అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం.. ఆర్థిక మాంద్యం అంచున నిలబడ్డ గ్లోబల్ మార్కెట్లకు, బిక్కుబిక్కుమంటున్న బడుగు జీవులకు కొండంత ఊరటనిచ్చింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని భారత్ సహా యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో స్వాగతించాయి. వినాశనపుటంచులకు చేరిన మానవ జీవనం, కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడటానికి ఇది ఖచ్చితంగా తొలి అడుగు అని అంతర్జాతీయ వేదికలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
భారత్ ఆశాభావం.. హార్మూజ్ ఓపెన్ అయితేనే అసలు పండుగ!
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన దౌత్యపరమైన ఈ విరామాన్ని భారతదేశం మనస్ఫూర్తిగా స్వాగతించింది. బుధవారం నాడు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఈ అంశంపై స్పందిస్తూ.. ఈ పద్నాలుగు రోజుల విరామం పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన, గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధి ద్వారా తిరిగి స్వేచ్ఛా నౌకాయానం ప్రారంభం కావడానికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేయాలని భారత్ బలంగా ఆకాంక్షించిందని ఆయన చెప్పారు. మన దేశ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా చూసుకుంటే.. ఇంధన ధరల స్థిరీకరణకు, చమురు మంటలు తగ్గడానికి ఈ జలసంధి తలుపులు తెరవడం చాలా ముఖ్యం అని కుండబద్దలు కొట్టారు.
తాత్కాలికం కాదు.. శాశ్వతంగా ఆగాలి: అగ్రరాజ్యాల పిలుపు!
ఈ మహా సంగ్రామానికి పడిన తాత్కాలిక బ్రేక్‌పై బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి అగ్రరాజ్యాలు హర్షం వ్యక్తం చేస్తూనే.. మరో పక్క ఇది కేవలం తాత్కాలిక విరామంగా మిగిలిపోకూడదని గట్టిగా హెచ్చరించాయి.
"ఈ ఒప్పందం ప్రపంచ దేశాలకు దొరికిన ఒక గొప్ప ఊరట. హార్మూజ్ జలసంధిని తెరవడానికి మనమంతా ఏకతాటిపై నిలబడి మద్దతు ఇవ్వాలి. ఇది కచ్చితంగా ఒక శాశ్వత ఒప్పందంగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని యూకే (బ్రిటన్) ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. "యుద్ధం ఎంత కాలం సాగితే.. అమాయక మానవ జీవితాలపై అంత భయంకరమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ అరుదైన సంధి కోసం అహర్నిశలు కృషి చేసిన మధ్యవర్తిత్వ దేశాలకు నా ప్రత్యేక ధన్యవాదాలు" అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. "యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడంపైనే ఇక మా పూర్తి దృష్టి ఉంటుంది. దీనికోసం భాగస్వామ్య పక్షాలతో కలిసి వ్యూహాత్మకంగా పని చేస్తున్నాం" అని తేల్చి చెప్పారు. మరోవైపు, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఈయూ (EU) కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డర్ లెయాన్ కూడా ఈ చారిత్రక ఒప్పందాన్ని షరతులతో కూడిన నిజాయతీతో రెండు పక్షాలూ అమలు చేయాలని పిలుపునిచ్చారు.
14 రోజులు వృథా చేయకండి.. ఐరాస దిశానిర్దేశం!
ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరాన్, అమెరికా కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందిస్తూ కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతి కోసం అన్ని పక్షాలూ పట్టుదలతో, చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన గట్టిగా కోరారు.
ఉద్రిక్తతలు ఇలా తగ్గుముఖం పట్టడం ఒక గొప్ప శుభపరిణామమని కొనియాడిన ఆయన.. దొరికిన ఈ 14 రోజుల బంగారు సమయాన్ని ఎట్టిపరిస్థితుల్లో వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని, భవిష్యత్ చర్చలు ఫలప్రదంగా సాగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే అత్యంత కీలక చర్చలపై ఇప్పుడు ప్రపంచం మొత్తం వేయికళ్లతో, ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ రెండు వారాల విరామం.. నెత్తురోడుతున్న రణక్షేత్రాన్ని ప్రశాంతమైన శాంతి క్షేత్రంగా మారుస్తుందా? లేక ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇది కేవలం తుఫాను ముందు ప్రశాంతత లాగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి!
Also Read:
గాల్లో కలిసిన శాంతి ఒప్పందం.. 24 గంటల్లోనే మూతపడిన హర్మూజ్ జలసంధి!Strait of Hormuz: హర్మూజ్ టోల్ ఫీజుపై ఇరాన్, ఒమన్ వార్
ఇంటర్వ్యూల్లో అడ్డంగా దొరికిపోతున్న ఉత్తర కొరియా సైబర్ దొంగలు
Donald Trump Impeachment | ఇరాన్ ఎఫెక్ట్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ఔట్?
మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపిన 'తెలుగింటి అల్లుడు' జేడీ వాన్స్ మంత్రాంగం!

