రాత్రి పడిందంటే చాలు.. ప్రధాన కూడళ్లలో పోలీసుల డేగకన్ను.. బ్రీత్ ఎనలైజర్లతో ముమ్మర తనిఖీలు! మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారి ఆట కట్టించేందుకు ఖాకీలు ఒకవైపు వ్యూహాలు పన్నుతుంటే.. మరోవైపు మందుబాబులు సైతం టెక్నాలజీని వాడుకుని హాలీవుడ్ రేంజ్‌లో పోలీసులకే మైండ్ బ్లాక్ చేస్తున్నారు. రోడ్ల మీద తనిఖీలు చూసి గల్లీల్లోకి దూరిపోయి పారిపోవడం, తోటి వాహనదారులకు సైగలు చేసి అప్రమత్తం చేయడం లాంటి పాత ట్రిక్స్‌కు గుడ్ బై చెప్పి.. ఏకంగా భారీ స్థాయిలో వాట్సాప్ నెట్‌వర్క్ నడుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మందుబాబులు వేసిన ఈ హైటెక్ మాస్టర్ స్కెచ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
'పోలీస్ మామలు'.. 1024 మందితో సీక్రెట్ గ్రూప్!
సరిగ్గా సాయంత్రం కాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, భారీ జరిమానాలు, జైలు శిక్షల నుంచి సులువుగా తప్పించుకునేందుకు గోదావరిఖని మందుబాబులు ఒక భారీ డిజిటల్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఎక్కడెక్కడ పోలీసుల బందోబస్తు ఉంది? ఏ కూడలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నడుస్తున్నాయి? అన్న పక్కా సమాచారాన్ని క్షణాల్లో పంచుకునేందుకు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు.
దానికి 'పోలీస్ మామలు' అని ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నారు. ఇందులో ఎవరైనా ఒకరు ఆ రూట్లలో వెళ్తూ పోలీసుల తనిఖీలు చూస్తే చాలు.. వెంటనే గ్రూప్‌లో లైవ్ అప్‌డేట్ ఇచ్చేసేవారు. ఆ మెసేజ్ చూసుకుని మిగతా మందుబాబులంతా రూట్ మార్చి, ప్రత్యామ్నాయ గల్లీల గుండా పోలీసుల కళ్లుగప్పి దర్జాగా ఇళ్లకు చేరుకునేవారు.
అడ్డంగా దొరికిన అసలు దొంగ.. ఆపరేషన్ గుట్టురట్టు
Godavarikhani Police Busts Drunk And Drive Secret WhatsApp Group : ఎన్ని రోజులు తనిఖీలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో మందుబాబులు ఎవరూ పట్టుబడకపోవడంతో పోలీసులకు అనుమానం రానే వచ్చింది. అయితే, రీసెంట్‌గా జరిగిన తనిఖీల్లో ఒక మందుబాబు అతితెలివికి పోయి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిపోయాడు. బ్రీత్ ఎనలైజర్‌లో అతడు దొరికిపోవడంతో.. పోలీసులు విచారణలో భాగంగా అతడి మొబైల్ ఫోన్ తీసుకుని చెక్ చేశారు. వాట్సాప్ ఓపెన్ చేసి చూసిన పోలీసులకు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏకంగా 1024 మంది సభ్యులతో నడుస్తున్న ఆ 'పోలీస్ మామలు' సీక్రెట్ ఆపరేషన్ గుట్టు రట్టయింది.
గ్రూప్‌లో ఖాకీల ఎంట్రీ.. వణికిపోయిన మందుబాబులు!
డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకోవడానికి ఇంత భారీ నెట్‌వర్క్ నడుపుతున్నారని గుర్తించిన ట్రాఫిక్ ఎస్సై.. వెంటనే తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆ వాట్సాప్ గ్రూపులో తన సొంత నంబర్‌ను యాడ్ చేసుకుని దర్జాగా గ్రూప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటిదాకా గ్రూప్‌లో రెచ్చిపోయిన మందుబాబులకు.. సాక్షాత్తూ ట్రాఫిక్ ఎస్సై అందులో జాయిన్ అయ్యాడని తెలియగానే వెన్నులో వణుకు పుట్టింది. అసలు విషయం అర్థమై, భయంతో వణికిపోతూ ఒక్కొక్కరుగా ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి పరుగుపరుగున లెఫ్ట్ (Left) అయిపోవడం మొదలుపెట్టారు.
వీడియో పోస్ట్ చేసిన ఎస్సై.. అందరికీ కౌన్సెలింగ్!
మందుబాబులు లెఫ్ట్ అవుతున్నా ఎస్సై ఏమాత్రం తగ్గలేదు. ఆ 'పోలీస్ మామలు' గ్రూప్‌లోనే నేరుగా ఒక వీడియోను పోస్ట్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ఈ గ్రూపులో ఉన్న 1024 మంది వ్యక్తుల ఫోన్ నంబర్ల జాబితాను నేను ఇప్పటికే నా దగ్గర తీసుకున్నాను. మీరంతా ఇప్పుడు లెఫ్ట్ అయిపోయినా లాభం లేదు, త్వరలోనే మీ అందరినీ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తాను" అని హెచ్చరించారు.
"పోలీస్ మామలు" అంటూ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో గ్రూప్ వీడిన సభ్యులు
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) April 4, 2026
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి ఫోన్ చెక్ చేయగా, "పోలీస్ మామలు" అనే వాట్సప్ గ్రూప్ గుర్తించిన పోలీసులు
డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర తనిఖీల గురించి ఈ గ్రూప్… pic.twitter.com/0aawjxM6rO
చట్టాన్ని మోసం చేయాలని చూస్తే.. అదే టెక్నాలజీతో పోలీసులు మీ ఇంటికే వస్తారనడానికి ఈ ఘటనే అతిపెద్ద ఉదాహరణ! ఎస్సై ఇచ్చిన ఈ షాకింగ్ వీడియో, ఆ గ్రూప్ తాలూకు చాటింగ్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ హైటెక్ క్రైమ్ కామెడీపై నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది.

