గురువు.. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. రేపటి సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకుడు. కానీ, ఆ పవిత్రమైన వృత్తికే మాయని మచ్చ తెస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. నైతిక విలువలు నూరిపోయాల్సిన ఓ గురువే.. కామ పిశాచిలా మారి సమాజం తలదించుకునేలా చేసిన దారుణమైన ఘటన నారాయణపేట జిల్లా మద్దూరులో వెలుగుచూసింది.
సీసీటీవీలో రికార్డైన తెలుగు మాస్టారి పాపం
నారాయణపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ పాఠశాలలో స్వామి అనే వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ హోదాలో తెలుగు మాస్టారుగా పనిచేస్తున్నాడు. వయసులో ఉన్న ఆడపిల్లలకు రక్షణ కవచంలా నిలబడాల్సిన ఆ ఉపాధ్యాయుడి రాబందు కళ్లు.. ఓ పదో తరగతి విద్యార్థినిపై పడ్డాయి. కంప్యూటర్ ల్యాబ్‌లో ప్రశాంతంగా చదువుకుంటున్న ఆ అమాయకపు చిన్నారి దగ్గరకు వెళ్లిన ఆ కామాంధుడు.. అమాంతం ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, వాడు చేసిన ఈ పాపపు పని మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ కావడంతో వాడి బండారం బట్టబయలైంది.
సస్పెన్షన్ వేటు.. విద్యాశాఖ సీరియస్
పదిహేనేళ్ల ఆ పసి వయసులో.. పిల్లలు తెలిసీ తెలియక ఏదైనా తప్పు చేస్తే 'ఇలా చేయకూడదమ్మా' అని బుద్ధి చెప్పాల్సిన స్థానంలో ఉండి, స్వయంగా అతడే ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడటం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ కీచక పర్వంపై ఆధారాలతో సహా విషయం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యాశాఖ వెంటనే అప్రమత్తమైంది. డీఈఓ (DEO) తక్షణమే స్పందించి, టీచర్ స్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకూ అతడు సస్పెన్షన్‌లోనే ఉంటాడని ఉత్తర్వులు జారీ చేశారు.
పోక్సో కేసు పెట్టి జైల్లో వెయ్యాల్సిందే!
అయితే, కేవలం సస్పెండ్ చేస్తే సరిపోతుందా? అని విద్యార్థి సంఘాలు, స్థానికులు మండిపడుతున్నారు. పసిపిల్లల పాలిట రాక్షసుడిగా మారిన ఇలాంటి కామాంధుడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అతడిపై నిర్దాక్షిణ్యంగా 'పోక్సో' (POCSO) కేసు నమోదు చేసి, కటకటాల వెనక్కి నెట్టాలని పట్టుబడుతున్నారు.
కేవలం ఒక సస్పెన్షన్ కాగితంతో ఈ కీచక పర్వానికి తెరదించుతారా.. లేక కఠినమైన క్రమశిక్షణ చర్యలతో భవిష్యత్తులో ఇలాంటి నీచాలకు పాల్పడాలంటేనే వణికిపోయేలా అధికారులు బుద్ధి చెబుతారా అన్నది ఇప్పుడు వేచి చూడాలి!
Also Read:
పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' ట్విస్ట్.. దేశంలో నిజంగానే చమురు అయిపోయిందా?బెంగళూరును బీట్ చేసిన హైదరాబాద్: దేశంలోనే నెంబర్ 1 సిటీ!
పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో డాక్టర్ బాలాజీ అరెస్ట్.. ఊహించని మలుపులు!
హైదరాబాద్ శ్రీరామనవమి శోభాయాత్ర: రేపు 12 గంటల ట్రాఫిక్ ఆంక్షలు!
పాతబస్తీలో నకిలీ ఓనర్ల స్కెచ్.. అద్దె ఇళ్లతో టోకరా!

