పెళ్లిళ్లంటే ఒకప్పుడు ఏడు తరాలు చూసి సంబంధాలు కలుపుకునేవారు. కానీ స్మార్ట్‌ఫోన్ చేతికొచ్చాక, ఆన్‌లైన్ పరిచయాలే నేరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. అయితే, వర్చువల్ ప్రపంచంలో పుట్టిన ప్రేమలు రియల్ లైఫ్‌లో ఎంత భయంకరమైన మలుపులు తిరుగుతాయో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టిన ప్రేమ కాస్తా, పెళ్లి మండపంలో ఏకంగా రక్తపాతానికి దారి తీసింది.
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. మండపంలో ఊహించని ట్విస్ట్!
దేవేంద్ర సింగ్ పరిమార్ అనే యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఘాడమైన ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో మే 12న వివాహం జరిపించేందుకు అంతా సిద్ధమైంది.
పెళ్లి రోజు రానే వచ్చింది. బంధుమిత్రుల కోలాహలం మధ్య వరుడి తరపు వారు ఘనంగా పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతోందనుకున్న సమయంలో వధువు మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. తీరా తన ముందు కూర్చున్న వరుడిని చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
'నువ్వు నా రాహుల్ కాదు'.. బద్దలైన అసలు నిజం
వరుడి వేషంలో ఉన్న వ్యక్తి, తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ప్రేమించిన వ్యక్తి కాదని ఆమె అందరి ముందూ బాంబు పేల్చింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆ వధువు.. తనతో ఆన్‌లైన్‌లో ఇన్ని రోజులు మాట్లాడిన వ్యక్తి పేరు రాహుల్ అని, ఇతను నా రాహుల్ కాదని మండపంలోనే తెగేసి చెప్పింది.
దీంతో ఆ పెళ్లి మండపం ఒక్కసారిగా రణరంగంగా మారింది. 'మా అమ్మాయినే మోసం చేస్తారా?' అంటూ వధువు తరపు బంధువులు తీవ్ర కోపంతో ఊగిపోయారు. వరుడితో పాటు అతనితో వచ్చిన బంధువులందరిపైనా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ భయంకరమైన దాడిలో వరుడు దేవేంద్ర తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు.
రంగంలోకి పోలీసులు.. అసలు మోసం చేసింది ఎవరు?
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వరుడు దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ అలోక్ రాజ్ నారాయణ్ వెల్లడించారు. ఈ ఘర్షణకు కారణమైన తొమ్మిది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఇక్కడ అసలు మోసం ఎక్కడ జరిగిందన్నది ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. దేవేంద్ర నిజంగానే వేరే ఫోటోలు పెట్టి మోసం చేశాడా? లేక వధువే మరొకరిని చూసి పొరపడుతుందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
అరచేతిలో ప్రపంచం ఉందని ఆన్‌లైన్ పరిచయాలను గుడ్డిగా నమ్మితే, జీవితం ఎంతటి ఊహించని ప్రమాదాల్లో పడుతుందో ఈ ఘటనే ఒక గుణపాఠం. సోషల్ మీడియాలో కనిపించే ఫిల్టర్ల వెనుక ఉన్న అసలు ముఖాలను గుర్తించకుండా జీవిత భాగస్వామిని ఎంచుకుంటే, అది పెళ్లి పీటల మీదైనా సరే ఇలాగే పరువు, ప్రాణాలు రెండు పోయే ప్రమాదం ఉంది. డిజిటల్ పరిచయాల పట్ల ప్రతి సామాన్యుడూ అప్రమత్తంగా ఉండాల్సిన కఠినమైన సమయమిది!
Also Read:
Petrol Price Hike: నాలుగేళ్ల తర్వాత సామాన్యుడిపై పెట్రో బాదుడు!వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి కాదు.. ఐటీ కంపెనీలకు కేంద్రం క్లారిటీ!
అసెంబ్లీలో విజయ్ స్పీచ్.. పరువు తీసుకున్న వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్
Kerala New CM: కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్!
India Bangladesh Border: బెంగాల్ సీఎం సంచలన నిర్ణయం

