Ustaad Bhagat Singh: ఉస్తాద్ వేడుకలో శ్రీలీల ఎమోషనల్ స్పీచ్

naveen
By -
ఉస్తాద్ వేడుకలో శ్రీలీల ఎమోషనల్ స్పీచ్


Ustaad Bhagat Singh Pre-Release: పవన్ కళ్యాణ్ నుంచి ఎన్నో నేర్చుకున్నా.. ఉస్తాద్ ఈవెంట్‌లో శ్రీలీల ఎమోషనల్ స్పీచ్!


'గబ్బర్ సింగ్' లాంటి చారిత్రక బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, డైరెక్టర్ హరీష్ శంకర్ కష్టం గురించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడి మెగా అభిమానుల మనసులు గెలుచుకుంది.


వేదికపై శ్రీలీల మాట్లాడుతూ డైరెక్టర్ హరీష్ శంకర్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన ఎంతో నిజాయితీగా పని చేస్తారని, అందుకే అంత ముక్కుసూటిగా ఉంటారని ఆమె పేర్కొంది. సరిగా నిద్ర కూడా పోకుండా ఒక యజ్ఞంలా ఈ సినిమాను ఆయన పూర్తి చేశారని, ఆ కష్టానికి తగిన ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రతి చిన్న విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని సినిమాను నిర్మించిన మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ గారితో పాటు, అద్భుతమైన పాటలు అందించిన దేవి శ్రీ ప్రసాద్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.


పవర్ స్టార్, పీపుల్స్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని తాను కాదని శ్రీలీల ఎంతో వినయంగా చెప్పుకొచ్చింది. తాను 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నానని తెలియగానే, తమిళం, కన్నడ ఇండస్ట్రీలలో ఏ సెట్‌కి వెళ్లినా అందరూ పవన్ కళ్యాణ్ గురించే అడిగేవారని ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకుంది. ఆయనను చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటం, కేవలం మన జీవితం గురించే కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రకృతిని ప్రేమించడం లాంటివి పవన్ నుంచే అలవర్చుకున్నానని శ్రీలీల ఎమోషనల్ అయ్యింది.


పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం మొత్తం సినీ పరిశ్రమకే ఎంతో మంచిదని, ఆయన ఎంతోమందికి నిజమైన స్ఫూర్తి అని శ్రీలీల కొనియాడింది. అందరికీ ముందుస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆమె, ఈ పండుగను 'ఉస్తాద్ ఉగాది'గా మార్చేయాలని అభిమానులను కోరింది. మార్చి 19న థియేటర్లలో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూసి ఎంజాయ్ చేద్దామంటూ తన స్పీచ్‌ను ముగించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, తమన్ అదరగొట్టే నేపథ్య సంగీతంతో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.