ఒక ఆడపిల్ల తండ్రిగా కూతురి మెడలో పసిడి కట్నం వేయాలన్నది మీ ఎమోషన్ కావచ్చు.. కానీ అదే పసిడి కొనుగోళ్ల వల్ల దేశం నుంచి తరలిపోతున్న వేల కోట్ల డాలర్లను కాపాడుకోవడం ఈ దేశ పాలకుల బాధ్యత! తులం బంగారం ధర లక్షన్నర దాటిపోయి సామాన్యుడి నడ్డి విరుస్తున్నా.. అప్పులు చేసి మరీ కొంటున్న జనం ఒకవైపు. సరిగ్గా ఇదే సమయంలో 'ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయండి' అంటూ సికింద్రాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒకే ఒక్క విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు దేశంలో బంగారం బ్యాన్ కాబోతోందా? ఈ పుకార్ల వెనుక ఉన్న పచ్చి నిజమేంటి?
పసిడి మోహం.. లక్షన్నర దాటిన మంట!
భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే కేవలం ఒక అలంకారం కాదు, అదొక ఎమోషన్! ఇంట్లో పెళ్లి జరిగినా, ఏ చిన్న శుభకార్యం వచ్చినా ఒంటి నిండా నగలతో మురిసిపోవాలని ప్రతి ఆడబిడ్డ కలలు కంటుంది. కానీ, ఇప్పుడు దేశంలో పసిడి ధరల మంట చూస్తుంటే సామాన్యుడి మతిపోతోంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం ధర ఏకంగా రూ.1,53,000 మార్కును దాటేసి భయపెడుతోంది. ఈ రేట్లు చూసి బంగారం కొనాలంటేనే గుండెలు అదిరిపోతున్నా.. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసి మరీ జనం పసిడిని కొనుగోలు చేస్తున్నారు.
సికింద్రాబాద్ సాక్షిగా.. మోదీ సంచలన పిలుపు!
సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, పశ్చిమాసియాలో రగులుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశంలో వేగంగా మారుతున్న ఆర్థిక పరిణామాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంచలన ప్రకటన చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసం భారతీయులందరూ కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా ఆపివేయాలని లేదా బాగా తగ్గించుకోవాలని అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నప్పటికీ.. దేశం కోసం పసిడి త్యాగం చేయాలని ఆయన చేసిన సూచన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో కలకలం.. దేశంలో గోల్డ్ బ్యాన్?
ప్రధాని నోటివెంట ఈ మాట రాగానే.. ఇక భారతదేశంలో బంగారం పూర్తిగా బ్యాన్ (Gold Ban) అయిపోతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు దావానలంలా వ్యాపించాయి. అయితే, దీని వెనుక ఉన్న అసలు వాస్తవం వేరు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఎలాంటి అధికారిక నిషేధం విధించలేదు. ఇది కేవలం దేశ ఆర్థిక సుస్థిరత కోసం ప్రజలు స్వచ్ఛందంగా తీసుకురావాల్సిన మార్పు మాత్రమే అని, బలవంతపు బ్యాన్ కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కానీ, ఈ వార్తల దెబ్బకు స్టాక్ మార్కెట్‌లో జ్యువెలరీ సంస్థల షేర్లు మాత్రం పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
డిజిటల్ గోల్డ్ వైపు అడుగులు.. భవిష్యత్తులో ఆంక్షలు?
దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే విదేశాల నుంచి వచ్చే పసిడి దిగుమతులు తగ్గాల్సిందే. ఒకవేళ మోదీ విజ్ఞప్తి తర్వాత కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంగారం కొనుగోళ్లు తగ్గించకపోతే.. భవిష్యత్తులో ప్రభుత్వం దిగుమతి సుంకాలను (Import Duties) భారీగా పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు బలంగా హెచ్చరిస్తున్నారు. దానికి బదులుగా ఫిజికల్ గోల్డ్ కొనే అలవాటును మానుకుని, 'డిజిటల్ గోల్డ్' (Digital Gold) వంటి ప్రత్యామ్నాయాల వైపు ప్రజలను మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతానికి దేశంలో బంగారం కొనడం చట్టరిత్యా ఎలాంటి నేరం కాదు. కానీ భవిష్యత్తులో దిగుమతులపై మరిన్ని ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది.. అయితే పూర్తి నిషేధం అనేది ఆచరణలో దాదాపు సాధ్యం కాకపోవచ్చు.
మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో బంగారం కొనుక్కుంటే ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం అని మీకు కోపం రావచ్చు. కానీ, ఒక దేశంగా మనం కొనే ప్రతి గ్రాము పసిడి కోసం వేల కోట్ల రూపాయల విలువైన డాలర్లను విదేశాలకు ధారబోస్తున్నాం! లక్షన్నర పెట్టి ఒక అలంకారం కొనే బదులు, ఆ సొమ్మును పిల్లల భవిష్యత్తు కోసం లేదా దేశీయ మార్కెట్లో పెట్టుబడిగా పెడితే అది మీ కుటుంబానికీ, దేశానికీ రెండింటికీ లాభమే. పూర్తి గోల్డ్ బ్యాన్ అనేది జరగకపోవచ్చు.. కానీ మన అలవాట్లు మారకపోతే, రాబోయే రోజుల్లో బంగారం కొనాలంటే సామాన్యుడు సాహసం చేయాల్సిన పరిస్థితి రావడం ఖాయం!

