పశ్చిమాసియా యుద్ధం ఎన్నడూ లేనంత భయానక దశకు చేరుకుంది. మండుతున్న చమురు మంటల మధ్య ప్రపంచం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన తాజా ప్రకంపనలు అంతర్జాతీయ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దళాల మధ్య సాగుతున్న ఈ మహాసంగ్రామం నాలుగో వారంలోకి అడుగుపెట్టిన తరుణంలో, అగ్రరాజ్యం తన సహనాన్ని పూర్తిగా కోల్పోయింది.
ప్రపంచ ఇంధన నాడిని శాసించే 'హార్ముజ్ జలసంధి'ని నిర్బంధించిన ఇరాన్‌పై ట్రంప్ తనదైన శైలిలో ఉక్కుపాదం మోపారు. సరిగ్గా 48 గంటలు.. ఈ వ్యవధిలోగా జలసంధిని తెరవకపోతే ఇరాన్ భూభాగంపై అక్షరాలా ప్రళయం సృష్టిస్తామంటూ ఆయన చేసిన వార్నింగ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో పెను తుఫానును రేపుతోంది.
ట్రంప్ అల్టిమేటం.. పవర్ ప్లాంట్లపై గురి!
యుద్ధం పుణ్యమా అని అకాశాన్నంటుతున్న చమురు ధరలతో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంపై దేశీయంగా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ధరల మంటను చల్లార్చాలంటే సముద్ర మార్గాల్లో ఇంధన రవాణా సజావుగా సాగాలి. ఇదే విషయమై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ట్రంప్ ఒక అత్యంత కఠినమైన, ప్రత్యక్ష హెచ్చరికను జారీ చేశారు.
"సరిగ్గా ఈ క్షణం నుంచి ఇరాన్‌కు 48 గంటల సమయం ఇస్తున్నాం. ఎలాంటి బెదిరింపులకు తావులేకుండా హార్ముజ్ జలసంధిని పూర్తిగా, భేషరతుగా తెరిచి తీరాలి. అలా జరగని పక్షంలో.. ఇరాన్ నలుమూలలా ఉన్న విద్యుత్ కేంద్రాలే మా లక్ష్యంగా మారతాయి. ఆ పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించి, దేశాన్ని శాశ్వత అంధకారంలోకి నెట్టేస్తాం" అని ట్రంప్ చేసిన భీకర ప్రకటనతో ఇరాన్ రక్షణ వర్గాల్లో హై-అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రపంచ ఆర్థిక గుండెకాయ.. హార్ముజ్ జలసంధి
అసలు ఈ హార్ముజ్ జలసంధి చుట్టూ ఇంతటి మారణహోమం ఎందుకు జరుగుతోందంటే.. అదొక సాధారణ సముద్ర మార్గం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే గుండెకాయ. ఇరాన్, ఒమన్ దేశాల సరిహద్దుల మధ్య కేవలం 55 కిలోమీటర్ల ఇరుకైన వెడల్పుతో ఉండే ఈ జలసంధి.. పర్షియన్ గల్ఫ్‌ను, అరేబియా సముద్రాన్ని కలుపుతుంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, గ్యాస్ రవాణాకు ఇదే అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే వ్యూహాత్మక జలమార్గం. ఇప్పుడు ఈ మార్గాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేసి, వాణిజ్య నౌకలను దిగ్బంధించడంతో ప్రపంచ మార్కెట్లకు ఇంధన సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీని ఫలితంగానే గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు కనీవినీ ఎరుగని సంక్షోభంలో కూరుకుపోయాయి.
నాలుగో వారంలో రణరంగం.. ముంచుకొస్తున్న విలయం
రోజులు గడుస్తున్న కొద్దీ పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించడంతో ఇరు వర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గే రకంలా కనిపించడం లేదు. ఇరాన్ తన పట్టును బిగిస్తుండగా, చమురు సంక్షోభాన్ని ఛేదించేందుకు అమెరికా సైతం సైనిక చర్యలను ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ట్రంప్ ఇచ్చిన ఈ 48 గంటల అల్టిమేటం ముగిసే సమయానికి ఇరాన్ కనుక మెట్టు దిగకపోతే.. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ పవర్ ప్లాంట్లను టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే, విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి ఇరాన్ సామాన్య ప్రజానీకం తీవ్ర అవస్థల పాలు కావడంతో పాటు, ఈ యుద్ధం ఊహించని వినాశనానికి దారితీస్తుందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
Iran vs US War : అబద్ధాల పునాదులపై అమెరికా భవంతి.. నాడు వియత్నాం, నేడు ఇరాన్.. ట్రంప్ కు అరాఘ్చి భీకర కౌంటర్!Global Espionage War: ఉక్రెయిన్ కు అమెరికా సాయం ఆపితే.. ఇరాన్ కు మేం ఆపుతాం.. రష్యా డీల్ నిజమేనా?
Kharg Island : పశ్చిమాసియాలో డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహం.. ఇరాన్ గుండెకాయ 'ఖర్గ్ ద్వీపం'పై అగ్రరాజ్యం గురి!
Moscow to Tehran: రగులుతున్న పశ్చిమాసియాలో రష్యా మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు పుతిన్ అభయహస్తం!
Middle East Crisis: అగ్నిగుండంలో భారత నౌకల సాహసం.. హార్ముజ్ జలసంధిలో ఉత్కంఠ పోరు!

