Santiago Martin Family : 3 పార్టీలు.. 3 విజయాలు

naveen
By -
Santiago Martin Family


మనం పార్టీల జెండాలు పట్టుకుని వీధుల్లో కొట్టుకుంటుంటే.. కోట్లున్న ఒకే కుటుంబం మూడు వేర్వేరు పార్టీల నుంచి బరిలోకి దిగి అసెంబ్లీని శాసిస్తే ఎలా ఉంటుంది? దశాబ్దాలుగా రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకున్న ఉద్దండులైన నాయకులకు సైతం చెమటలు పట్టిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్ కుటుంబం ఇప్పుడు తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో ఆడిన మైండ్ గేమ్ ప్రతి సామాన్యుడిని ఉలిక్కిపడేలా చేస్తోంది!


పార్టీలు వేరు.. కుటుంబం ఒక్కటే!


తమిళనాడులోని లాల్గుడి నుంచి ఏఐఏడీఎంకే (AIADMK) అభ్యర్థిగా లీమారోస్ మార్టిన్.. విక్కివాక్కం నుంచి టీవీకే (TVK) అభ్యర్థిగా ఆదవ్ అర్జున.. ఇక పుదుచ్చేరిలోని కామరాజ్ నగర్ నుంచి ఎల్జేకే (LJK) పార్టీ అభ్యర్థిగా జోస్ చార్లెస్ మార్టిన్. ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉన్న అతిపెద్ద కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీరంతా 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాదు, వీరు ముగ్గురూ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యులే కావడం! అవును.. భార్య, కొడుకు, అల్లుడు.. ఇలా ముగ్గురూ మూడు వేర్వేరు, ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలోకి దిగి మరీ తమ స్థానాల్లో విజయఢంకా మోగించారు.


20 ఏళ్ల డీఎంకే కంచుకోట బద్దలు


లాటరీ కింగ్ సతీమణి లీమారోస్ మార్టిన్ లాల్గుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఊహించని సంచలనం సృష్టించారు. విజయ్ కు చెందిన టీవీకే అభ్యర్థి కు.పా.కృష్ణన్‌పై ఆమె 2,500కు పైగా (2,739) ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజానికి లాల్గుడి అనేది డీఎంకే పార్టీకి కంచుకోట. 2006, 2011, 2016, 2021.. ఇలా వరుసగా రెండు దశాబ్దాలుగా ఆ పార్టీనే గెలుస్తోంది. కానీ, ఈసారి డీఎంకే అభ్యర్థి పారివళ్లల్ ఏకంగా 5,230 ఓట్ల భారీ తేడాతో లీమారోస్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఐజేకే (IJK) పార్టీలో 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఆమె.. ఇటీవలే ఏఐఏడీఎంకేలో చేరారు. ఆమె రాకను స్వాగతించిన ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS).. ఏకంగా ఆమెను పార్టీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా నియమించడం గమనార్హం.


దళపతి పార్టీలో అల్లుడి దర్బార్


మార్టిన్ కుటుంబం నుంచి తమిళనాడులో వెలువడిన రెండో అతిపెద్ద విజయం ఆయన అల్లుడిదే. దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన అల్లుడు ఆదవ్ అర్జున.. విక్కివాక్కం స్థానం నుంచి ఏకంగా 17 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ పాతుకుపోయిన డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌పై 17,302 ఓట్ల తేడాతో.. అలాగే ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్.ఆర్. విజయకుమార్‌పై 47,107 ఓట్ల భారీ తేడాతో అర్జున ఘన విజయం సాధించి విపక్షాలను బెంబేలెత్తించారు.


పుదుచ్చేరిలో సొంత పార్టీతో కొడుకు పాగా


తమిళనాడులో అల్లుడు, భార్య సత్తా చాటితే.. పొరుగున ఉన్న పుదుచ్చేరిలో లాటరీ కింగ్ కొడుకు జోస్ చార్లెస్ మార్టిన్ తన సొంత పార్టీతో సంచలనం సృష్టించారు. 'లక్ష్య జననాయగ కట్చి' (LJK) పేరుతో తన సొంత పార్టీ నుంచి కామరాజ్ నగర్ బరిలో దిగిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి పీకే దేవదాస్, టీవీకే అభ్యర్థి సుమన్‌లను వెనక్కినెట్టి 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


ఫిబ్రవరిలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో జూనియర్ మార్టిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో బీజేపీలో ఉన్న ఆయన.. సీట్ల కేటాయింపులో జాప్యం వల్లే బయటకు వచ్చానని, అయితే ప్రధాని మోదీ దార్శనికత, మేక్ ఇన్ ఇండియా పట్ల తనకు ఇంకా అపారమైన ఆరాధన ఉందని కుండబద్దలు కొట్టారు. పుదుచ్చేరిలో ఆయనొక 'లోకల్ కాని వ్యక్తి' (ఔట్‌సైడర్) అన్న విమర్శలను సైతం ఆయన గట్టిగా తిప్పికొట్టారు. తాను పూర్తిగా ఇక్కడికే మకాం మార్చానని, సింగపూర్, హాంకాంగ్ తరహాలో పుదుచ్చేరిని అభివృద్ధి చేయడమే తన అంతిమ లక్ష్యమని వివరించారు.


తమిళనాడు, పుదుచ్చేరి రాజకీయాలను మొత్తంగా తమ కుటుంబం శాసించాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. "నా విజన్ వేరు.. ప్రజల జీవితాలను మార్చాలనుకుంటున్నాను. పుదుచ్చేరి ప్రజలు నన్ను గుడ్డిగా నమ్మొచ్చు" అంటూ ఆయన ముగించారు.


సామాన్యులు భావోద్వేగాలతో ఓట్లు వేస్తుంటే.. సంపన్నులు మాత్రం తమ వ్యూహాలతో రాజకీయ పార్టీలకే పెట్టుబడులు పెడుతున్నారు. ఒకే ఇంట్లో మూడు పార్టీల జెండాలు ఎగరడం కేవలం యాదృచ్ఛికం కాదు, ఇదొక పక్కా 'పాలిటికల్ హెడ్జింగ్'! ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ప్రతిపక్షంలో కూర్చున్నా ఆ కుటుంబానికి ఎలాంటి నష్టం లేదు. ఈ సరికొత్త రాజకీయ చదరంగం ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో సామాన్యుడు గ్రహించకపోతే.. భవిష్యత్తులో మన ఓటు హక్కు కేవలం ఒక లాటరీ టికెట్‌లా మారిపోవడం ఖాయం!



Tags: