'ఆపరేషన్ సింధూర్' ముగియలేదు: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్

naveen
By -

Indian Defence Minister Rajnath Singh giving a stern warning to Pakistan regarding Operation Sindoor

దాయాది దేశం గుండెల్లో మరోసారి భయం పుట్టిస్తూ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సింహంలా గర్జించారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు లేదా కుతంత్రాలకు పాల్పడాలని ఏమాత్రం సాహసించినా.. చరిత్రలో మునుపెన్నడూ చూడని మహా విధ్వంసాన్ని చవిచూడాల్సి వస్తుందని పాకిస్థాన్‌కు అత్యంత కఠిన హెచ్చరికలు జారీ చేశారు!


కేరళ వేదికగా పాక్‌కు హెచ్చరిక! 

కేరళలోని తిరువనంతపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 'సైనిక్ సమ్మాన్ సమ్మేళన్' వేదికగా రాజ్‌నాథ్ సింగ్ శత్రు దేశాలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం భగభగ మండుతూ.. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో, భారత భద్రత విషయంలో ఎంతటి కఠిన నిర్ణయాలకైనా తమ ప్రభుత్వం ఏమాత్రం వెనకాడబోదని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశ రక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


22 నిమిషాల ప్రళయం.. మోకరిల్లిన పాకిస్థాన్! 

గత ఏడాది ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడికి.. ప్రతీకారంగా భారత ఆర్మీ సృష్టించిన 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor) విధ్వంసం గురించి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆపరేషన్ ద్వారా కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను భారత సైన్యం నామరూపాలు లేకుండా మట్టికరిపించిందని గుర్తుచేశారు. ఆ దెబ్బకు శత్రు దేశం పాకిస్థాన్ మోకాళ్లపై నిలబడిందని ఆయన ఉద్వేగంగా వెల్లడించారు.


'ఆపరేషన్ సింధూర్' ఇంకా ముగియలేదు! 

"పాకిస్థాన్‌కు నేను గట్టిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను.. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు!" అంటూ రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక సభలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఒకవేళ మళ్లీ అలాంటి దారుణాలకు, కుతంత్రాలకు పాకిస్థాన్ ఒడిగడితే.. మన సాయుధ దళాలు ఆ దేశం జీవితంలో మర్చిపోలేని విధంగా తగిన బుద్ధి చెబుతాయని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


నయా భారత్.. దెబ్బకు దెబ్బ! 

ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో జాతీయ భద్రత పట్ల భారత ప్రభుత్వ దృక్పథం సమూలంగా మారిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఉరీ ఉగ్రదాడి జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌తో.. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడులతో.. పహల్గాం ఘటనకు బదులుగా ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు తగిన శాస్తి చేశామని గుర్తుచేశారు. దాయాది దేశం మనపై దాడి చేసిన ప్రతిసారీ.. భారత్ ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా దట్టమైన యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. శత్రువులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మన సరిహద్దులను ఉక్కుకోటలా పటిష్టం చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


సముద్రం నుంచి గురిపెట్టిన క్షిపణులు.. పాక్ కాళ్లబేరం! 

రాజ్‌నాథ్ సింగ్ గర్జనకు ఒక్కరోజు ముందే.. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే ఒక అసలు నిజాన్ని బయటపెట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్థాన్‌పై సముద్రం నుంచి కూడా భీకర దాడి చేయడానికి సర్వం సిద్ధం చేసుకుందని ఆయన ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. "భారత నావికాదళం ఆ సమయంలో అత్యంత దూకుడుగా వ్యవహరించింది. సముద్రం నుంచి మన క్షిపణులు పాక్ వైపు గురిపెట్టి లాక్ చేసిన తరుణంలో.. ఆ భయానికి వారు దాడులు ఆపమని ప్రాధేయపడ్డారు" అని అడ్మిరల్ త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు శత్రు దేశపు పిరికితనాన్ని బట్టబయలు చేశాయి. భయంతో వణికిపోయిన పాకిస్థాన్ చివరి నిమిషంలో కాళ్లబేరానికి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.


భూమి మీదైనా, గగనతలంలోనైనా, సముద్రం మీదుగానైనా.. భారత్ వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తామన్న హెచ్చరికలు శత్రు దేశాల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా భారత రక్షణ వ్యవస్థ అగ్రరాజ్యాల సరసన నిలబడి గర్జిస్తోంది!

Tags: