పెట్రోల్ బంకుల దగ్గర ప్యానిక్.. ఫ్రీ పెట్రోల్, నినాదాల రచ్చ!
పశ్చిమాసియాలో బాంబులు పేలుతుంటే.. భాగ్యనగరంలో పెట్రోల్ బంకుల వద్ద సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గల్ఫ్ యుద్ధం భయంతో జనం చేస్తున్న ప్యానిక్ బయ్యింగ్ ఒక కృత్రిమ ఇంధన కొరతను సృష్టిస్తుంటే.. ఇదే సమయంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ 'ఫ్రీ పెట్రోల్ పంపిణీ' ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారంగా మారింది!
ఫుల్ ట్యాంక్ భయం.. బంకుల ముందు బారులు
గల్ఫ్ యుద్ధం ఎఫెక్ట్ మన దేశంపై స్పష్టంగా పడుతోందన్న భయం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రేపు ఏమవుతుందోనన్న ఆందోళనతో వంట గ్యాస్, పెట్రోల్ కోసం ప్రజలు ముందు జాగ్రత్తలు పడుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారింది. పెట్రోల్ దొరకదేమోనన్న భయంతో వాహనదారులు బంకుల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు, క్యాన్లలో కూడా ఇంధనాన్ని నింపుకుపోవడంతో బంకుల్లో పెట్రోల్ క్షణాల్లో ఖాళీ అయిపోతోంది.
దీనివల్ల నగరంలో ఒక భయంకరమైన కృత్రిమ ఇంధన కొరత ఏర్పడుతోంది. దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ఆందోళన వద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. జనాల భయం ముందు ఆ మాటలు ఏమాత్రం పనిచేయడం లేదు.
డెలివరీ బాయ్స్‌కు ఆసరాగా ఫ్రీ పెట్రోల్ డ్రైవ్
సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సయద్ అయూబ్ అనే హైదరాబాదీ ఒక అడుగు ముందుకు వేశాడు. ఆటోడ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లాంటి రోజువారీ శ్రామికుల కష్టాలు చూసి ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేయడం మొదలుపెట్టాడు.
చెరకు రసం విక్రయించే ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపి.. ఎండలో, ట్రాఫిక్‌లో అలసిపోతున్న ఆ చిరుద్యోగులకు ఫ్రీగా ఇస్తూ ఆసరాగా నిలుస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే.. గత రెండు రోజులుగా నగరంలో ఈ ఫ్రీ పెట్రోల్ డ్రైవ్ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.
"బంకుల వద్ద రద్దీతో డెలివరీ బాయ్స్ తీవ్రంగా నష్టపోతున్నారు. 3-4 రోజుల్లో అమ్ముడయ్యే పెట్రోల్‌ను జనం కేవలం 3-4 గంటల్లోనే కొనేస్తున్నారు. అందుకే రాత్రిళ్లు బంకులు మూసేస్తున్నామని ఓనర్లు స్వయంగా చెబుతున్నారు" అని అయూబ్ ఈ పరిస్థితిని వివరించారు.
'భారత్ మాతా కీ జై'.. పెట్రోల్ బంక్ వద్ద రచ్చ!
అంతా సాఫీగా సాగిపోతున్న ఈ సేవలో సడెన్‌గా ఒక వివాదం చెలరేగింది. ఓ పెట్రోల్ బంకు వద్ద అయూబ్ ఉచితంగా పెట్రోల్‌ను అందిస్తున్న క్రమంలో.. అక్కడున్న కొందరు ఉత్సాహంగా 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశారు.
దీనిపై అయూబ్ వెంటనే స్పందిస్తూ.. "భాయ్, దయచేసి భారత్ మాతా కీ జై లాంటి నినాదాలు ఇక్కడ చేయకండి. మతాన్ని ఇందులోకి తీసుకురాకండి" అని అభ్యంతరం వ్యక్తం చేశారు.
"భారతదేశానికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటంలో భారతీయ ముస్లింలు ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక్కడ హిందువులు, ముస్లింలంతా ఒక్కటే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
నెట్టింట దుమారం.. దేశభక్తి నినాదంపై వార్!
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద డిజిటల్ యుద్ధమే నడుస్తోంది. కొందరు అయూబ్ చేసిన సేవను మెచ్చుకుంటూ, ఆయన వ్యాఖ్యలను బలంగా సమర్థిస్తున్నారు. ఇలాంటి సాయం చేసే సమయంలో ఉద్రిక్తతలు పెంచే నినాదాలు అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
కానీ, మరికొందరు మాత్రం దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. "భారత్ మాతా కీ జై అనేది మతపరమైన నినాదం ఎలా అవుతుంది? అది దేశభక్తి నినాదం కదా! కేవలం వంద రూపాయల ఫ్రీ పెట్రోల్ కోసం ఆ నినాదం చేయడం ఆపేస్తారా?" అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
100 రూపాయల ఉచిత పెట్రోల్ ఇస్తా..
— Eshwar Vishnubhotla (@Eswarkarthikeya) March 26, 2026
భారత్ మాతా కి జై అనకండి అది మత పరమైన నినాదం అంటే.. ఆపేసిన జనం..
ఇంతేనా మనం..? అందుకే శతాబ్దాల పాటు బానిసలమ్.. 🥵 pic.twitter.com/Bi2YcTC1GH
ఎవరీ అయూబ్? వెలుగులోకి పాత కేసుల బాగోతం!
సోషల్ మీడియాలో ఈ రచ్చ మొదలవడంతో.. అసలు ఈ సయద్ అయూబ్ ఎవరు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈయన 'హైదరాబాద్ యూత్ కరేజ్' (HYC) అనే సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా నగరంలోని కిస్మత్‌పుర వేదికగా సామాజిక సేవ చేస్తుంటారు. ఆహార పంపిణీ, ఉచిత పెట్రోల్ అందించడం, గాజా బాధితులకు సాయం చేయడం లాంటి అనేక కార్యక్రమాలు ఈ సంస్థ తరపున చేపడుతుంటారు.
అయితే, ఇదే సమయంలో ఆయన గతం కూడా మళ్లీ చర్చకు వస్తోంది. గతంలో క్రౌడ్ ఫండింగ్ (ఆన్‌లైన్ విరాళాలు) నిధుల విషయంలో భారీ మోసం జరిగిందనే తీవ్రమైన ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ కేసులో సైదాబాద్ పోలీసులు అయూబ్‌తో పాటు సల్మాన్ ఖాన్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన హిస్టరీ కూడా ఆయనకు ఉండటం ఇప్పుడు గమనార్హం.
సామాన్యుడికి ఒకటే ప్రాక్టికల్ సలహా.. పశ్చిమాసియా యుద్ధం వార్తలు చూసి ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకుల మీద పడకండి. మీరే స్వయంగా కృత్రిమ కొరత సృష్టించి మీ జేబులు మీరే గుల్ల చేసుకోకండి. ఇలాంటి హై-టెన్షన్ వాతావరణంలో సేవ ముసుగులో జరిగే సోషల్ మీడియా వివాదాలను పక్కనబెట్టి, ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి.. నింపాదిగా ఉండటమే ఇప్పుడు మనకు శ్రీరామరక్ష!
Also Read:
పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' ట్విస్ట్.. దేశంలో నిజంగానే చమురు అయిపోయిందా?బెంగళూరును బీట్ చేసిన హైదరాబాద్: దేశంలోనే నెంబర్ 1 సిటీ!
పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో డాక్టర్ బాలాజీ అరెస్ట్.. ఊహించని మలుపులు!
హైదరాబాద్ శ్రీరామనవమి శోభాయాత్ర: రేపు 12 గంటల ట్రాఫిక్ ఆంక్షలు!
పాతబస్తీలో నకిలీ ఓనర్ల స్కెచ్.. అద్దె ఇళ్లతో టోకరా!

