కేరళ రాజకీయ గందరగోళానికి కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది. కానీ, ఒకచోట మంట ఆరిందో లేదో.. పొరుగు రాష్ట్రంలో అధికార కుర్చీలాట మళ్లీ మొదటికొచ్చింది! తీవ్ర లాబీయింగ్‌లు, అంతర్గత ఒత్తిళ్ల మధ్య తల ప్రాణం తోకకి వచ్చినంత పనై.. ఎట్టకేలకు వీడీ సతీశన్‌ను కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అయితే, కేరళ పంచాయితీ ముగిసిందో లేదో.. ఇప్పుడు కర్ణాటక పీఠంపై నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా బద్దలైంది!
ముగిసిన కేరళ పంచాయితీ.. మొదలైన కర్ణాటక వార్!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎప్పటి నుంచో సాగుతున్న అధికార సమరం ఇప్పుడు సరికొత్త క్లైమాక్స్‌కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి పీసీసీ అధ్యక్షుడిగా అహర్నిశలు శ్రమించిన డీకే శివకుమార్.. ఆనాటి నుంచే సీఎం కుర్చీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
కానీ అధిష్టానం మాత్రం సీనియారిటీకి జై కొడుతూ సిద్ధరామయ్యకు పట్టం కట్టింది. అయినప్పటికీ డీకే శివకుమార్‌లో ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు ఏమాత్రం చావలేదు. గతేడాది కాలంగా ఈ ఇద్దరు మహానాయకుల మధ్య తీవ్రమైన అంతర్గత పోరు నడుస్తూనే ఉంది.
ఢిల్లీ మంతనాలు.. బెంగళూరు ఫ్లెక్సీల కలకలం!
ఈ పీఠం ముడిని విప్పేందుకు హస్తిన వేదికగా ఎన్నో రహస్య మంతనాలు జరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో ఇరు వర్గాల మధ్య సయోధ్య కోసం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఏ శక్తీ ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న పంతాన్ని తగ్గించలేకపోయింది.
కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న ఈ కుర్చీలాట.. మే 15న డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా బెంగళూరు వీధుల్లో ఒక్కసారిగా రచ్చకెక్కింది. నగరం నడిబొడ్డున "కాబోయే ముఖ్యమంత్రి", "నెక్స్ట్ సీఎం" అంటూ డీకే శివకుమార్ భారీ కటౌట్లు, ప్లెక్సీలు వెలియడంతో కర్ణాటక పాలిటిక్స్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి.
కేరళ ఫార్ములా.. డీకే వర్గానికి కొత్త జోష్!
ఇటీవల కేరళ సీఎం ఎంపిక ప్రక్రియను అధిష్టానం చాకచక్యంగా ముగించడంతో.. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గీయులు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితిలోనే డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలంటూ వారు హైకమాండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.
ఇది కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సరికొత్త తలనొప్పిగా మారింది. రెండు వర్గాలు పట్టువీడకుండా పోరాడుతుండటంతో, ఈ వ్యవహారాన్ని ఎక్కువ కాలం వాయిదా వేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిద్ధరామయ్య ప్రతివ్యూహం.. కేబినెట్ అస్త్రం!
ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ, తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధరామయ్య తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
ఒకవేళ కేబినెట్ విస్తరణ గనుక జరిగితే, అది డీకే శివకుమార్ సీఎం ఆశలపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది. సిద్ధరామయ్య ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై తన పట్టును మరింత బిగిస్తే.. నాయకత్వ మార్పు అనే ప్రసక్తే ఉండదని ఆయన వర్గం భావిస్తోంది.
హైకమాండ్‌కు అగ్నిపరీక్ష.. విశ్లేషకుల హెచ్చరిక!
రాబోయే రోజుల్లో కర్ణాటకలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం స్థిరంగా కొనసాగడం, మరోవైపు అంతర్గత విభేదాలు రచ్చకెక్కకుండా చూడడం అధిష్టానానికి ఒక మహా సవాల్‌గా మారింది.
సిద్ధరామయ్యను సీఎం కుర్చీలో కొనసాగించాలా? లేక డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలా? అనే అంశంపై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒక వర్గం నుంచి తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందంగా మారిన కర్ణాటక రాజకీయం.. ఏ క్షణమైనా భగ్గుమనేలా ఉంది; హైకమాండ్ తీసుకునే తదుపరి నిర్ణయమే ఈ ఇద్దరు దిగ్గజాల భవిష్యత్తును శాసించబోతోంది!

