అవమానాలే ఆమె ఆయుధాలు: 13 సినిమాల నుంచి బహిష్కరణ.. 100 కోట్ల విజయం!


సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయం. వచ్చిన స్టార్ డమ్‌ను నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. అయితే, ఇప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న చాలా మంది తారలు గతంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే. అడ్డంకులను అధిగమించి తమ సత్తాను నిరూపించుకోవడం సాధారణమైన విషయం కాదు.

 తాజాగా ఒక హీరోయిన్ అందంగా లేదని, లావుగా ఉందంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తొలగించారట. ఆమె వికారంగా ఉందని కూడా అవమానించారు. అయినప్పటికీ ఆమె నటించిన ఒక సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ స్టార్‌డమ్ సంపాదించుకుంది. 

ఆమె మరెవరో కాదు.. విద్యాబాలన్. బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన ఆమెకు సినిమా అవకాశాలు కూడా అంత తేలిగ్గా రాలేదు. కెరీర్ ప్రారంభంలో ఆమెను ఏకంగా 13 సినిమాల నుండి తొలగించారు. ఈ విషయాన్ని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.

దారుణమైన అవమానాలు.. ఆరు నెలలు అద్దం చూడని పరిస్థితి

ఒక ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ, "ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. అతను నన్ను అసభ్యంగా పిలిచాడు. అతడు అవమానించిన తర్వాత నేను ఆరు నెలల పాటు అద్దంలో నా ముఖం చూసుకోలేకపోయాను" అని తన బాధను వ్యక్తం చేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తన సహజమైన నటనతో ఆమె ఒక గొప్ప నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దీంతో హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. విద్యాబాలన్ మలయాళంలో కూడా అవకాశాలు అందుకుంది, కానీ సినిమా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. దీంతో ఆమెను దురదృష్టవంతురాలిగా అభివర్ణించారు. ఎదుటి వ్యక్తుల మాటలు తనపై తనకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

బాడీ షేమింగ్.. లక్ష్యంపైనే దృష్టి

సినిమా కోసం బరువు పెరుగుతున్న సమయంలో కూడా ఆమెను బాడీ షేమింగ్ చేశారట. కానీ ఆమె ఎదుటివారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన నటనపైనే దృష్టి పెట్టింది. 2010లో ఆమె నటించిన 'కహానీ' సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 

తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విద్యాబాలన్ తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, తన నటనపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు