పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు యావత్ మానవాళి ఉనికినే ప్రశ్నించే అత్యంత భయంకరమైన, వినాశకరమైన దశకు చేరుకున్నాయి. మొన్నటి వరకు కేవలం సైనిక స్థావరాలకే పరిమితమైన దాడుల పరంపర.. ఇప్పుడు ఏకంగా అణు కేంద్రాల (Nuclear Facilities) ముంగిటకు చేరడం ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ఇరాన్ అణు కార్యక్రమానికి గుండెకాయ లాంటి ‘నతాంజ్’ అణు కేంద్రంతో పాటు, ఇజ్రాయెల్‌లోని ‘దిమోనా’ అణు సదుపాయం ఉన్న నగరాలపై భీకర దాడులు జరిగినట్లు వస్తున్న నివేదికలు అంతర్జాతీయ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్షణక్షణం మారుతున్న ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య, మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబడ్డ ప్రపంచానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.
కమ్ముకుంటున్న రేడియేషన్ ముప్పు.. 13 దేశాల్లో ఎమర్జెన్సీ ఫోర్స్!
అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం అంటే.. అది కేవలం ఆయా దేశాలను దెబ్బతీయడం మాత్రమే కాదని, రాబోయే తరాలకు శాపంగా మారే పర్యావరణ, ప్రజారోగ్య వినాశనానికి దారితీస్తుందని టెడ్రోస్ కుండబద్దలు కొట్టారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) అత్యంత లోతైన దర్యాప్తు చేస్తోందని ఆయన వెల్లడించారు.
అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయుల్లో ఎలాంటి అసాధారణ పెరుగుదల నమోదు కానప్పటికీ, ఏ క్షణంలోనైనా అణు విపత్తు సంభవించే పెను ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ఎన్నటికీ శాంతిని తీసుకురాదని, అది భవిష్యత్ తరాల మనసుల్లో కేవలం ద్వేషపు బీజాలను మాత్రమే నాటుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్ని పక్షాలు తక్షణమే మిలిటరీ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముంచుకొస్తున్న ఈ అణు ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో డబ్ల్యూహెచ్ఓ తమ సిబ్బందికి ప్రత్యేక ఎమర్జెన్సీ శిక్షణ ఇచ్చి అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
48 గంటల అల్టిమేటం.. ఇరాన్‌ను అంధకారంలోకి నెట్టేస్తామన్న ట్రంప్!
ఒకవైపు అణు భయాలు ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరింత ఉక్కుపాదం మోపుతూ యుద్ధ వాతావరణాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని రాబోయే 48 గంటల్లోగా పూర్తిగా తెరవకపోతే, ఇరాన్‌ను శాశ్వత అంధకారంలోకి నెట్టేస్తామని ఆయన కఠినమైన అల్టిమేటం జారీ చేశారు.
ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లను ఏరిపారేస్తామని, ముఖ్యంగా ఆ దేశంలోని అతిపెద్ద పవర్ ప్లాంట్‌నే మొట్టమొదటి టార్గెట్‌గా చేసుకుని నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా భీకర హెచ్చరికలు చేశారు. ఇప్పటికే తమ దళాలు ఇరాన్ నౌకాదళం, వాయుసేనతో పాటు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలను దాదాపుగా నిర్వీర్యం చేశాయని, తమ సైనిక లక్ష్యాల సాధనకు అమెరికా అత్యంత చేరువలో ఉందని ఆయన సగర్వంగా ప్రకటించారు.
శత్రువులకు నో ఎంట్రీ.. అగ్రరాజ్యానికి ఇరాన్ సవాల్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్న డెడ్‌లైన్‌లు, వార్నింగ్‌లను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. అగ్రరాజ్యం హెచ్చరికలను గడ్డిపోచలా తోసిపుచ్చుతూ టెహ్రాన్ తనదైన శైలిలో దీటుగా బదులిచ్చింది. హార్ముజ్ జలసంధి మూసుకుపోయి లేదని, అది ప్రస్తుతం తెరిచే ఉందని స్పష్టం చేస్తూనే.. అందులోకి "శత్రు దేశాల" నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పింది. ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్ ముగుస్తున్న కొద్దీ, ఇటు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో.. పశ్చిమాసియా జలాల్లో అమెరికా-ఇరాన్ మధ్య ఏ క్షణమైనా ప్రత్యక్ష మహాసంగ్రామం బద్దలయ్యే అత్యంత ప్రమాదకరమైన వాతావరణం నెలకొంది.
Also Read:
Iran Nuclear Crisis : శిథిలాల కింద సజీవంగా అణు భూతం.. ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి సంచలన హెచ్చరిక!మండుతున్న పశ్చిమాసియా.. దేశ ఇంధన భద్రతపై ప్రధాని మోదీ వార్ రూమ్ భేటీ!
Robert Mueller Death News : అతను చనిపోయినందుకు సంతోషంగా ఉంది.. రాబర్ట్ ముల్లర్ మృతిపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ట్రంప్
Global Oil Crisis 2026 : నెత్తురోడుతున్న పశ్చిమాసియాలో చమురు చదరంగం.. ఇరాన్ నల్లబంగారం వైపు భారత్ చూపు!
Trump Ultimatum: 48 గంటల్లో ఆ దారి తెరవకపోతే ఇరాన్ అంధకారమే.. అగ్రరాజ్యం భీకర డెడ్‌లైన్!

