మీ ఊరిలో డిగ్రీలు, ఇంజనీరింగ్‌లు పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు రైళ్లు ఎక్కుతున్నారా? అయితే రాబోయే రెండేళ్లలో ఆ పరిస్థితి మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వెంబడి శరవేగంగా నిర్మితమవుతున్న మూడు భారీ పోర్టులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేయడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.
అభివృద్ధికి కొత్త గేట్‌వే.. గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు
రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి ట్రాక్‌లోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం.. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది.
ఈ మూడు పోర్టులను 2026 సంవత్సరాంతానికి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్&బీ శాఖల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు.
పోర్టుల నిర్మాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ శాఖ అనుమతుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఏ పోర్టు పనులు ఎక్కడిదాకా వచ్చాయి?
మూలపేట పోర్టుకు సంబంధించి పునరావాస (R&R) పనులను వేగవంతం చేస్తే డ్రెడ్జింగ్ పనులకు లైన్ క్లియర్ అవుతుందని మంత్రి సూచించారు. అక్కడున్న ఉప్పు భూముల సమస్యను వెంటనే పరిష్కరించి, పోర్టుకు రోడ్డు, రైల్వే లైన్ అనుసంధానాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మచిలీపట్నం పోర్టు విషయానికొస్తే.. బ్రేక్‌వాటర్, డ్రెడ్జింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భవిష్యత్తు వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పోర్టుకు రైల్వే లైన్, విద్యుత్, మంచినీటి వసతి లాంటి మౌలిక సదుపాయాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
ఇక రామాయపట్నం పోర్టులో పునరావాస కార్యక్రమాలు, డ్రెడ్జింగ్ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే కొలిక్కి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు.
విస్తారమైన సముద్ర తీరం ఏపీకి దొరికిన అతిపెద్ద వరం. ఈ మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి విదేశీ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడతాయి. దీనివల్ల పరోక్షంగా లక్షలాది స్కిల్డ్, అన్-స్కిల్డ్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ప్లాన్ చేసినట్లుగానే ఈ ప్రాజెక్టులను టైమ్ లైన్‌లో పూర్తి చేయగలిగితే, 2026 తర్వాత ఏపీ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరమే రాదు!

