లక్షలాది మంది యువత కలల గమ్యస్థానం.. సాఫ్ట్‌వేర్ రంగం. లక్షల ప్యాకేజీలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లతో వెలిగిపోతున్న ఈ ఐటీ సామ్రాజ్యం పునాదులు ఇప్పుడు కదులుతున్నాయా? అవుననే అంటున్నాయి టెక్ ప్రపంచంలో వినిపిస్తున్న తాజా హెచ్చరికలు. మీరు గంటల తరబడి కష్టపడి రాసే కోడింగ్‌ను, రేపు పొద్దున ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం ఉచితంగా చేసిపెడితే మీ ఉద్యోగం పరిస్థితి ఏంటి? సామాన్య ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ పచ్చి నిజాన్ని, ప్రఖ్యాత ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' (Anthropic) సీఈఓ డారియో అమోడీ ప్రపంచం ముందు కుండబద్దలు కొట్టారు.
సాఫ్ట్‌వేర్ ధర సున్నా.. వాడిపారేసే యాప్‌ల శకం
దావోస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల్లో వాల్ స్ట్రీట్ జర్నల్‌తో అమోడీ పంచుకున్న విషయాలు ఐటీ రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ తయారీ ఖర్చు 'దాదాపు సున్నా'కి పడిపోతుందని, అది చాలా చవకగా లేదా పూర్తిగా ఉచితంగా మారబోతోందని ఆయన హెచ్చరించారు.
లక్షలాది మంది కోసం ఒకే సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసే పాత విధానం కనుమరుగవుతుందన్నారు. ఉదాహరణకు, కేవలం ఒక మీటింగ్ కోసం కొన్ని సెంట్లు ఖర్చు చేసి ఒక యాప్ సృష్టించడం, మీటింగ్ అయిపోగానే దాన్ని పారేయడం లాంటి 'డిస్పోజబుల్ అప్లికేషన్స్' ట్రెండ్ రాబోతోందని స్పష్టం చేశారు. ఇది వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతంగా మారనుందని ఆయన అంచనా వేశారు.
కోడింగ్ కెరీర్‌లకు భారీ ముప్పు
2026 ప్రారంభంలోనే ఏఐ వల్ల వైట్ కాలర్ (ఎంట్రీ లెవల్) ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని అమోడీ పలు వేదికలపై హెచ్చరించారు. ఇప్పుడు ఆయన దృష్టి నేరుగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లపై పడింది. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి నిర్మించుకున్న కెరీర్లు, ఐటీ ఉద్యోగాలు ఈ ఏఐ ఉప్పెనలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో వచ్చిన ఏ సాంకేతికతతో పోల్చినా ఏఐ ఉత్పాదకత ఊహించని వేగంతో పెరుగుతోందని ఆయన అన్నారు. మారుతున్న టెక్నాలజీకి సమాజం అలవాటు పడుతుందని తాను విశ్వసిస్తున్నా.. అసలు రాబోయే మార్పు పరిమాణం, దాని తీవ్రతపై ప్రపంచానికి ఇంకా పూర్తి అవగాహన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్లలో ముందే మొదలైన భూకంపం
అమోడీ చెబుతున్న మాటలు కేవలం గాలి మాటలు కాదనడానికి స్టాక్ మార్కెట్లే సజీవ సాక్ష్యం. ఐటీ సేవల దిగ్గజాల షేర్లు ఇప్పటికే భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి సర్వీస్‌నౌ (ServiceNow) షేర్లు 39 శాతం, స్నోఫ్లేక్ 35 శాతం, థామ్సన్ రాయిటర్స్ 28 శాతం మేర నష్టపోయాయి. అత్యధునాతన కోపైలట్‌ను (Copilot) అందిస్తున్న మైక్రోసాఫ్ట్ సైతం జనవరి నుంచి 15 శాతం పతనాన్ని నమోదు చేయడం సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న పెను మార్పులకు అద్దం పడుతోంది.
మనుషుల స్థానంలోకి 'క్లాడ్' టెక్నాలజీ
కోడింగ్ ఉద్యోగాలకు ముప్పు తెస్తున్న ఆంథ్రోపిక్ సంస్థ మార్కెట్ విలువ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. వార్షిక ఆదాయం 40 బిలియన్ డాలర్లకు పైగా ఉండగా, 900 బిలియన్ డాలర్ల రికార్డు అంచనాతో ఆ సంస్థ ప్రైవేట్ ఫండింగ్ రౌండ్‌ను ముగించేందుకు సిద్ధమవుతోంది. ఆంథ్రోపిక్ తయారు చేసిన 'క్లాడ్' (Claude) ఏఐ మోడల్‌ను ఇన్వెస్టర్లు కేవలం ఒక టూల్‌గా చూడటం లేదు.. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాల భారాన్ని తప్పించే ఒక శాశ్వత ప్రత్యామ్నాయంగా చూస్తుండటమే ఈ భారీ వృద్ధికి కారణం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ట్రెండ్ కాదు.. అది మన జీవనశైలిని, వృత్తులను సమూలంగా మార్చేయబోతున్న ఒక సునామీ. "కోడింగ్ నేర్చుకుంటే లక్షల జీతం గ్యారెంటీ" అనే పాత భ్రమల నుంచి నేటి ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తక్షణమే బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్తులో కేవలం సింటాక్స్ తెలిసిన కోడర్లకు ఉద్యోగాలు ఉండవు, ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగల 'క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్'కు మాత్రమే ఐటీ రంగంలో మనుగడ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ (Upskill) నేర్చుకోవడమే ఈ ఏఐ విప్లవం నుంచి మన కెరీర్‌ను కాపాడుకునే ఏకైక ఆయుధం!

