Petrol Price Hike : సామాన్యుడిపై పెట్రో బాదుడు!

naveen
By -

Petrol Price Hike


ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో పశ్చిమాసియాలో పడుతున్న బాంబుల శబ్దం.. నేరుగా సామాన్యుడి జేబును పేల్చేయబోతోంది. నిన్నగాక మొన్న మే 15న పెరిగిన మూడు రూపాయల వాత కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ పెట్రో మంట మన వంటగదిని, మన బడ్జెట్‌ను ఎలా దహించివేయబోతోందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!


అగ్నిగుండంగా పశ్చిమాసియా.. వణుకుతున్న ప్రపంచం


ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఈ దేశాల ఆధిపత్య పోరు ఇప్పుడు ప్రపంచానికి శాపంగా మారింది. పశ్చిమాసియాలో నెలకొన్న భయంకరమైన ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్, పెట్రోల్ ధరలపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి 'హార్మూజ్ జలసంధి'లో ఎప్పుడేం జరుగుతుందోనని, సరఫరా ఎక్కడ నిలిచిపోతుందోనని ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. ఈ భయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్‌కు 110 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఇంధన ధరల కుండ బద్దలైంది.


సామాన్యుడిపై రూ.10 వాత.. దిగ్భ్రాంతికరమైన నిజాలు!


భారతదేశంలో దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 మేర పెంచారు. ఎగబాకుతున్న ముడి చమురు ధరలతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) తీవ్ర నష్టాల్లో కూరుకుపోతుండటమే ఈ పెంపునకు కారణం. కానీ, ఈ మూడు రూపాయల పెంపు చమురు కంపెనీల దాహాన్ని ఏమాత్రం తీర్చలేదని, ఇది పూర్తిస్థాయి పరిష్కారం కాదని మార్కెట్ పండితులు కుండబద్దలు కొడుతున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 నుంచి 100 డాలర్లకు పైగా అలాగే కొనసాగితే, రాబోయే మూడు నాలుగు నెలల్లో ధరల బాదుడు మరింత భయంకరంగా ఉండబోతోందని హెచ్చరిస్తున్నారు.


దీనిపై 'మాస్టర్ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ లిమిటెడ్' మేనేజింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కంపెనీలు ఇప్పటికే భరించలేనంత తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని, ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఇదే తీరుగా కొనసాగితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకడం ఖాయమన్నారు.


మరోవైపు 'ఛాయిస్ ఎనర్జీ' అనలిస్ట్ ధవల్ పోపట్ లెక్కల ప్రకారం.. పెట్రోల్ రేటు లీటరుకు కేవలం రూ.1 పెంచితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఆదాయం (EBITDA) సుమారు రూ.15 వేల నుంచి రూ.16 వేల కోట్ల వరకు మెరుగుపడుతుంది. తాజాగా చేసిన రూ.3 పెంపు వల్ల ఏటా రూ.45 వేల నుంచి రూ.48 వేల కోట్ల భారీ ఉపశమనం లభిస్తుంది. కానీ, ప్రపంచ ముడి చమురు ధరలు ఇంకా ఇలాగే భగ్గుమంటే.. పరిస్థితిని బట్టి లీటరుకు మొత్తంగా రూ.10 వరకు ధరలు పెంచాల్సిన కఠిన పరిస్థితి రావచ్చని ఆయన సంచలన హెచ్చరిక చేశారు.


85 శాతం పరాయి దేశాల పైనే.. ద్రవ్యోల్బణ సునామీ!


మన దేశానికి అవసరమైన చమురులో దాదాపు 85 శాతం మనం దిగుమతుల పైనే ఆధారపడుతున్నాం. అంటే, విదేశాల్లో ఏ చిన్న కుదుపు వచ్చినా ఆ దెబ్బ నేరుగా మన బంకుల మీదే పడుతుంది. ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం వాహనాలకే కాదు.. దేశ రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు అమాంతం పెరిగిపోయి ద్రవ్యోల్బణం సునామీలా విరుచుకుపడుతుంది. రేపు ఉదయం మీరు కొనే కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకుల నుంచి ఇల్లు కట్టుకునే నిర్మాణ సామగ్రి వరకు ప్రతి వస్తువు ధర భగ్గుమంటుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ విపత్తును ఆపగలిగే శక్తి ఒక్క ప్రభుత్వ జోక్యానికి (ట్యాక్సులు తగ్గించడం) మాత్రమే ఉంది.


రాబోయే నాలుగు నెలలు సామాన్యుడి జేబుకు కఠిన పరీక్ష! అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు వీడే వరకు ముడి చమురు ధరలు తగ్గే ప్రసక్తే లేదు. లీటరుకు రూ.10 పెంపు అనేది కేవలం అంచనా కాదు, ఏ క్షణమైనా ముంచుకొచ్చే ముప్పు. ఈ ఆర్థిక మాంద్యం వాతల నుంచి తప్పించుకోవాలంటే కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచక తప్పదు. వంటగది బడ్జెట్ నుంచి వ్యక్తిగత ప్రయాణాల వరకు పొదుపు పాటించకపోతే.. ఈ 'పెట్రో' మంటలకు సామాన్యుడి బతుకు బస్ స్టాండ్ అవ్వడం ఖాయం!



Tags: