Supreme Court: చనిపోయిన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల వివరాలు వారసులకు ఎందుకు చెప్పరు? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు!
ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జర్నలిస్ట్ సుచేతా దలాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. బ్యాంకు ఖాతాల్లో ఏళ్ల తరబడి స్తంభించి ఉన్న, ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల (Unclaimed Deposits) సమాచారాన్ని చట్టపరమైన వారసులకు తెలియజేసేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. చనిపోయిన తల్లిదండ్రుల ఖాతాల వివరాలు వారి పిల్లలకు ఎందుకు చెప్పకూడదని అత్యున్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.
వీలునామా లేకపోతే వారసులకు ఎలా తెలుస్తుంది?
ఒక వ్యక్తికి వివిధ ప్రాంతాల్లో లేదా బ్యాంకుల్లో పది వేర్వేరు ఖాతాలు ఉండి, అతను ఎలాంటి వీలునామా (Will) రాయకుండా ఆకస్మికంగా మరణిస్తే ఆ ఖాతాల వివరాలు అతని వారసులకు ఎలా తెలుస్తాయని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. బహుశా సదరు వ్యక్తి కేవైసీ (KYC) కూడా పూర్తి చేసి ఉండకపోవచ్చని పేర్కొంది. బ్యాంకులు ఆ నిధులను బదిలీ చేయడం చట్టవిరుద్ధమని తాము అనడం లేదని, కానీ ఆ సమాచారాన్ని చట్టపరమైన వారసులకు తెలియజేస్తే తప్పేంటని న్యాయస్థానం అడిగింది. దీనికోసం ప్రభుత్వం ఏదైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని సూచించింది.
కేంద్రం, ఆర్బీఐలకు అఫిడవిట్ల దాఖలుకు ఆదేశాలు
ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ సుచేతా దలాల్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఎవరూ క్లెయిమ్ చేయని ఖాతాల వివరాలను ప్రజలకు తెలిసేలా బహిరంగపరచాలని, చనిపోయిన తమ తల్లిదండ్రుల ఖాతాలను వెతుక్కునేందుకు వీలుగా ఒక 'సెంట్రలైజ్డ్ అండ్ సెర్చబుల్ డేటాబేస్' ఉండాలని ఆర్బీఐ (RBI) కూడా గతంలో సిఫార్సు చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపిస్తూ.. ఒకవేళ నిజమైన వారసుడు ముందుకు వచ్చి ఆధారాలు చూపితే, 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్' నుంచి ఆ మొత్తాన్ని తిరిగి వారికి చెల్లిస్తామని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.

