B-1B Lancer: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా బాంబర్ గర్జన.. ఇరాన్‌కు వణుకు పుట్టిస్తున్న ‘బోన్’!
పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అగ్రరాజ్యం అమెరికా తన అసలైన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. ఇరాన్‌తో సైనిక ఘర్షణ తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో, శత్రువుల గుండెల్లో దడపుట్టించే అత్యంత భయంకరమైన సూపర్‌సోనిక్ బాంబర్ విమానం ‘బీ-1బీ లాన్సర్’ (B-1B Lancer) ను అమెరికా వైమానిక దళం రంగంలోకి దించింది.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి మద్దతుగా..
తన అజేయమైన దాడి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'కి మద్దతుగా ఈ విధ్వంసకర విమానం మిడిల్ ఈస్ట్ ఆకాశంలో గర్జించనుంది. అమెరికా సైనికులు ముద్దుగా ‘బోన్’ (B-One) అని పిలుచుకునే ఈ విమానం కేవలం బాంబర్ మాత్రమే కాదు, మొత్తం అమెరికా వైమానిక దళానికే వెన్నెముక లాంటిది. సౌత్ డకోటాలోని ఎల్స్‌వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన ఈ విమానం మధ్యప్రాచ్యానికి చేరుకోవడాన్ని బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చబోతోందనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
క్షణాల్లో శత్రు స్థావరాలు గల్లంతు!
ఈ బీ-1బీ లాన్సర్ విమానం ఏకకాలంలో సుమారు 34,000 కిలోల (75,000 పౌండ్ల) బరువున్న అత్యంత శక్తివంతమైన బాంబులు, క్షిపణులను సునాయాసంగా మోసుకెళ్లగలదు. ఇది గంటకు సుమారు 1,531 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల స్థావరాలను క్షణాల్లో చిత్తు చేయగల సామర్థ్యం దీని సొంతం. గైడెడ్ క్షిపణులు, అణు ఆయుధాలతో పాటు సంప్రదాయ బాంబులను కూడా ఇది కచ్చితత్వంతో ప్రయోగించగలదు. దీనికి ఉన్న ఆరు ఎక్స్టర్నల్ హార్డ్ పాయింట్స్ ద్వారా అదనపు బాంబులను సైతం అమర్చుకునే వెసులుబాటు ఉంది.
లాన్సర్ రేంజ్ తెలిస్తే మైండ్ బ్లాకే..
ఈ బాంబర్ విమానం ఏకంగా 60,000 అడుగుల ఎత్తు వరకు సునాయాసంగా ఎగరగలదు. ఇంధనం నిండుగా ఉంటే ఒకేసారి ఏకధాటిగా 9,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే ఆయుధాలు లేకుండా ఖాళీగా అయితే 12,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఈ అధునాతన విమానాన్ని నడపడానికి ఒక కమాండర్, ఒక పైలట్, ఇద్దరు ఆఫీసర్లు.. ఇలా మొత్తం నలుగురు సభ్యుల బృందం అవసరం అవుతుంది. అమెరికా అమ్ములపొదిలో ప్రస్తుతం ఇలాంటివి 104 విమానాలు ఉన్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఈ బాంబర్ విమానం అత్యంత కీలక పాత్ర పోషించనుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

