మనం కట్టే పన్నుల డబ్బులు మత పెద్దలకు జీతాలుగా వెళ్లాలా.. లేక పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే చదువుకు ఉపయోగపడాలా? దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలతో నలిగిపోతున్న సగటు మనిషికి ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న ఇది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వేదికగా ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయంతో సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన మతపరమైన పథకాలకు శాశ్వతంగా చెక్ పెడుతూ సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
మత పెద్దల భృతి రద్దు.. విద్యార్థుల వైపు నిధుల మళ్లింపు
మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు ఓటు బ్యాంకు లక్ష్యంగా తీసుకొచ్చిన మతపరమైన పథకాలన్నింటినీ జూన్ నెల నుంచి నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం తీర్మానించింది. ఈ పథకాల కింద ఆలయాల్లో పూజారులకు, మసీదుల్లోని ఇమామ్‌లకు ప్రతి నెలా ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థిక సాయం అందేది. వాస్తవానికి మొదట్లో ఈ సాయం వెయ్యి రూపాయలు కాగా, ఎన్నికల ముందు దానిని రెండు వేలకు పెంచారు. ఇప్పుడు ఆ నిధులన్నింటినీ 'వివేకానంద మెరిటోరియస్ స్కాలర్‌షిప్'కు మళ్లించాలని సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయించింది.
చదువుకు మతం లేదు.. ప్రతిభే గీటురాయి
ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని సువేందు అధికారి మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం మత పెద్దలకు భృతి చెల్లించడంపై దృష్టి పెట్టాలా, లేక యువత విద్యపై దృష్టి పెట్టాలా అని బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఈ నిధులను హిందువు, ముస్లిం, సిక్కు, జైనుడు లేదా ఫలానా రాజకీయ పార్టీ మద్దతుదారుడు అనే ఎలాంటి వివక్ష లేకుండా అందిస్తారు. కేవలం ప్రతిభ ఆధారంగానే పేద విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు అందుతాయి. పరిపాలనలో ఇకపై ఎలాంటి బుజ్జగింపు రాజకీయాలకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు.
మహిళా పథకాల కొనసాగింపు.. దశలవారీగా రద్దు
ఒకవైపు మతపరమైన పథకాలను రద్దు చేస్తూనే, మరోవైపు సామాన్యులకు నేరుగా ఉపయోగపడే మహిళా ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మదర్సా సమాచార, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న మత ఆధారిత సహాయ పథకాలను ఈ నెలాఖరుకల్లా దశలవారీగా అధికారికంగా నిలిపివేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో 2012లో ఇమామ్ అలవెన్స్‌ను, కోవిడ్ సమయంలో 2020 సెప్టెంబర్‌లో హిందూ పూజారుల అలవెన్స్‌ను ప్రారంభించారు. వీటన్నింటికీ ఇప్పుడు బ్రేక్ పడింది.
ఓబీసీ జాబితా రద్దు.. హైకోర్టు తీర్పు అమలు
మతపరమైన భృతుల రద్దుతో పాటు బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇతర వెనుకబడిన వర్గాల (OBC) జాబితా రద్దు. 2010 నుంచి 2024 మధ్య కాలంలో ఓబీసీ కేటగిరీలో కొత్తగా చేర్చిన వర్గాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. గతంలో చేర్చిన ఈ జాబితాలో అత్యధిక సంఖ్యలో ముస్లిం వర్గానికి చెందినవారే ఉన్నారు. అయితే, ఈ జాబితా రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధమని 2024లోనే కలకత్తా హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకే ఈ జాబితాను రద్దు చేస్తూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఖజానా అనేది సామాన్యుడు రక్తం చిందించి కట్టిన పన్నుల రూపం. అది విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు కావాలి కానీ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మతపరమైన బుజ్జగింపుల కోసం వెచ్చించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. మతపెద్దల భృతిని రద్దు చేసి ఆ కోట్ల రూపాయల నిధులను పేద విద్యార్థుల చదువుకు మళ్లించడం ద్వారా బెంగాల్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగితే, కులమతాలకు అతీతంగా ప్రతిభ గల సామాన్య యువతకు అద్భుతమైన భవిష్యత్తు దక్కుతుంది!
Also Read:
Kerala CM Oath: వేదికపై సామాన్య వృద్ధురాలిని హత్తుకున్న సతీశన్కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్: పదేళ్ల తర్వాత కాంగ్రెస్ దర్బార్!
గ్లోబల్ లీడర్‌గా భారత్: మోదీ స్వీడన్ పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం!
PM Modi Speech : నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ సంచలనం!
Operation Sindoor: పాక్ కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

