US Attacks Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ సర్జికల్ స్ట్రైక్.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రమైన 'ఖర్గ్ ఐలాండ్'పై కనీవినీ ఎరుగని స్థాయిలో బాంబుల వర్షం కురిపించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన ఈ ద్వీపంలోని సైనిక స్థావరాలను అమెరికా దళాలు పూర్తిగా తుడిచిపెట్టాయి. ప్రస్తుతానికి కేవలం సైనిక కేంద్రాలనే టార్గెట్ చేశామని, కానీ హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏమాత్రం అడ్డంకులు సృష్టించినా చమురు క్షేత్రాలను కూడా బూడిద చేస్తానని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈ ద్వీపంపై దాడి వెనుక ఉన్న అమెరికా మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం.
ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ సర్జికల్ స్ట్రైక్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంలో అమెరికా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 96 శాతం కేవలం ఈ ఖర్గ్ ఐలాండ్ నుంచే జరుగుతాయి. అలాంటి అత్యంత కీలకమైన ద్వీపంపై అమెరికా సెంట్రల్ కమాండ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల గురించి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా సంచలన ప్రకటన చేశారు. తన ఆదేశాల మేరకే ఈ అత్యంత శక్తివంతమైన దాడి జరిగిందని, ఇరాన్ మకుటంలో మణి లాంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక కేంద్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని ఆయన స్పష్టం చేశారు.
హోర్ముజ్ మూసేస్తామన్న ఇరాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
ఈ దాడుల్లో మానవీయ కోణంలో ఆలోచించి కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి వదిలేశానని ట్రంప్ వివరించారు. అయితే ఇక్కడే ఆయన ఒక భయంకరమైన కండిషన్ పెట్టారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ గనుక అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తన నిర్ణయాన్ని ఒక్క క్షణంలో మార్చుకుని చమురు క్షేత్రాలను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఆయుధ సంపద ముందు ఇరాన్ రక్షణ వ్యవస్థలు ఏమాత్రం నిలవలేవని, తమ దాడులను అడ్డుకునే శక్తి వాళ్లకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇరాన్ సైన్యం ఇకనైనా ఆయుధాలు పారేసి, మిగిలి ఉన్న దేశాన్ని కాపాడుకోవడం తెలివైన పని అని సలహా ఇచ్చారు.
ఆయిల్ మార్కెట్ కంట్రోల్.. అమెరికా మాస్టర్ ప్లాన్
ఖర్గ్ ఐలాండ్‌పై జరిగిన ఈ దాడి కేవలం ఒక సైనిక ఆపరేషన్ మాత్రమే కాదు, అది ఇరాన్ ఆర్థిక మూలాలను అమెరికా తన గుప్పిట్లోకి తీసుకోవడంగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంపై పట్టు సాధించడం ద్వారా ఇరాన్ ఆదాయాన్ని పూర్తిగా నిలిపివేసి, వాళ్లను దారికి తెచ్చి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడమే అమెరికా అసలు వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతుండటంతో, గ్లోబల్ ఎకానమీ కుప్పకూలకుండా అమెరికా నౌకాదళం త్వరలోనే వాణిజ్య నౌకలకు రక్షణగా రంగంలోకి దిగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని నిర్మించలేదని, ప్రపంచాన్ని బెదిరించే శక్తిని ఆ దేశానికి లేకుండా చేస్తామని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
"హోర్ముజ్ జలసంధి మూసేస్తాం" అని ఇరాన్ ప్రగల్భాలు పలుకుతుంటే, డైరెక్ట్ గా వాళ్ల చమురు గుండెకాయ (ఖర్గ్ ఐలాండ్) మీదే అమెరికా బాంబులు వేసి అసలైన వార్నింగ్ ఇచ్చింది. ఆయిల్ ఫీల్డ్స్ ని ప్రస్తుతానికి వదిలేసినా, ఎప్పుడైనా పేల్చేస్తామన్న ట్రంప్ బెదిరింపులతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వణికిపోతోంది. ఇది అంతర్జాతీయ చమురు మార్కెట్లలో మరింత పానిక్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

