వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి కాదు.. ఐటీ కంపెనీలకు కేంద్రం క్లారిటీ!

naveen
By -
వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి కాదు.. ఐటీ కంపెనీలకు కేంద్రం క్లారిటీ!


"వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్లీ వచ్చేసిందా? సాఫ్ట్‌వేర్ ఆఫీసులు మూతపడబోతున్నాయా?" ప్రధాని మోదీ ఇంధన పొదుపుపై చేసిన ఒక్క వ్యాఖ్య.. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఎన్నో ఊహాగానాలకు తెరతీసింది. కానీ, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజం మీ జేబుకు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అతిపెద్ద ఆర్థిక సవాల్ అని మీకు తెలుసా?


ఐటీ కంపెనీలకు ఆ ఆదేశాలు.. కేవలం పుకార్లే!


ప్రధాని మోదీ ఇటీవల ఇంధన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని చేసిన విజ్ఞప్తిని కొందరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. దేశంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు తప్పనిసరిగా 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) ఇవ్వాలని కేంద్రం ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు దావానలంలా వ్యాపించాయి.


అయితే, ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు అత్యవసరంగా స్పందించాయి. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఆదేశాలు జారీ చేయలేదని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని అధికారులు కుండబద్దలు కొట్టారు.


మోదీ అసలు టార్గెట్.. పాతాళానికి పడిపోతున్న ఖజానా!


ప్రధాని ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. దేశ ఆర్థిక మూలాలను కాపాడటం. మనం వాడే ముడి చమురు (క్రూడ్ ఆయిల్)లో సింహభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు భగ్గుమంటున్న వేళ, ఆ దిగుమతుల భారం దేశ ఖజానాపై పెను ప్రభావాన్ని చూపుతోంది.


ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా విదేశీ మారక నిల్వలపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించవచ్చన్నది ప్రభుత్వ అసలు వ్యూహం. ఇది కేవలం ఇంధనానికే పరిమితం కాదు.. నీరు, విద్యుత్ లాంటి అమూల్యమైన వనరులను కూడా బాధ్యతాయుతంగా వాడుకోవాలని ఆయన ఎప్పటికప్పడు పర్యావరణ పరిరక్షణ పాఠాలు చెబుతూనే ఉన్నారు.


ఒత్తిడి లేదు.. ఇది మన దేశం కోసం వదిలిన బాణం!


ఇది ప్రజల మీద రుద్దిన కఠినమైన నిబంధన కాదు, ఏ ఒక్కరిపైనా ఎలాంటి ఒత్తిడీ లేదు. ప్రతి పౌరుడూ స్వచ్ఛందంగా ఈ పొదుపు చర్యల్లో భాగస్వామ్యం కావాలని మాత్రమే కేంద్రం పిలుపునిచ్చింది. వనరులను సమర్థవంతంగా వాడుకుంటేనే దేశం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేసింది.


ప్రస్తుత భయంకరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో.. కేవలం సాఫ్ట్‌వేర్ రంగమే కాదు, అన్ని రంగాల ప్రజలు ఇలాంటి పొదుపు చర్యలు పాటించడం తక్షణ అవసరమని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో రాబోయే ఆర్థిక మాంద్యానికి ఒక ముందస్తు రక్షణ కవచం లాంటిది.


"ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు కదా, నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను" అనుకుంటే అంతిమంగా నష్టపోయేది సామాన్యుడే. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే, ఆ భారం రేపు మీ బైక్‌లో పోసే పెట్రోల్ మీదే పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగి వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కాబట్టి, మోదీ పిలుపును ఒక నిబంధనలా కాకుండా.. మన జేబును, దేశాన్ని ద్రవ్యోల్బణం బారి నుంచి కాపాడుకునే 'ప్రాక్టికల్ అడ్వైజ్'గా తీసుకుంటేనే మనందరికీ శ్రీరామరక్ష!


Tags: