నాని 'ది ప్యారడైజ్' టికెట్ ధరల పెంపు.. ఆడియన్స్ ఫైర్!

naveen
By -

Nani The Paradise ticket price hike

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' సినిమా టికెట్ ధరల పెంపు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భారీగా రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో సామాన్య ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో స్పెషల్ షోల రేటు ఏకంగా రూ. 500కు చేరడంతో, ఓటీటీల కాలంలో ఇంత భారీ ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్లాలా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

[FEATURED_IMAGE]

'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మేకర్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకు అధికారికంగా అనుమతులు మంజూరు చేశాయి. అయితే, సినిమా రికవరీ కోసం నిర్మాతలు వేసిన ఈ అడుగు ఇప్పుడు సామాన్య ప్రేక్షకుడి పాలిట శాపంగా మారింది.


తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 23న వేసే స్పెషల్ ప్రీమియర్ షోలకు మల్టీప్లెక్స్‌ల్లో రూ. 400, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 300 చొప్పున వసూలు చేయనున్నారు. అలాగే రిలీజ్ తర్వాత పది రోజుల పాటు రెగ్యులర్ షోస్ పై మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ మల్టీప్లెక్స్ రేటు రూ. 390కి చేరగా, సాధారణ సింగిల్ స్క్రీన్ ధరను రూ. 225గా ఫిక్స్ చేశారు. ఇక స్పెషల్ షోల కోసం ఒక్కో టికెట్‌పై ఏకంగా 500 రూపాయలు వసూలు చేయనున్నారు.


సాధారణంగానే థియేటర్లలో స్నాక్స్, పార్కింగ్ ఖర్చులు తడిసి మోపెడవుతున్న ఈ రోజుల్లో, ఇంత భారీగా టికెట్ రేట్లు పెంచడంపై ఆడియన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సగటున ఒక కుటుంబం థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూడాలంటే కనీసం రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినోదం కోసం ఇంత భారీ మూల్యం చెల్లించే బదులు, ఓటీటీలో వచ్చేదాకా ఆగుతామని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


పెరిగిన నిర్మాణ వ్యయాన్ని సామాన్యుల జేబుల నుండి రాబట్టాలనే ఈ ట్రెండ్ ముందు ముందు థియేటర్ వ్యవస్థకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందన్న విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి. మరి నానిపై ఉన్న క్రేజ్, 'దసరా' కాంబో పై ఉన్న అంచనాలు ఈ టికెట్ రేట్ల భారాన్ని దాటి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ రాబడతాయా? లేదా ఆడియన్స్ థియేటర్లకు ముఖం చాటేస్తారా? అన్నది రిలీజ్ తర్వాతే తేలనుంది.