గాల్లో కలిసిన శాంతి ఒప్పందం.. 24 గంటల్లోనే మూతపడిన హర్మూజ్ జలసంధి!

naveen
By -
Explosions in Lebanon caused by Israeli airstrikes, alongside a closed Strait of Hormuz, depicting the broken US-Iran ceasefire


మహా సంగ్రామానికి ముగింపు పలికి, ప్రపంచానికి ఊపిరి పోసిందనుకున్న 'శాంతి ఒప్పందం' కేవలం 24 గంటలు కూడా నిలవలేదు. పశ్చిమాసియాలో రగులుకున్న మంటలు మళ్లీ మొదటికొచ్చాయి. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో సంధి కుదుర్చుకుని చర్చలకు సిద్ధమవుతున్న వేళ.. ఇజ్రాయెల్ పేల్చిన బాంబులకు ప్రతీకారంగా ఇరాన్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఒక్క రాత్రిలో సీన్ ఎందుకు రివర్స్ అయింది?


24 గంటల్లోనే రివర్స్.. మూతపడిన హర్మూజ్ జలసంధి!


పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున ఈ చారిత్రక సంధిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించి అందరికీ ఊరటనిచ్చింది.


కానీ, ఈ శాంతి ఒప్పందం 24 గంటలైనా గడవకముందే పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులకు స్ట్రాంగ్ కౌంటర్‌గా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ వెంటనే మూసివేసినట్టు 'అసోసియేటెడ్ ప్రెస్' తన నివేదికలో స్పష్టం చేసింది.


నెతన్యాహు ట్విస్ట్.. లెబనాన్‌ను వదిలేది లేదు!


ఇరాన్‌తో కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బహిరంగంగా మద్దతు తెలిపారు. కానీ, అక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ ఇచ్చారు. ఆ శాంతి ఒప్పందంలో లెబనాన్‌ను మాత్రం తాము చేర్చలేదని బాంబు పేల్చారు.


"ఇరాన్ తక్షణమే హర్మూజ్ జలసంధిని తెరిచి, అమెరికా, ఇజ్రాయెల్, ఈ ప్రాంతంలోని దేశాలపై అన్ని దాడులను పూర్తిగా నిలిపివేస్తే.. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు ఆపాలన్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది" అని నెతన్యాహు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.


ట్రంప్ అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్!


రాబోయే చర్చలలో అమెరికా, ఇజ్రాయెల్, మరియు గల్ఫ్ మిత్రదేశాలు పంచుకునే ఉమ్మడి లక్ష్యాలను కచ్చితంగా సాధించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇజ్రాయెల్‌కు అమెరికా గట్టి హామీ ఇచ్చింది. ఈ రెండు వారాల కాల్పుల విరమణలో లెబనాన్‌ను ఏమాత్రం చేర్చలేదని బెంజమిన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు.


అంతేకాదు, ట్రంప్ సహకారం చాలా గొప్పదని, ఆయనతో తమ సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయని నెతన్యాహు సగర్వంగా పేర్కొన్నారు. శాంతి ఒప్పందం పేరుతో హెజ్బొల్లాపై దాడులను ఆపే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.


లెబనాన్‌పై భీకర దాడులు.. 112 మంది మృతి!


ఇజ్రాయెల్ సైన్యం చెప్పినంత పనీ చేసింది. లెబనాన్‌‌లోని హజ్బెల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ బుధవారం కూడా భీకర దాడులను కొనసాగించింది. అత్యంత దారుణంగా జరిగిన ఈ మారణహోమంలో ఏకంగా 112 మంది మరణించగా, 837 మంది అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండపై ఇరాన్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.


కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా లెబనాన్‌ను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకోవడంపై మీడియాతో ట్రంప్ మాట్లాడారు. దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘అవును, ఆ ఒప్పందంలో లెబనాన్ లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. హెజ్బొల్లా కారణంగానే వారిని ఆ ఒప్పందంలో చేర్చలేదని, దాని గురించి కూడా భవిష్యత్తులో చూసుకుంటామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న (రేపు) పాకిస్థాన్ వేదికగా ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే.


అమెరికా 'శాంతి' అంటుంటే.. ఇజ్రాయెల్ 'క్రాంతి' అంటోంది. ఈ ద్విపాత్రాభినయం వెనుక ఉన్న అసలు కుట్రను పసిగట్టిన ఇరాన్, ఏప్రిల్ 10న పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన చారిత్రక చర్చల ముందే హర్మూజ్ జలసంధిని మూసివేసి తన సత్తా చాటింది. నా అంచనా ప్రకారం, పాకిస్థాన్‌లో జరగబోయే ఈ ఇరాన్-అమెరికా ప్రతినిధుల చర్చలు ఒక కొలిక్కి రావడం దాదాపు అసాధ్యం. లెబనాన్‌పై బాంబులు పడుతున్నంత కాలం హర్మూజ్ గేట్లు తెరుచుకోవు. ముడిచమురు రవాణా స్తంభించి, రాబోయే వారం రోజుల్లోనే మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సామాన్యుడి జేబుకు కన్నం పడే ఈ యుద్ధం.. ఇప్పట్లో ఆగేలా లేదు!