టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే టైటిల్ ఖరారైంది. ఈ రోజు హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవం రోజే ఏకంగా థియేట్రికల్ బిజినెస్ మొత్తం క్లోజ్ చేసుకున్న ఈ టైమ్ ట్రావెల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, 2027 సంక్రాంతి బరిలో దిగనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
[FEATURED_IMAGE]
తన కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పే విభిన్నమైన కథతో శర్వానంద్ ఈసారి శ్రీను వైట్లతో చేతులు కలిపారు. పూర్తి వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరున్న వైట్ల, తన మార్క్ కామెడీకి సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న దర్శకుడికి ఈ ప్రాజెక్ట్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
ఈ చిత్రంలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే సీనియర్ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
సినిమా లాంచ్ అయిన రోజే రైట్స్ మొత్తం అమ్ముడవటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నైజాం హక్కులను ఏషియన్ సురేష్ సంస్థ, సీడెడ్‌ను శిల్పకళ, వైజాగ్ రైట్స్‌ను వాసుదేవ మూవీస్ కైవసం చేసుకున్నాయి. అలాగే కృష్ణ, ఓవర్సీస్ హక్కులను వ్యోమ్ సినిమాస్ దక్కించుకోగా.. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ఏరియాల పంపిణీ కూడా పూర్తయింది. జనవరి 14, 2027న సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.

