Ustaad Bhagat Singh: పవన్‌పై హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్

naveen
By -
పవన్‌పై హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్


Ustaad Bhagat Singh: 'కమిట్‌మెంట్ ఉన్నోడికే కటౌట్'.. ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్‌పై హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా జరిగింది.  రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షించిన ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు.


నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే..


గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక తాను మానసికంగా చాలా డల్‌గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తనకు దేవుడిలా అండగా నిలిచారని హరీష్ శంకర్ ఉద్వేగంగా చెప్పారు. తనను పిలిచి, వెంటనే షూటింగ్ ప్లాన్ చేసుకుని సినిమాను పూర్తి చేద్దామని పవన్ ఎంతో ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఆయన పరిగెత్తడమే కాకుండా, యూనిట్ అందరినీ పరుగులు పెట్టించారని, ఆ మాటలతో తన సందేహాలన్నీ తొలగిపోయాయని తెలిపారు. తన గుండె లోపలి ధైర్యం పవన్ కళ్యాణ్ మాత్రమేనని హరీష్ స్పష్టం చేశారు. 'గబ్బర్ సింగ్' సినిమాలో "కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు" అని డైలాగ్ రాశానని, కానీ పవన్ డెడికేషన్ చూశాక ఈసారి "కమిట్‌మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది" అనిపించిందని పవర్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.


సినిమా ఆలస్యానికి, వేగానికి కారణం నేనే..


ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి పూర్తి బాధ్యత తనదేనని హరీష్ శంకర్ ఎంతో నిజాయితీగా ఒప్పుకున్నారు. వాస్తవానికి ఈ కథను ముందుగా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'ఖుషి' సినిమా తరహాలో తీయాలని అనుకున్నారట. కానీ అందులో తాను అనుకున్న స్థాయిలో పవన్ కళ్యాణ్ హీరోయిజం, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ పండటం లేదని భావించి, మధ్యలో కథను పూర్తిగా మార్చాల్సి వచ్చిందని వివరించారు. ఈ మార్పుల వల్లే సినిమా ఆలస్యమైందని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో సినిమా అనుకున్న దానికంటే త్వరగా పూర్తి కావడానికి కూడా తానే కారణమని చెప్పారు. పవన్ కళ్యాణ్ కేటాయించిన సమయాన్ని పక్కా ప్రణాళికతో వాడుకుంటూ, కేవలం 48 రోజుల్లోనే సినిమాలోని అత్యంత కీలక భాగాన్ని షూట్ చేశామని హరీష్ శంకర్ వెల్లడించారు.


నిర్మాతలకు స్పెషల్ థాంక్స్.. థియేటర్లో డ్యాన్సుల మోతే!


సినిమాను ఏమాత్రం రాజీ పడకుండా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు హరీష్ శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సెట్‌లో రోజుకు దాదాపు 1200 మంది యూనిట్ సభ్యులతో భారీ స్థాయిలో షూటింగ్ నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, అయినా నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్ పడకుండా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కొనియాడారు. ప్రతి దర్శకుడికి ఇలాంటి నిర్మాతలు దొరకడం నిజంగా అదృష్టమన్నారు. రైటింగ్ టీమ్ కష్టాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. హీరోయిన్ శ్రీలీల గొప్ప డ్యాన్సర్ అని, ఈ సినిమాలో ఆమె పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రెండు పాటల్లో ఇరగదీసే స్టెప్పులు వేశారని, ముఖ్యంగా 'దేఖ్‌లేంగే సాలా' పాట థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు.