ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును మించిన సుప్రీం పవర్ లేదు. కానీ, ఆ తీర్పునే ధిక్కరించి, 'నేను కుర్చీ దిగను' అని ఒక ముఖ్యమంత్రి భీష్మించుకు కూర్చుంటే ఆ రాష్ట్ర పరిస్థితి ఏంటి? రాజ్యాంగం ఏం చేస్తుంది? పశ్చిమ బెంగాల్‌లో సరిగ్గా ఇదే హైడ్రామా నడిచింది. 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించకపోవడం, చివరకు గవర్నర్ తన రాజ్యాంగ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంతో.. బెంగాల్ రాజకీయాల్లో కనీవినీ ఎరుగని ఉత్కంఠకు తెరపడింది.
నేను ఓడిపోలేదు.. 100 సీట్లు లూటీ చేశారు!
మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 206 సీట్లలో ఘన విజయం సాధించగా, మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ కేవలం 80 స్థానాలకే దారుణంగా పడిపోయింది. అయినా సరే దీదీ తన ఓటమిని ఏమాత్రం అంగీకరించలేదు. "ఇది ప్రజల తీర్పు కాదు, ఇదొక పెద్ద కుట్ర" అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్, బీజేపీ కుమ్మక్కై ఏకంగా 100 సీట్లను అక్రమంగా లూటీ చేశాయని మండిపడ్డారు. "నేను ఎన్నికల్లో ఓడిపోలేదు.. అలాంటప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి? ప్రజల తీర్పును లూటీ చేసినప్పుడు రాజీనామా చేసే ప్రశ్నే తలెత్తదు" అంటూ ముఖ్యమంత్రి కుర్చీ దిగేందుకు ససేమిరా అన్నారు.
ఆర్టికల్ 174 (2)(బి).. దీదీకి గవర్నర్ చెక్!
సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో రాష్ట్రంలో భయంకరమైన రాజ్యాంగ సంక్షోభం, అనిశ్చితి నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజ్యాంగ అధికారాలైన ఆర్టికల్ 174(2)(బి) ని కఠినంగా అమలు చేస్తూ, గురువారం అసెంబ్లీని అధికారికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మే 7వ తేదీ నుంచి ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో దీదీ ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా ముగింపు పడింది.
మాజీ అనుచరుడే సీఎం.. భవానీపూర్, నందిగ్రామ్ రికార్డు!
గవర్నర్ అసెంబ్లీ రద్దు చేసిన నేపథ్యంలో, తృణమూల్ కంచుకోటను బద్దలు కొట్టిన బీజేపీ.. బెంగాల్‌లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సరికొత్త అధ్యాయం లిఖించింది. మమతా బెనర్జీ వద్ద ఒకప్పుడు ప్రధాన అనుచరుడిగా ఉన్న సువేందు అధికారి.. శనివారం బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో భవానీపూర్ స్థానం నుంచి స్వయంగా మమతా బెనర్జీనే సువేందు అధికారి ఓడించడం గమనార్హం. అంతేకాదు, గత 2011 ఎన్నికల్లోనూ నందిగ్రామ్‌లో మమతాపై సువేందు ఇదే తరహాలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈగో ట్యాగ్.. 'మాజీ సీఎం' అనలేక బయో మార్పు!
ఒకవైపు బెంగాల్‌లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగానే.. అటు మమతా బెనర్జీ కూడా పరోక్షంగా తన ఓటమిని అంగీకరిస్తూ దిగిరాక తప్పలేదు. అయితే తన అహంకారం దెబ్బతినకుండా ఉండేందుకు, సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) లో తన బయోను అత్యంత తెలివిగా మార్చుకున్నారు. అంతకుముందున్న 'పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి' అనే పదాలను తొలగించి.. 'తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం (15, 16, 17వ అసెంబ్లీ)' అని కొత్తగా రాసుకున్నారు. ఎక్కడా కూడా 'మాజీ ముఖ్యమంత్రి' (Former CM) అనే పదాన్ని వాడకపోవడం ఆమె పంతానికి నిదర్శనంగా మారింది.
ఒక నాయకుడు ఎన్నికల్లో గెలిచినప్పుడు ప్రజల తీర్పును ఎంత గర్వంగా స్వీకరిస్తాడో, ఓడినప్పుడు కూడా అంతే హుందాగా తప్పుకోవాలి. తాను ఓడిపోయినా కుర్చీ దిగనని మంకుపట్టు పట్టడం అంటే.. గంటల తరబడి ఎండలో నిలబడి ఓటేసిన సామాన్యుడిని ప్రత్యక్షంగా అవమానించడమే! అయితే, నాయకులు ఎంత మొండికేసినా భారత రాజ్యాంగంలోని వ్యవస్థలు ఎంత శక్తివంతంగా పనిచేస్తాయో ఈ ఎపిసోడ్ నిరూపించింది. రాజ్యాంగం ముందు ఏ నాయకుడూ శాశ్వతం కాదు, ఓటరు తీర్పే ఎప్పటికీ సుప్రీం పవర్ అని ప్రతి పౌరుడూ గర్వించాల్సిన చారిత్రక సందర్భం ఇది!
Also Read:
Tamil Nadu Politics : సీఎం కుర్చీ వెనుక స్టాలిన్ మాస్టర్ మైండ్!బెంగాల్ సీఎంగా సువేందు: 30 లక్షల ఓట్లు గల్లంతు చేశారన్న అభిషేక్ బెనర్జీ!
దళపతికి కొత్త టెన్షన్: గవర్నర్ భేటీలో సినీ నిర్మాత ఎంట్రీ వెనుక మతలబు ఏంటి?
దశాబ్దాల కమ్యూనిస్టు, దీదీ కోట బద్దలు.. బెంగాల్ సీఎంగా సువేందు అట్టహాసంగా ప్రమాణం!
తమిళనాట రిసార్ట్ పాలిటిక్స్: 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు

