అలేఖ్య చిట్టి పికిల్స్ మూత.. 'రమ్య మోక్ష పికిల్స్' పేరుతో రీఎంట్రీ!

 


"నువ్వు లైఫ్‌లో ఎంత ఎదగాలంటే పావుకిలో అలేఖ్య చిట్టి పికిల్స్ కొనేంత స్థాయికి ఎదగాలి. అప్పుడే నువ్వు లైఫ్‌లో సెటిల్ అయినట్టు. ‘ఆఫ్ట్రాల్ పచ్చళ్లే కొనలేకపోతున్నావ్. రేపు నీ వైఫ్ బంగారం అడిగితే ఏం కొనిస్తావ్.? నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా.? పచ్చళ్లు కొనలేని డ్యాష్ గాన్వి నీకెందుకురా ఇవ్వన్ని.?’" ఇది గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం. అలేఖ్య చిట్టి పికిల్స్‌కి సంబంధించిన ఒక వీడియో వైరల్ కావడంతో, సోషల్ మీడియాతోనే ఆ వ్యాపారం ఎంతగానో ప్రాచుర్యం పొందిందో, అదే సోషల్ మీడియాతో ఇప్పుడు మూతపడింది. 

అయితే ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. కానీ వారిపై వచ్చిన విపరీతమైన ట్రోల్స్ మరియు మీమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి కారణంగా అలేఖ్య ఆసుపత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా, తాజాగా వారికి సంబంధించిన మరో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వ్యాపారం మూత.. త్వరలో పునరాగమనం

అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య కంచర్ల తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం పూర్తిగా మూతపడిందని, కానీ తాము త్వరలోనే మళ్లీ వస్తామని ఆమె పేర్కొంది. తాము తర్వాతి వ్యాపారం ఏమి చేయబోతున్నామో కూడా ఆమె తెలిపింది. 11 నెలల పాటు తమ అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం బాగా సాగిందని, అయితే ఇటీవల జరిగిన సంఘటనల వల్ల 11 నెలలకే తమ వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చిందని ఆమె వివరించింది. 

ఇక త్వరలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని "రమ్య మోక్ష పికిల్స్" పేరుతో కొత్తగా ప్రారంభిస్తామని ఆమె చెప్పింది. తమ కస్టమర్‌లు, బంధువులు మరియు శ్రేయోభిలాషులు అందరూ తాము మళ్లీ గట్టిగా పునరాగమనం చేయాలని కోరుకున్నారని, అందుకే మరికొన్ని నెలలు సమయం పట్టినా ధైర్యంగా మళ్లీ మీ ముందుకు వస్తామని ఆమె తెలియజేసింది. అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా చూసుకుంటామని కూడా ఆమె హామీ ఇచ్చింది.

మద్దతుపై సందేహం.. కొత్త జాగ్రత్తలు

అయితే మునుపటిలా తమకు మద్దతు ఉంటుందా లేదా అనేది తెలియదని రమ్య అన్నారు. ఇక ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లతో మాట్లాడేందుకు ఒక వ్యక్తిని కూడా నియమించుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా ఆమె తెలిపింది. ఈ కొత్త వ్యాపారంలో తన అక్క అలేఖ్యను భాగస్వామిని చేయబోమని రమ్య కంచర్ల స్పష్టం చేసింది. మొత్తం వ్యాపారాన్ని తానే చూసుకుంటానని ఆమె పేర్కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు