Strait of Hormuz: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ బిగ్ అప్‌డేట్

naveen
By -
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ బిగ్ అప్‌డేట్


Middle East Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ బిగ్ అప్‌డేట్.. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే 'నో ఎంట్రీ'!


పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధం.. మన వరంగల్ లాంటి నగరాల్లో సామాన్యులకు పెట్రోల్ రేట్ల టెన్షన్ పెంచుతోంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి 'హార్మూజ్ జలసంధి'ని ఇరాన్ పూర్తిగా మూసేసిందన్న వార్తలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు భగ్గుమంటున్నాయి. అయితే, ఈ టెన్షన్స్‌పై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తాజాగా ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని తాము పూర్తిగా బ్లాక్ చేయలేదని సంచలన ప్రకటన చేశారు. ఒకపక్క సుప్రీం లీడర్ మొజ్తాబా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూనే, అమెరికాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు ఇరాన్ వ్యూహం ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాం.


శత్రువులకే నో ఎంట్రీ.. మిగతా వాళ్లు వెళ్లొచ్చు!


ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేసిందంటూ వస్తున్న వార్తలపై మంత్రి అరాగ్చీ స్పష్టత ఇచ్చారు.


  • ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని తాము పూర్తిగా మూసివేయలేదని, కేవలం తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలకు మాత్రమే ప్రవేశం నిరాకరిస్తున్నామని తేల్చిచెప్పారు.
  • ఇతర దేశాల (చైనా, ఫ్రాన్స్, జపాన్ వంటివి) నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని, ఇప్పటికే అనేక చమురు ట్యాంకర్లు వెళ్తున్నాయని వివరించారు.
  • అయితే, భద్రతా కారణాలతో కొన్ని ప్రైవేట్ కంపెనీలు భయపడి ముందుకు రాకపోతే.. దానికి ఇరాన్ బాధ్యత వహించబోదని కుండబద్దలు కొట్టారు.


చైనా, జపాన్ నౌకల రక్షణ కోసం తాము యుద్ధనౌకలను పంపిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో.. అరాగ్చీ ఇచ్చిన ఈ క్లారిటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


మొజ్తాబా సేఫ్.. మా వ్యవస్థ ఒకరిపై ఆధారపడలేదు!


మరోవైపు, ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారంటూ అమెరికా చేస్తున్న ప్రచారాన్ని అరాగ్చీ తీవ్రంగా తోసిపుచ్చారు. "మొజ్తాబాకు ఎలాంటి సమస్యా లేదు. ఆయన రాజ్యాంగబద్ధంగా తన విధులను నిర్వర్తిస్తున్నారు" అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తమ దేశం ఏ ఒక్క వ్యక్తిపైనా ఆధారపడి లేదని, అత్యున్నత నాయకత్వంలో ఎటువంటి నష్టం జరిగినా తట్టుకుని నిలబడే శక్తి ఇరాన్ వ్యవస్థకు (మొజాయిక్ డిఫెన్స్) ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


అణుబాంబుల బెదిరింపు వార్తలు ఫేక్!


గతంలో జెనీవాలో జరిగిన చర్చల సందర్భంగా అమెరికా ప్రతినిధులను ఉద్దేశించి "మా వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉంది" అని అరాగ్చీ బెదిరించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కూడా ఆయన స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, వారు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఖండించారు. త్వరలోనే ఆ చర్చలకు సంబంధించిన పూర్తి వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆయన చెప్పారు.


అమెరికా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, బాంబులు వేసినా తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ ఈ ప్రకటన ద్వారా పరోక్షంగా తేల్చిచెప్పింది. హార్మూజ్ జలసంధిని తాము పూర్తిగా మూసెయ్యకపోయినా, శత్రుదేశాల నౌకలను అడ్డుకోవడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకుంటోంది. యుద్ధ భయంతో వాణిజ్య నౌకలు అటువైపు వెళ్లకపోతే కృత్రిమ కొరత ఏర్పడి, ఆ ఎఫెక్ట్ కచ్చితంగా మన దగ్గర చమురు ధరల పెరుగుదల రూపంలో పడుతుంది.