సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట గ్రామం ఇప్పుడు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తూ ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఈ గడ్డ పైనుంచి తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయంగా కాసుల వర్షం కురవబోతోంది. ఒకవైపు అప్పుల బాధలు, మరోవైపు పెట్టుబడి కష్టాలతో సతమతమవుతున్న రైతులకు ఊరటనిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ మహా క్రతువుకు శ్రీకారం చుట్టనున్నారు.
తొలి విడతలో 3,590 కోట్లు.. ఎకరం లోపు రైతులకు పండుగే!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమికి ప్రాణం పోసేందుకు రేవంత్ సర్కార్ ఏకంగా 9 వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర హేమాహేమీల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 73 లక్షల మంది రైతుల్లో ముందుగా ఎకరం లోపు భూమి ఉన్న 24.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆదివారమే ఈ నిధులు జమ కానున్నాయి. ఆర్బీఐ ద్వారా బ్యాంకుల నుంచి నేరుగా అన్నదాతల చేతికి చేరే ఈ తొలి విడత సాయం విలువ అక్షరాలా రూ.3,590 కోట్లు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం ఉదయానికే రైతుల మొబైల్ ఫోన్లకు 'అమౌంట్ క్రెడిటెడ్' అన్న తీయని మెసేజ్‌లు రానున్నాయి.
ఆ తర్వాత సరిగ్గా ఇరవై రోజులకు రెండో విడత కింద రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్ల మేర పెట్టుబడి సాయం ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న మిగతా 48.68 లక్షల మంది రైతుల ఖాతాలను చేరనుంది.
కొత్త శకం.. నర్మెటలో రూ.300 కోట్లతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
రైతుభరోసా నిధులతో పాటే తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చే మరో చారిత్రక ఘట్టం నర్మెటలోనే ఆవిష్కృతం కాబోతోంది. పామాయిల్ సాగుతో లాభాల బాట పట్టాలనుకుంటున్న రైతులకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీలకు గెలలు తరలించడం ఉత్తర, దక్షిణ తెలంగాణ రైతులకు పెనుభారంగా మారింది.
ఈ కష్టాలకు చెక్ పెడుతూ.. నర్మెటలో అత్యంత అధునాతన సాంకేతికతతో నిర్మించిన రూ.300 కోట్ల భారీ ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న 18 జిల్లాల రైతులకు రవాణా కష్టాలు తీరనున్నాయి. అంతేకాదు, స్థానికంగానే పామాయిల్ ఉత్పత్తి చేసేలా మరో 80 కోట్ల రూపాయలతో భారీ రిఫైనరీ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఇదే స్ఫూర్తితో ఖమ్మం, గద్వాల, ములుగు, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో మరో ఆరు కర్మాగారాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇవన్నీ ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి వస్తే తెలంగాణ ఆయిల్‌పామ్ హబ్‌గా మారడం ఖాయం.
పంటల మార్పిడికి ప్రోత్సాహం.. రేపే కొత్త బోనస్ ప్రకటన?
రాష్ట్రంలో ఎటు చూసినా వరి, పత్తి పంటలే సింహభాగం ఆక్రమిస్తున్నాయి. మొత్తం 2.14 కోట్ల ఎకరాల సాగుభూమిలో ఏకంగా 1.28 కోట్ల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను రచిస్తోంది.
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తూ ఇప్పటికే సక్సెస్ అయిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ఆయిల్‌పామ్, ఇతర నూనెగింజలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, పసుపు లాంటి కమర్షియల్ పంటలకు కూడా భారీ ఎత్తున బోనస్ ప్రకటించేందుకు సిద్ధమైంది. దీనికోసం ఏకంగా 2026-27 బడ్జెట్‌లో రూ.3,500 కోట్లను కేటాయించినట్లు సమాచారం.
నర్మెట వేదికగా జరగనున్న ఈ రైతు ఉత్సవాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పంటల బోనస్‌పై ఒక సంచలన విధాన ప్రకటన చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:
Driving License New Rules : నెత్తురోడుతున్న రహదారులకు చెక్.. ఏప్రిల్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ దక్కాలంటే చుక్కలు చూడాల్సిందే!Telangana Defection Politics: దానం మెడపై అనర్హత కత్తి.. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి పిటిషన్
Jeevan Reddy Rebellion : కాంగ్రెస్ కోటలో రగులుతున్న అసమ్మతి జ్వాల.. జీవన్ రెడ్డి తిరుగుబాటు బావుటా!
గల్ఫ్ యుద్ధం సెగ: సింగరేణి గనుల్లో ఆగుతున్న బొగ్గు గుండెచప్పుడు.. మహా యంత్రాలకు మరణశాసనం!
Moinabad Drugs Case: ఫామ్‌హౌస్‌లో పేలిన తూటాలు.. సిమ్లా స్టోరీలో హైదరాబాద్ ట్విస్ట్!

