రేపు మీ అమ్మాయికి క్యాంపస్ ప్లేస్‌మెంట్ రావచ్చు.. కానీ ఆ కుర్చీలో ఆమె కూర్చునేలోపే ఒక ఏఐ రోబో దాన్ని లాగేసుకుంటే? వినడానికి భయంగా ఉన్నా, ముంచుకొస్తున్న ఈ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' విప్లవం మగవారి కంటే ఆడవారి కెరీర్‌నే అత్యంత దారుణంగా దెబ్బతీయబోతోందన్న నిజం.. ఉద్యోగం చేస్తున్న ప్రతి మహిళా, ప్రతి తండ్రీ తక్షణమే తెలుసుకోవాల్సిన అత్యవసర వాస్తవం!
టెక్ సునామీ.. లక్ష్యంగా మహిళా ఉద్యోగాలు
పది నిమిషాల పనిని పది సెకన్లలో చేసే ఏఐ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు సరికొత్త బ్రహ్మాస్త్రం. అమెజాన్, మెటా, ఒరాకిల్ లాంటి టెక్ దిగ్గజాలు 'ఖర్చు తగ్గింపు' ముసుగులో ఇప్పటికే మొదలుపెట్టిన లేఆఫ్స్ కత్తి.. నేరుగా మహిళా ఉద్యోగుల మెడపైనే వేలాడుతోంది.
అమెరికాకు చెందిన 'నేషనల్ పార్టనర్‌షిప్ ఫర్ ఉమెన్ అండ్ ఫ్యామిలీస్' సంస్థ బయటపెట్టిన డేటా చూస్తే గుండె గుభేల్మనక మానదు. శ్రామిక వర్గంలో సగం (47%) ఉన్న మహిళలు.. ఏఐ ఈజీగా లాగేసుకునే 15 రకాల క్లరికల్ పనుల్లోనే అత్యధికంగా (83%) కూరుకుపోవడమే ఈ వినాశనానికి అసలు కారణం.
60 లక్షల మందికి 'పింక్ స్లిప్' గండం
ఇండియాటుడే నివేదిక ప్రకారం.. డాక్యుమెంటేషన్, కస్టమర్ సర్వీస్, రిసెప్షనిస్ట్, క్లర్క్ లాంటి పనులను ఏఐ యంత్రాలు మనుషులకంటే కచ్చితత్వంతో చిటికెలో చేసేస్తున్నాయి. దీంతో ఈ రంగాల్లో స్థిరపడిన సుమారు 60 లక్షల మంది ఆడపడుచుల ఉపాధి ఇప్పుడు గాలిలో దీపంలా మారిపోయింది.
పోనీ హ్యూమన్ టచ్ అవసరమైన నర్సింగ్, చైల్డ్ కేర్ పనుల్లో సేఫ్ అనుకుంటే.. అక్కడ కూడా 'బాస్‌వేర్' (Bossware) రూపంలో ఏఐ తన పైశాచిక నిఘాను పెంచేసింది. అడుగడుగునా ఉద్యోగినుల కదలికలను పసిగడుతూ వారి మానసిక ప్రశాంతతను, పని నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తోంది.
కోడింగ్ రాసే యంత్రానికీ మగ అహంకారమే!
సాఫ్ట్‌వేర్ డిజైనింగ్, లీడర్‌షిప్ స్థానాల్లో నేటికీ మగవారి ఆధిపత్యమే నడుస్తుండటంతో.. వారు సృష్టించిన ఏఐ అల్గారిథమ్స్ కూడా పురుషులకే పెద్దపీట వేస్తున్నాయి.
చాట్‌జీపీటీకి పేర్లు మార్చి రెజ్యూమెలు ఇస్తే.. అది ఏమాత్రం ఆలోచించకుండా వయసు పైబడిన మగవారినే అత్యంత అనుభవజ్ఞులుగా గుర్తించి ఎక్కువ మార్కులు వేయడం ఈ పచ్చి పక్షపాతానికి సజీవ సాక్ష్యం. అంతేకాదు, ఆఫీసులో ఒకే ఏఐ టూల్ వాడినా.. మగవారి కంటే ఆడవారిపైనే కంపెనీలు రెట్టింపు స్థాయిలో విమర్శలు, ప్రొఫెషనల్ పెనాల్టీలు విధిస్తున్నట్లు పరిశోధనలు కుండబద్దలు కొట్టాయి.
డీప్‌ఫేక్ భూతం.. భవిష్యత్ పోరాటం!
కెరీర్ నాశనం కావడమే కాకుండా.. ఎలాన్ మస్క్ తెచ్చిన 'గ్రోక్' (Grok) లాంటి ఏఐ టూల్స్ ఆకతాయిలకు వరంగా మారాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీతో మహిళల అసభ్యకర ఫొటోలు సృష్టిస్తూ వారి వ్యక్తిగత భద్రతను సైతం ఈ టెక్నాలజీ గాల్లో కలిపేస్తోంది.
ఈ వివక్ష, భయాల వల్లే జనరేటివ్ ఏఐ వాడకంలో మహిళలు మగవారి కంటే 25 శాతం వెనుకబడి ఉన్నారు. కానీ, ఈ గడ్డుకాలాన్ని దాటేందుకు రైటింగ్, సలహాల కోసం మహిళలు సైతం ఇప్పుడు ఏఐ టూల్స్ వాడటం పెంచారు. 2025 జూలై నాటికి ఈ టూల్స్ వాడకంలో మహిళలే మెజార్టీ సాధిస్తారని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
మనిషి మెదడుకు పదునుపెట్టే ఏఐ.. ఇప్పుడు ఆడవారి ఉనికికే ముప్పుగా మారడం వ్యవస్థలోని లోపానికి అద్దం పడుతోంది. "ఏదో ఒక టైపింగ్ జాబ్, క్లర్క్ జాబ్ వస్తే చాలు" అని సరిపెట్టుకునే రోజులు పోయాయి! రేపటి టెక్ ప్రపంచంలో ఆడపిల్లలు సర్వైవ్ అవ్వాలంటే.. కేవలం కంప్యూటర్ ఆపరేట్ చేయడం కాదు, ఆ టెక్నాలజీని శాసించే స్కిల్స్ (ఉదాహరణకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ డెవలప్‌మెంట్) నేర్చుకోవాలి. ఏఐ వాడకంలో మహిళల ప్రాతినిధ్యం పెరగడంతో పాటు, వారిని కాపాడే కఠిన చట్టాలను ప్రభుత్వాలు తక్షణమే తీసుకురాకపోతే, కార్పొరేట్ రంగంలో 'ఉమెన్ ఎంపవర్‌మెంట్' అనేది కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది.
Also Read:
యాపిల్ కొత్త సీఈవో జాన్ టెర్నస్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?ఐటీ ఉద్యోగులకు ఏఐ వార్నింగ్.. ఫ్రెషర్స్ జాబ్స్ ఇక గల్లంతేనా?
Meta AI Strategy: ఓపెన్ ఏఐకి జుకర్‌బర్గ్ షాక్
Artificial Intelligence | స్మార్ట్ఫోన్లలో విప్లవం: యాప్స్ స్థానంలో రాబోతున్న ఏఐ ఏజెంట్స్!
సోషల్ మీడియా యూజర్లకు బిగ్ షాక్: కేంద్రం కొత్త ఐటీ రూల్స్ ఇవే!

