US Iran Conflict: ఇరాన్ యుద్ధంలో అమెరికా నిజంగా గెలిచిందా?

naveen
By -
Split screen showing Donald Trump claiming victory on one side and armed Iranian forces controlling the Strait of Hormuz on the other


యుద్ధంలో గెలిచామని ఒకరు భుజాలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.. ముప్పు తప్పిందని మరొకరు సంబరాలు చేసుకుంటున్నారు! కానీ, అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ నిజంగా ఇరాన్‌ను ఓడించాయా? లేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 'విజయం' అనే ముసుగు వేసుకున్నాయా? ప్రపంచాన్ని గడగడలాడించిన 40 రోజుల పశ్చిమాసియా యుద్ధం తర్వాత, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందం ముంగిట డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న "సంపూర్ణ విజయం" ప్రకటనల వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటి? క్షేత్రస్థాయిలో పేలిన బాంబులకు, వాషింగ్టన్ చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన లేదు. అణు ముప్పు, హర్మూజ్ జలసంధి, పాలనా మార్పు.. ఇలా ప్రతి విషయంలోనూ అమెరికాకు ఎదురుదెబ్బలే తగిలాయా? ఈ మహా సంగ్రామంలో అసలు గెలిచిందెవరు? ఓడిందెవరు?


డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్, నెతన్యాహు!


ఇరాన్‌తో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరగకముందే.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సగర్వంగా ప్రకటించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రశంసిస్తూ, ఇది ‘ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు’ అని ఆయన అభివర్ణించారు.


దీనికి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా గొంతు కలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను తాము పూర్తిగా నాశనం చేశామని, ఈ దాడుల ద్వారా తమ సైనిక లక్ష్యాలన్నింటినీ అమెరికా వంద శాతం సాధించిందని ఆయన ప్రకటించారు. తాము చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) అత్యంత చారిత్రాత్మకమని, యుద్ధ క్షేత్రంలో అసాధారణ గెలుపు సాధించామని వారంతా డబ్బా కొట్టుకున్నారు. ఇటు ఇజ్రాయెల్ సైతం ఇలాగే గొప్పలు పోయింది. ఇరాన్ వైపు నుంచి ఇకపై తమకు ఎలాంటి దీర్ఘకాలిక ముప్పు లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చంకలు గుద్దుకున్నారు.


వాస్తవాలు వేరు.. సాధించిందేమిటి?


అయితే, ఈ 'విజయం' గురించిన వాదనలు వినడానికి బాగానే ఉన్నా.. ఈ మహా సంగ్రామంలో ప్రధాన పాత్రధారులైన అమెరికా, ఇజ్రాయెల్ వాస్తవానికి భూమి మీద ఏమి సాధించాయి? ఏం సాధించడంలో ఘోరంగా విఫలమయ్యాయి? అనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే ఎన్నో నగ్న సత్యాలు వెలుగులోకి వస్తాయి.


నెల రోజులకు పైగా నెత్తురోడిన ఈ యుద్ధంలో ఇరాన్ అణు కార్యక్రమానికి ముగింపు పలకడం, దాని సైనిక సామర్థ్యాలను నాశనం చేయడం, అక్కడ పాలన మార్పు తీసుకురావడం వంటి తన లక్ష్యాల గురించి ట్రంప్ ఎప్పటికప్పుడు పరస్పర విరుద్ధమైన ప్రకటనలే చేశారు. 


ఇస్లామాబాద్‌లో జరగనున్న శాంతి చర్చలలో గనక ప్రస్తుత ఒప్పందం నిలబడితే.. ఈ సంఘర్షణ విషయంలో ట్రంప్ చెప్పిన కారణాలు, లక్ష్యాలు చాలా వరకు నెరవేరనట్లే అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇరాన్ అణు ఆశయాలను నిలిపివేయడం లేదా దాని బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని రద్దు చేయడం వంటి ఆయన ప్రగల్భాలు అపరిష్కృత ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.


హర్మూజ్ జలసంధి.. అమెరికాకు సెల్ఫ్ గోల్!


ఈ యుద్ధంలో అంతకంటే ముందు లేని, ఆర్థికంగా అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'పై ఇరాన్ నియంత్రణ ఇప్పుడు ఒక కొత్త వివాదాంశంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటిస్తూ.. హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ ఎట్టకేలకు అంగీకరించిందని అమెరికా గర్వంగా చెప్పుకుంది. కానీ, అసలు నిజం ఏమిటంటే.. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఈ జలమార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛాయుత రవాణా కొనసాగింది!


అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడులు మొదలయ్యాక తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. 


అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ ఎనర్జీ సెంటర్‌కు చెందిన నాన్‌-రెసిడెంట్ సీనియర్ ఫెలో ఇయాన్ రాల్బీ ప్రకారం.. హర్మూజ్‌పై ఇరాన్‌కు పూర్తి నియంత్రణను వదిలివేయడం అనేది యుద్ధానికి ముందున్న సాధారణ స్థితి కంటే అత్యంత అధ్వాన్నమైన పర్యవసానం! ఇది ఇరాన్‌ను భవిష్యత్తులో చాలా శక్తివంతమైన స్థితిలో ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, ఆ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యానికి అమెరికా పరోక్షంగా చట్టబద్ధత కల్పించినట్లయింది.


సైన్యం దెబ్బతిన్నా.. దాడులు ఆగలేదు!


అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇదొక మహా సైనిక విజయమని, ఇరాన్‌ సైనిక సామర్థ్యాలను తీవ్రంగా క్షీణింపజేశామని ప్రకటించుకున్నారు. కానీ, వైట్‌హౌస్ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని అమెరికా ఆర్మీ రిటైర్డ్ జనరల్ జోసెఫ్ వోటెల్ కుండబద్దలు కొట్టారు.


ఇరాన్ సైనిక సామర్థ్యం కొంత దెబ్బతిందనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ.. తన భీకర కార్యకలాపాలను కొనసాగిస్తూ ఇజ్రాయెల్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలపై ప్రతిరోజూ టెహ్రాన్ దాడులు చేస్తూనే ఉందని ఆయన గుర్తుచేశారు. అప్పుడప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ తన ప్రతాపం చూపిస్తోందని ఆయన వాస్తవాలను కళ్లకు కట్టారు.


మరింత పెరిగిన అణు ముప్పు!


అసలు అమెరికా దాడులు ప్రారంభించిందే ఇరాన్ అణ్వాయుధాలను తయారుచేస్తుందనే ప్రధాన వాదనతో! అంతర్జాతీయ నిపుణులు ఆ వాదనను పూర్తిగా ఖండించినప్పటికీ, ఇరాన్ కేవలం కొన్ని వారాల్లోనే అణ్వాయుధాన్ని సంపాదించబోతోందని ట్రంప్ పదే పదే పట్టుబట్టారు.


తీరా యుద్ధం ముగిశాక ఇరాన్ అణు సామర్థ్యాలను తగ్గించేశామని ట్రంప్ ప్రకటించుకున్నారు. కానీ వాస్తవం భయంకరంగా ఉంది. ఇరాన్ కొత్త నాయకత్వం అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఇప్పుడు మరింత ఉత్సాహంగా, కసితో ఉంది. 


అణ్వాయుధాలకు వ్యతిరేకంగా మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ గతంలో ఒక 'ఫత్వా' జారీ చేశారు. కానీ, ఇప్పుడు ఆయన మరణించడంతో ఆ ఫత్వా చెల్లుబాటు కాదు. దీనితో ఇరాన్ నాయకత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ అణు సామర్థ్యాలను పెంచుకోవడానికి రెడీ అవుతోంది.


పాలన మారలేదు.. కేవలం కుర్చీ మారింది!


ఇరాన్‌లో కచ్చితంగా పాలన మార్పు వస్తుందని, 47 ఏళ్ల వారి నియంత పాలనకు ముగింపు పలుకుతామని యుద్ధానికి ముందు ట్రంప్ ప్రగల్భాలు పలికారు. కానీ, 40 రోజుల నెత్తుటి యుద్ధంలో ఆ లక్ష్యం మాత్రం ఏమాత్రం నెరవేరలేదు. అయినా సరే ట్రంప్ మాత్రం అక్కడ పూర్తిగా పాలన మారిపోయిందని అబద్ధపు ప్రకటన చేయడం గమనార్హం.


ఫిబ్రవరి 28న యుద్దం మొదలైన తొలి రోజే ఇజ్రాయెల్-అమెరికా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన మాట వాస్తవమే. కానీ, ఆయన స్థానంలో, ఆయన వారసుడిగా రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఏకగ్రీవంగా సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. అంటే ఇరాన్‌లో కేవలం నాయకత్వ మార్పు మాత్రమే జరిగిందే తప్ప.. వారి సిద్ధాంతాలు, విధానాలు ఏమాత్రం మారలేదని సీనియర్ ప్రభుత్వ అధికారి డానియల్ బెనియమ్ స్పష్టం చేశారు.


మొత్తానికి వందల ప్రాణాలు బలితీసుకుని, బిలియన్ల కొద్దీ డాలర్లు బూడిదలో పోసిన ఈ యుద్ధంలో అమెరికా సాధించిన 'విజయం' కేవలం మైకుల ముందు మాటలకే పరిమితమైంది. ఇరాన్ మాత్రం గాయపడిన సింహంలా మరింత ప్రమాదకరంగా మారుతోందన్నదే ఇక్కడి నిఖార్సైన నిజం!