ నుంచి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించేందుకు భారతీయ రిఫైనరీలు పావులు కదుపుతున్నాయి.
అయితే, దశాబ్దాలుగా ఇరాన్‌పై ఉన్న కఠిన ఆంక్షల నేపథ్యంలో అకస్మాత్తుగా కొనుగోళ్లు జరపడం అంత సులువు కాదు. అందుకే భారతీయ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం, అమెరికా నుంచి అత్యంత స్పష్టమైన ఆదేశాల కోసం, ముఖ్యంగా చెల్లింపుల విధానం (పేమెంట్ గేట్‌వేస్) మరియు నౌకల బీమా కవరేజీపై మార్గదర్శకత్వం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. గతంలో రష్యా చమురు విషయంలోనూ అమెరికా పచ్చజెండా ఊపగానే భారత్ ఎలాగైతే మెరుపువేగంతో స్పందించిందో, ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది.
కమ్ముకుంటున్న గ్యాస్ సంక్షోభం.. భారత్ వద్ద వ్యూహాత్మక నిల్వలు
ఇరాన్ చమురుపై భారత్‌కు అకస్మాత్తుగా ఇంత ఆసక్తి ఎందుకు పెరిగిందంటే.. దానికి ప్రధాన కారణం మన దేశంలో ముంచుకొస్తున్న ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సంక్షోభమే. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల వద్ద 200 రోజులకు సరిపడా అత్యవసర చమురు నిల్వలుంటే, మన దేశం వద్ద కేవలం 70-80 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు మాత్రమే ఉన్నాయి.
యుద్ధం మొదలైన నాటి నుంచి ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడటంతో, సామాన్యుడి వంటగదికి చేరే గ్యాస్ సరఫరాలపై దేశంలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించాల్సిన దుస్థితి నెలకొంది. ఆసియా దేశాల ముడి చమురు దిగుమతుల్లో 60 శాతానికి పైగా కేవలం పశ్చిమాసియా నుంచే, అందులోనూ హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవ్వాలి.
ఇప్పుడు ఆ మార్గమే యుద్ధభూమిగా మారడంతో ఇరాన్ చమురును సొంతం చేసుకోవడం భారత్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. 2018లో ఆంక్షలు రాకముందు భారత్, జపాన్, ఐరోపా దేశాలు ఇరాన్ చమురును విపరీతంగా కొనేవి, కానీ ఆంక్షల తర్వాత చైనా మాత్రమే దొంగచాటుగా తక్కువ ధరలకు ఆ చమురును జుర్రుకుంటోంది.
అగ్రరాజ్యం ఆడిన నాటకమేనా? ఇరాన్ షాకింగ్ ట్విస్ట్!
అయితే, ఈ చమురు చదరంగంలో ఇరాన్ ఇచ్చిన ఒక చిన్న ట్విస్ట్.. అగ్రరాజ్యం ఆడుతున్న నాటకాన్ని బట్టబయలు చేసినట్లు కనిపిస్తోంది. ఇరాన్ చమురు అమ్ముకోవచ్చని అమెరికా చెప్పగానే ఈ సోమవారం ట్రేడింగ్‌లో బ్యారెల్ ధర కాస్త దిగివస్తుందని మార్కెట్ వర్గాలు భావించాయి.
కానీ, "ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేయడానికి మా వద్ద ఎలాంటి అదనపు ముడి చమురు నిల్వలు అందుబాటులో లేవు" అని ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ ప్రతినిధి సమన్ ఘోద్దూసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కుండబద్దలు కొట్టారు. అంటే, భయంతో వణికిపోతున్న కొనుగోలుదార్లకు, మార్కెట్లకు ఒక దొంగ భరోసా ఇవ్వడానికే అమెరికా ఆర్థిక మంత్రి ఈ సడలింపు ప్రకటనల నాటకమాడినట్లు స్పష్టమవుతోంది.
పైగా, ఇరాన్ చమురు రవాణాకు ఉపయోగించే కాలం చెల్లిన 'షాడోఫ్లీట్' (పాత ట్యాంకర్లు) వాడకంపై భద్రతాపరమైన ఆందోళనలు ఉండటంతో.. ఎక్కడ ఏం పేలుతుందోనని భారతీయ రిఫైనరీలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
Also Read:
Trump Ultimatum: 48 గంటల్లో ఆ దారి తెరవకపోతే ఇరాన్ అంధకారమే.. అగ్రరాజ్యం భీకర డెడ్‌లైన్!Iran vs US War : అబద్ధాల పునాదులపై అమెరికా భవంతి.. నాడు వియత్నాం, నేడు ఇరాన్.. ట్రంప్ కు అరాఘ్చి భీకర కౌంటర్!
Global Espionage War: ఉక్రెయిన్ కు అమెరికా సాయం ఆపితే.. ఇరాన్ కు మేం ఆపుతాం.. రష్యా డీల్ నిజమేనా?
Kharg Island : పశ్చిమాసియాలో డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహం.. ఇరాన్ గుండెకాయ 'ఖర్గ్ ద్వీపం'పై అగ్రరాజ్యం గురి!
Moscow to Tehran: రగులుతున్న పశ్చిమాసియాలో రష్యా మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు పుతిన్ అభయహస్తం!

