Viswanath and Sons: వరుస పరాజయాలకు బ్రేక్.. సూర్యకు అసలైన కమ్‌బ్యాక్ ఇస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్'!
దక్షిణాది సినీ చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న అగ్ర కథానాయకుడు సూర్య. 'గజిని' సినిమాతో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ గత దశాబ్ద కాలంగా సరైన విజయాలు లేక ఆయన మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. భారీ అంచనాలతో వచ్చిన 'కంగువ', ఆ తర్వాత వచ్చిన 'రెట్రో' సినిమాలు దారుణంగా దెబ్బకొట్టడంతో సూర్య కెరీర్ ఎన్నడూ లేనంతగా డీలా పడిపోయింది.
'కరుప్పు' సినిమాపై అయోమయం
వరుస పరాజయాల నేపథ్యంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో 'కరుప్పు' అనే మాస్ చిత్రానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, దర్శకుడిగా బాలాజీకి పెద్దగా అనుభవం లేకపోవడం అభిమానుల్లో ముందు నుంచే సందేహాలు రేకెత్తించింది. దీనికి తోడు నిర్మాత ఆర్థిక సమస్యల వల్ల ఈ సినిమా విపరీతంగా ఆలస్యం అవుతూ వస్తోంది. గత ఏడాది దీపావళికి విడుదల కావాల్సిన ఈ చిత్రం, కనీసం ఈ వేసవికైనా వస్తుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ విపరీతమైన జాప్యం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో కనీస అంచనాలు కూడా లేకుండా పోయాయి.
బ్లాక్‌బస్టర్ కళతో 'విశ్వనాథ్ అండ్ సన్స్'
సరిగ్గా ఇలాంటి కష్టకాలంలో సూర్య తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ నిన్న విడుదలై సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ సరికొత్త టీజర్‌కు భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ప్రయోగాలు చేయడం సూర్యకు కొత్త కాకపోయినా, ఈ సినిమాలో ఆయన పాత్ర అందరికీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. తన సగం వయసున్న అమ్మాయి తనతో ప్రేమలో పడితే, ఆమెను హ్యాండిల్ చేయలేక సతమతమయ్యే నడి వయస్కుడి పాత్రలో సూర్య నటన జనాలకు విపరీతంగా నచ్చేస్తోంది. ఆయనకు జోడీగా నటించిన మలయాళ బ్యూటీ మామిత బైజు కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వెంకీ అట్లూరి మ్యాజిక్ రిపీట్
సాధారణంగా కొత్త సినిమాల టీజర్లు రాగానే 'బ్లాక్ బస్టర్ గ్యారెంటీ' అని టెంప్లేట్ కామెంట్లు చేయడం నెటిజన్లకు అలవాటే. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ చూశాక నిజంగానే ప్రతి ఒక్కరిలో అదే ఫీలింగ్ కలుగుతోంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే భారీ యాక్షన్ మాస్ చిత్రం కాకపోయినా, సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సూర్యకు ఇది కచ్చితంగా గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందని సినీ విశ్లేషకులు ధీమాగా చెబుతున్నారు. 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి మరో పరభాషా కథానాయకుడికి ఈ సినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వబోతున్నారని నమ్మకం కుదిరింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

