రాజకీయం అంటేనే స్వార్థం, పదవులు, కుట్రలు అనుకునే సగటు మనిషికి.. మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి కేరళ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార వేదిక ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఒక సామాన్య అనాథ వృద్ధురాలిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నతల్లిలా హత్తుకున్న ఈ అద్భుత ఘట్టం.. ప్రతి నాయకుడికి, ప్రతి పౌరుడికి ఒక చెంపపెట్టు లాంటి గుణపాఠం!
ప్రోటోకాల్‌ను బద్దలు కొట్టిన మాతృప్రేమ
కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్, మరో 20 మంది మంత్రులతో అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేస్తున్న వేదిక అది. కాంగ్రెస్ అగ్రనేతలు, ఉద్దండులైన నాయకులు ఆశీనులైన ఆ సభావేదికపైకి ఎలాంటి ప్రోటోకాల్ అడ్డంకులు లేకుండా ఒక సాధారణ వృద్ధురాలు నడుచుకుంటూ వచ్చారు. ఆవిడను చూడగానే సీఎం సతీశన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పాదాభివందనం చేశారు. ఆ తతంగాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
రాహుల్ గాంధీని సైతం కదిలించిన అమ్మాళ్!
ఆ వృద్ధురాలి పేరు సీతాలక్ష్మీ అమ్మాళ్. సతీశన్ తన మాతృమూర్తిగా భావించే ఆవిడను ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు స్వయంగా పరిచయం చేశారు. ఆమె స్వచ్ఛమైన ప్రేమను చూసి చలించిపోయిన రాహుల్ సైతం ఆమెను ఆప్యాయంగా హత్తుకోవడం అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది. అసలు ముఖ్యమంత్రికి, ఈ సాధారణ మహిళకు మధ్య ఉన్న అనుబంధం ఏంటని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
2018 నాటి వరదల్లో చిగురించిన బంధం
2018లో కేరళను కుదిపేసిన ప్రళయకర వరదల్లో సీతాలక్ష్మీ అమ్మాళ్ తన ఇల్లు సహా సర్వస్వాన్ని కోల్పోయింది. అప్పట్లో సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్న సతీశన్.. పరవూర్‌లోని ఒక పునరావాస కేంద్రంలో ఆమెను మొదటిసారి కలిశారు. "నేను బతికున్నంత కాలం ఏ విషయానికీ భయపడొద్దు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు అన్నీ నేను చూసుకుంటాను" అని ఆనాడు ఆమెకు మాట ఇచ్చారు. ఆ మాటకే కట్టుబడి తరచూ ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ వచ్చారు.
కొడుకు సీఎం కావాలని..
"సతీశన్ నాకు కొడుకు లాంటివాడు కాదు.. నా సొంత కొడుకే! ఎన్నికల ప్రచార సమయంలోనే దేవుడిపై భారం వేసి ధైర్యంగా ముందుకు సాగమని, కచ్చితంగా ముఖ్యమంత్రివి అవుతావని ఆశీర్వదించాను" అని అమ్మాళ్ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రమాణస్వీకారం రోజున తన బిడ్డను మనసారా హత్తుకుని ఆశీర్వదించాలనే ఒకే ఒక్క కోరికతో పరవూర్ నుంచి సుదూరంగా ఉన్న రాజధాని వరకు ఆమె ప్రయాణించారు. ఏకంగా సీఎంగా మారిన తన 'కొడుకు' స్వయంగా ఆమెను వేదికపైకి తీసుకెళ్లడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నాయకుడంటే ఎన్నికలప్పుడు ఓట్లు అడిగేవాడు కాదు.. ఆపదలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకునేవాడు! వరదల్లో ఆదుకున్న ఒక సామాన్య మహిళను, ఏకంగా సీఎం సీట్లో కూర్చున్న తర్వాత కూడా గుర్తుపెట్టుకుని వేదికపైకి పిలిపించుకోవడం నిజమైన లీడర్‌షిప్‌కు నిదర్శనం. ప్రజల గుండెల్లో ఇలాంటి చెరగని ముద్ర వేసుకున్న నాయకులకు అధికార పీఠాలు వాటంతట అవే దాసోహమౌతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు!
Also Read:
కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్: పదేళ్ల తర్వాత కాంగ్రెస్ దర్బార్!గ్లోబల్ లీడర్‌గా భారత్: మోదీ స్వీడన్ పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం!
PM Modi Speech : నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ సంచలనం!
Operation Sindoor: పాక్ కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
Karnataka CM Race : కర్ణాటక పీఠంపై డీకే శివకుమార్ ఫ్లెక్సీల రచ్చ!

