Madhubala Biopic: మధుబాల బయోపిక్‌లో సాయిపల్లవి

naveen
By -
Madhubala Biopic

Madhubala Biopic: భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి.. బాలీవుడ్‌లో నేచురల్ బ్యూటీ సెన్సేషన్!


వైవిధ్యమైన పాత్రలు, సహజసిద్ధమైన నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'నేచురల్ బ్యూటీ' సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్ హీరోయిన్ చేతిలో ఇప్పుడు వరుస బాలీవుడ్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌లో సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


గతంలో మధుబాల పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ, అనీత్ పడ్డా వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ, మధుబాల హావభావాలను, సహజత్వాన్ని తెరపై అద్భుతంగా పండించాలంటే సాయిపల్లవి అయితేనే వంద శాతం న్యాయం చేస్తుందని భన్సాలీ బృందం గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే చివరికి సాయిపల్లవినే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


మరోవైపు, అమీర్ ఖాన్ ప్రొడక్షన్‌లో జునైద్ ఖాన్‌తో కలిసి నటించిన ‘ఏక్ దిన్’ సినిమాతో సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టనుంది. ఈ చిత్రం 2026 మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్‌తో కలిసి ప్రతిష్టాత్మక ‘రామాయణ’ చిత్రంలో సీతగా నటిస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కూడా ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది.


గతంలో ‘పద్మావత్’, ‘గంగూబాయి కాఠియావాడి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బలమైన మహిళా పాత్రలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత సంజయ్ లీలా భన్సాలీకి ఉంది. ఇప్పుడు మధుబాల బయోపిక్‌ను కూడా ఆయన అదే స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. భన్సాలీ లాంటి దిగ్గజ దర్శకుడి సినిమాలో గనక సాయిపల్లవి నటిస్తే, అది ఆమె సినీ కెరీర్‌లోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని ఆమె అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags: